
కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదా..?
హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఓపెన్ ఛాలెంజ్. సెంటిమెంట్ గుడికి రావాలంటూ..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయం వేడెక్కుతోంది. విమర్వలు ప్రతివిర్మలు కాస్తా సవాళ్లు ప్రతిసవాళ్లుగా మారాయి. తాజాగా ఇవి ప్రమాణాల బాట పట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వం విమర్వలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రస్తుతం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి, అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. హరీష్ రావు నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారన్నారు. ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణ మంత్రివర్గాన్ని హరీష్ రావు.. ఇటీవల దండుపాళ్యం బ్యాచ్ అంటూ అభివర్ణించారు. దందాలు చేస్తూ దండుపాళ్యాన్ని మించిపోయారని హరీష్ రావు దుయ్యబట్టారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. కేబినెట్‌ను దండుపాళ్యం బ్యాచ్ అని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. కేబినెట్‌లో జరగని విషయాలను జరిగినట్లు ఎలా ప్రచారం చేస్తారని నిలదీశారు.
హరీష్.. ఛాలెంజ్‌ను స్వీకరించు..
కేబినెట్‌పై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొందరు మంత్రులను మాఫియా డాన్లు అంటే మరికొందరు దండుపాళ్యం బ్యాచ్ అనడం సబబకు కాదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఈ సందర్భంగానే హరీష్ రావుకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. దేవుడి దగ్గర ప్రమాణం చేద్దామా? అని ఛాలెంజ్ చేశారు. ‘‘హరీష్ రావు సెంటిమెంట్ గుడి.. సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాదం చెద్దామా? హరీష్ ప్రమాణం చేయగలడా? ఇద్దరం తడిబట్టలతో ప్రమాణం చేద్దామా? నేను సీఎం అనుమతి తీసుకుని వస్తా.. నా తల్లిదండ్రులపై ప్రమాణం చేస్తా. నువ్వు చేసిన ఆరోపణలు నిజం అని నువ్వు ప్రమాణం చేస్తావా? చేయగలవా? ఏ శనివారం వస్తావో చెప్పు హరీష్. నా చాలెంజ్‌ను స్వీకరించు. కొండా సురేఖ బిడ్డ.. మా అందరికీ బిడ్డ లాంటిదే’’ అని అడ్లూరి లక్ష్మన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్‌పై కూడా అడ్లూరి లక్ష్మన్ విమర్శలు చేశారు.
‘‘మాఫియా, డాన్లు, కాంట్రాక్టులు, కమిషన్ల గురించి బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. బ్లాక్ మెయిలింగ్ చేయడంలో దిట్ట అయిన బాల్క సుమన్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మంత్రుల గురించి మాట్లాడే ముందు కేసీఆర్ పదేళ్ల పాలనపై ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో గురుకులాల పరిస్థితిని, ప్రస్తుతం గురుకులాల్లో పరిస్థితులను బేరీజు వేసుకుంటే బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం కాంగ్రెస్ ఎంత ప్రాధాన్యతిస్తుందో స్పష్టమవుతోంది. కేసీఆర్ హయాంలో గురుకులాలు అస్తవ్యస్తంగా ఉన్నా నోరు ఎత్తని ప్రవీణ్ కుమార్ ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు’’ అని అన్నారు.
‘‘కొందరు గురుకులాల విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేసి సొంత సైన్యాన్ని నిర్మించుకొని ప్రవీణ్ కుమార్ చేసిన అరాచకాలు బహిరంగ రహస్యమే. తాను ఐపీఎస్ అధికారి అని చెప్పుకునే ప్రవీణ్ కుమార్ తెలంగాణలో సంచలనం రేపిన నేరెళ్ల సంఘటనపై ఎందుకు నోరు మెదపలేదు..? అప్పుడు బీఆర్‌ఎస్ నేతలను కేసీఆర్ ప్రభుత్వం కాపాడుతుంటే దళితులకు న్యాయం కోసం ప్రవీణ్ కుమార్ ఎందుకు ముందుకు రాలేదు..? ఉద్యమం పేరుతో యువతను, విద్యార్థులను రెచ్చగొట్టిన బాల్క సుమన్ బీఆర్‌ఎస్‌లో పదవులు అనుభవించారే కానీ, యువత కోసం ఎప్పుడు పోరాడలేదు’’ అని వ్యాఖ్యానించారు.
‘‘బీఆర్‌ఎస్ హయాంలో ఉద్యోగ నియామకాలు లేకుండా యువత ఉద్యమిస్తుంటే యువనేతగా చెప్పుకునే సుమన్ ఎక్కడ దాక్కున్నారు..? కేసీఆర్ కుటుంబంతో సన్నిహితంగా మెలిగే బాల్క సుమన్ వారి అండతో చేసిన అరాచకాలపై చర్చకు సిద్దమా? శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్న ప్రవీణ్ కుమార్ బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం చేసిన ఫోన్ ట్యాపింగ్, దౌర్జన్యాల గురించి చర్చకు మందుకొస్తారా..? సొంత కుటుంబ సభ్యులను, మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసి తమ చెప్పుచేతల్లో పెట్టుకున్న కేటీఆర్ గురించి ప్రవీణ్ కుమార్ ముందుగా మాట్లాడితే మంచిది. సొంత మంత్రులపైనే నిఘా పెట్టి బ్లాక్ మెయిలింగ్ చేసిన కేసీఆర్ కుటుంబానికి దాసోహమైన ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ లకు కాంగ్రెస్ మంత్రులపై మాట్లాడే హక్కే లేదు’’ అని చెప్పారు.
‘‘సోషల్ మీడియాలో కేసీఆర్ ప్రభుత్వం అరాచకాలను ప్రశ్నించిన వారిని వేధించిన ఘటనలను ప్రవీణ్ కుమార్ మర్చేపోయారు. గ్రేటర్ చుట్టు పక్కల భకబ్జాలకు పెట్టింది పేరు కేటీఆర్ అండ్ కంపెనీ కాదా అని ప్రశ్నిస్తున్నాను. కేసీఆర్ కుటుంబ సభ్యుల బెదిరింపులకు, అరాచకాలకు బెదిరి ఎన్నో కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లిన సంగతి వీరికి తెలియదా..? రైతులకు బేడీలు వేసిన మీరు రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం’’ అని ఎద్దేవా చేశారు.