పిల్లలకు సన్నబియ్యం బదులు దొడ్డు బియ్యం..
x

పిల్లలకు సన్నబియ్యం బదులు దొడ్డు బియ్యం..

గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్.


విద్యార్థుల సంక్షేమం విషయంలో రాజీ అన్న మాటలకు కూడా తావిచ్చేది లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో కాకుండా దొడ్డు బియ్యంతో వండిన అన్నం పెడుతుండటంపై ఆయన మండిపడ్డారు. దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా చింతకుంట బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగానే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు దొడ్డుబియ్యంతో వండిన అన్నం పెడుతుండటాన్ని గమనించారు. దీనిపై ఆరా తీసిన ఆయనకు పదిహేను రోజులుగా ఇలా చేస్తున్నట్లు ప్రిన్సిపాల్, విద్యార్థులు చెప్పారు. తమ పాఠశాలకు ఆ బియ్యమే వస్తున్నాయని, అందుకని వాటితోనే భోజనం పెడుతున్నామని ప్రిన్సిపాల్ వివరించారు.

వెంటనే కలెక్షర్, సివిల్ సప్లై కమిషనర్‌తో మంత్రి ఫోన్లో మాట్లాడారు. పాఠశాలకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్న డీఎస్వోపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురుకుల పాఠశాలకు దొడ్డు బియ్యం పంపొద్దని చెప్పారు. అంతేకాకుండా గురుకుల భూములను ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్నారు.. కబ్జాలకు గురికాకుండా కలెక్టర్, రెవెన్యూ అధికారులు చూడాలని సూచించారు. విద్యార్థులకు అందవల్సిన వాటి నాణ్యత విషయంలో తాను రాజీ పడేది లేదని మరోసారి స్పష్టం చేశారు.

Read More
Next Story