Jupally Krishna rao
x

కాంగ్రెస్ సర్కార్‌పై మంత్రి జూపల్లి హాట్ కామెంట్స్..

ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందో.. లేదో తెల్వదన్న మినిస్టర్.


సొంత పార్టీ, ప్రభుత్వంపై మంత్రి జూపల్లి కృష్ణారావ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందో? లేదో? తెల్వదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ నమూనా గృహ ప్రారంభోత్సవంలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. విపక్షాలకు మంచి వెపన్‌లా మారుతున్నాయి. ప్రభుత్వం పాలన ఎలా ఉందో తెలియాలంటే ఈ మంత్రి మాటలు సరిపోతాయంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికయినా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలుకుతున్నాయి. మంత్రికి ఏడాదిలోనే జ్ఞానోదయం అయిందని, కాంగ్రెస్ చేస్తున్న మోసాలు అవగతం అయ్యాయంటూ చురకలంటిస్తున్నాయి విపక్షాలు.

నేను హామీలియ్య: జూపల్లి

‘‘నేను హామీలు ఇవ్వను. ఎందుకంటే అవి అమలవుతాయో.. లేదో తెల్వదు. వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తానో.. లేదో తెలియదు. పోనీ నేను గెలిచినా మా పార్టీ గెలుస్తుందో.. లేదో తెలియదు. పార్టీ గెలిచినా మా ప్రభుత్వం వస్తుందో రాదో కూడా డౌటే. అదీ జరిగినా మళ్ళీ ఈ పథకాలు ఉంటాయో లేదో అంతకంటే తెలియదు. అందుకే నేను నా నియోజకవర్గంలో కూడా హామీలు ఇవ్వను. నా జేబులోంచి తీసి ఇచ్చే పనైతే.. నేను చేస్తా. అలా కానిపక్షంలో నేను ఇచ్చే హామీ మోసపు మాట అవుతుంది కాబట్టే హామీలు ఇవ్వను. ప్రజలకు ఏం కావాలో అవి చేస్తా’’ అని మంత్రి జూపల్లి అన్నారు.

కాంగ్రెస్‌లో దుమారం..

మంత్రి జూపల్లి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో దుమారం రేపుతోంది. ఇప్పటికే పలువురు నేతల మధ్య అంతర్గత విభేదాలతో తెలంగాణ కాంగ్రెస్ సతమతమవుతోంది. ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్న వ్యక్తే పార్టీ గెలుపుపై సందేహాలను వ్యక్తం చేస్తూ మాట్లాడటం కీలకంగా మారింది. ఒకవైపు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని సీఎం రేవంత్ సహా మంత్రులు ఘంటాపథంగా అంటున్నారు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా మంత్రి జూపల్లి.. పార్టీ నేతలు వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా, పార్టీ గెలుస్తుందో లేదో.. గెలిచినా మా ప్రభుత్వం వస్తుందో లేదో అనడం పార్టీలో మరో చర్చకు దారితీస్తోంది. మరి ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Read More
Next Story