
చర్లపల్లిలో పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ.12వేల కోట్లు కాదా..!
బోయిన్‌పల్లిలో పాఠశాల పాత భవనం కేంద్రంగా డ్రగ్స్ తయారీ ముఠా గుట్టు రట్టు.
గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడొదని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆ దిశగానే అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. వీటి విషయంలో మరింత పకడ్బందీగా ముందుకు సాగాలని, డ్రగ్స్ రహిత నగర నిర్మాణమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ఆబ్కారీ భవన్‌లో రాష్ట్ర ఆబ్కారీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారలతో శనివారం మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అధికమవుతున్న కల్తీమద్యం, డ్రగ్స్ అదల్ట్రేషన్ వంటి అంశాలపై చర్చించారు. గతంలో చోటుచేసుకున్న ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ సందర్భంగానే ఇటీవల చర్లపల్లిలో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు కావడం, అందులో భారీ మొత్తంలో డ్రగ్స్ తయారీ ముడిసరుకు లభించడంపై కూడా మంత్రి జూపల్లి స్పందించారు.
‘‘చర్లపల్లి ఘటనలో రూ.12వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయని వార్తలు వస్తున్నాయి. అవన్నీ అవాస్తవాలు. వాస్తవానికి రూ.3 నుంచి 4 కోట్ల విలువైన డ్రగ్స్ మాత్రమే పట్టుబడ్డాయని అంచనా వేశాం. అంతేకాకుండా అది పెద్ద ఫ్యాక్టరీ కాదు.. చిన్న షెడ్ మాత్రమే. అక్కడ కొందరు డ్రగ్స్ తయారు చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఆ సమయంలోనే పోలీసులు పట్టుకున్నారు’’ అని జూపల్లి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగానే అధికారులంతా కూడా ప్రభుత్వం పరువు పెంచేలా వ్యవహరించాలని అన్నారు.
చర్లపల్లి ఫ్యాక్టరీ విషయం ఏంటంటే..
కుత్బుల్లాపూర్‌లో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేసిన దాడుల్లో ఈ డ్రగ్స్ తయారీ యూనిట్ గుట్టు రట్టయింది. ఈ దాడుల్లో పోలీసులు 32వేల లీటర్ల ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మిథైలెనెడియాక్సీ మెథాం ఫెటమైన్ వంటి ముడి పదార్థాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ఫ్యాక్టరీని బేస్‌గా మార్చుకుని పెద్దమొత్తంలో డ్రగ్స్‌ను తయారు చేస్తున్నారని, వాటిని దేశంలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ తయారు చేసిన డ్రగ్స్‌ను మోలీ, ఎక్స్‌టీసీ పేర్లతో సరఫరా చేస్తున్నారని పోలీసులు చెప్పారు. ఈ డ్రగ్స్ అంశంపై స్థానిక పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్‌లోని ఫ్యాక్టరీలో తయారు చేసిన డ్రగ్స్‌ను కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాలకు కూడా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సరఫరాకు నిందితులు ఏ మార్గం ఎంచుకున్నారు? విదేశాలకు ఎలా తరలిస్తున్నారు? దేశంలో వీరికి ఇంకా ఎన్నిక కేంద్రాలు ఉన్నాయి? వంటి అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాఠశాల భవనంలో డ్రగ్స్..
తాజాగా హైదరాబాద్ బోయిన్‌పల్లిలో మత్తుపదార్థాలు తయారు చేస్తున్న కేంద్రం గుట్టురట్టయింది. స్థానిక పాఠశాలకు చెందిన పాత భవనం అడ్డాగా ఈ డ్రగ్స్ తయారీ జరుగుతోంది. పక్కా సమాచారం అందడంతో ఈగల్ టీమ్ దాడులు చేసింది. వీటిలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భారీ మొత్తంలో ఆల్ఫాజోలం మత్తపదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకను్నారు. మత్తమందు తరలిస్తున్న నలుగురు సభ్యలను అరెస్ట్ చేశారు పోలీసులు. పాఠశాల పాత భవనం నుంచే వీరు దందా చేస్తున్నారా? దీని గురించి భవనం యజమానికి తెలుసా? ఈ ముఠా వెనక ఇంకా ఎంతమంది ఉన్నారు? అనే కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు పోలీసులు.