‘కేటీఆర్ ఒక జోకర్’.. కోమటిరెడ్డి సెటైర్లు
x

‘కేటీఆర్ ఒక జోకర్’.. కోమటిరెడ్డి సెటైర్లు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. విద్యుత్ ఛార్జీల అంశంపై కేటీఆర్.. ఈర్సీకి వెళ్లడం ఓ పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు.


మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. విద్యుత్ ఛార్జీల అంశంపై కేటీఆర్.. ఈర్సీకి వెళ్లడం ఓ పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. అసలు ఈ విద్యుత్ ఛార్జీల సమస్యలకు మూలం ఉందే వారి ప్రభుత్వంలో కాదా? అని ప్రశ్నించారు. కేటీఆర్ ఒక జోకర్ అంటూ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికసార్లు ఓడించినా, ప్రజలు నువ్వ మాకొద్దంటూ ముఖానే ఛీ కొడుతున్నా బీఆర్ఎస్, కేటీఆర్‌లకు సిగ్గు రావట్లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎంతో పాటుపడుతున్నా.. చిన్నచిన్న విషయాలతో ప్రజలను మోసం చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘పార్లమెంటులో సున్నా స్థానాలకే పరిమితం చేసి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించినా కేటీఆర్‌కు బుద్దిరాలేదు. మా ప్రభుత్వం ప్రతి నెల పేదోళ్లకు 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తోంది. కేంద్రమంత్రులు సంజయ్, కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఎంత నిధులు తీసుకొచ్చారు’’ అని ఆయన ప్రశ్నించారు. దీనికి వారు సమాధానం చెప్పాలని అన్నారు. అనంతరం అసెంబ్లీ, కౌన్సిల్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. అతి త్వరలోనే పార్లమెంట్ సెంట్రల్‌హాల్ తరహాలో అసెంబ్లీని కూడా అభివృద్ధి చేస్తామన్నారు.

రూ.49కోట్లతో అసెంబ్లీ రినొవేషన్

అసెంబ్లీని మా ప్రభుత్వం రూ.49 కోట్ల వ్యవయంతో రినోవేట్ చేయనుందని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. ‘అసెంబ్లీలో చేపట్టిన పనులను 3 నెలల వ్యవధిలో పూర్తి చేస్తాం. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారు. నిజాం తరహాలో అసెంబ్లీని ఎలా కట్టారో అలా మార్పులు చేస్తున్నాం. పార్లమెంటు సెంట్రల్ హాల్ తరహాలోనే అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే దగ్గర ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ‘‘ప్రస్తుతం అసెంబ్లీ నుంచి కౌన్సిల్‌కు వెళ్లాలంటే మంత్రులు, సీఎం కార్లు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది. కానీ ఈ రెండు ఒకే భవనంలో ఉంటే ఆ ప్రయాణ సమయం కలిసొస్తుంది’’ అని తెలిపారు.

అందుబాటులోకి విద్యుత్ అంబులెన్స్‌లు

ఈ క్రమంలోనే తెలంగాణలో మెరుగైన విద్యుత్ సేవలందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న ఆలోచన చేసింది. అందులో భాగంగానే విద్యుత్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యుత్ అంబులెన్స్‌లంటే.. విద్యుత్‌తో నడిచే అంబులెన్స్‌లు కాదు. విద్యు పోయిందంటే వెంటనే వచ్చి సరిచేసే అంబులెన్స్‌లు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు ఆంబులెన్స్ తరహాలో స్పెషల్ వాహనాలను తీసుకొచ్చామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఆయన ఇవాళ హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యుత్ సరఫరా ఎమర్జెన్సీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ ఎమర్జెన్సీ వాహనాలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే 1912 నంబర్‌కు ఫోన్ చేయాలని, వెంటనే అత్యవసర సిబ్బంది అందుబాటులోకి వస్తారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 57 డివిజన్‌లు ఉంటే ప్రతి డివిజన్‌కూ ఒక వాహనాన్ని కేటాయించామని చెప్పారు. రోజు రోజుకూ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే తక్షణమే సిబ్బంది అవసరమైన పరికరాలతో అక్కడకు చేరుకుని స్వల్ప వ్యవధిలోనే పునరుద్ధరణ చేపడతారని భట్టి చెప్పారు.

Read More
Next Story