
ఎవరికీ ఇబ్బందులు రాకుండా చూస్తాం: మంత్రి
రద్దీ పెరిగితే టోల్ వసూలు చేయొద్దంటూ ఆదేశించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ఎంతలా అంటే హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయేలా ఉంది. వేలాది మంది ట్రాఫిక్‌లో తిప్పలు పడుతున్నారు. కాగా ఈ విషయంపై తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంటకట్ రెడ్డి స్పందించారు. హైవేపై ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్-విజయవాడ హైవేపై పరిస్థితిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరిశీలించారు. పోలీసులు, అధికారులతో చర్చించారు. హైవేపై పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, రహదారి విస్తరణను నాణ్యత ప్రమాణాలతో వేగంగా పూర్తిచేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైవేపై వంతెనల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో మిషన్లను కూడా తొలగించినట్లు చెప్పారు.
‘‘నేషనల్ హైవేల డైరెక్టర్‌తో ఇప్పటికే మాట్లాడాను. టోల్‌ప్లాజాల దగ్గర రద్దీ పెరిగితే టోల్ వసూలు చేయకుండా పంపాలని చెప్పాం. రోడ్లపై వాహనాలు ఆగిపోతే వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పాం. అందుకు క్రేన్లను కూడా సిద్ధంగా ఉంచాం’’ అని ఆయన చెప్పారు.

