
తనను రెడ్లు దెబ్బతీయాలని చూస్తున్నారు
మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు
తనను రెడ్లు దెబ్బతీయాలని చూస్తున్నారని దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హన్మకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొండా సురేఖ మాట్లాడుతూ.. మంత్రిగా నేను ఏ పని చేసినా కొందరు వివాదం సృష్టిస్తున్నారని అన్నారు. రెడ్లు కక్షగట్టి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కొండా సురేఖ అన్నారు. నాగార్జున విషయంలో తప్పుగా ప్రచారం చేశారని, తాను అలా అనలేదని కొండా వివరణ ఇచ్చుకున్నారు. నాగార్జున ఇష్యూ అయ్యాక తాను మీడియాతో కూడా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నాను అని ,మౌనంగా తన పని తాను చేసుకుంటున్నాను అని కొండా సురేఖ స్పష్టం చేశారు.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. తన ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని..కొంతమంది రెడ్లు లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ, హైదరాబాద్‌లో లాబీయింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. ఏది ఉన్నా పార్టీ అధిష్ఠానం దృష్టికి తెస్తానని ఆమె అన్నారు. మంత్రిగా తన బాధ్యతలు ఏమిటో తనకు తెలుసునన్నారు.
పనులు వేగంగా జరగాలన్నదే తనది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమతమని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ప్రతి విషయం ఒపెన్‌గా మాట్లాడటం తనకు అలవాటు అని చెప్పుకొచ్చారు. మేడారం టెండర్ల విషయంలో తనకు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని మంత్రి సురేఖ అన్నారు. మూడు కంపెనీలు టెండర్లు వేశాయని, అందులో ఎవరి ఎలిజిబులిటీ వారిదని తెలిపారు.
మంత్రి కొండా సురేఖ ఇటీవలె ఇద్దరు మంత్రులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన శాఖలో ఆ ఇద్దరు మంత్రుల జోక్యమేమిటని బాహాటంగానే విమర్శించారు. కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిన మంత్రుల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకరు. ఆయన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. తర్వాత అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
మేడారం టెండర్లను తన అనుచరులకు ఇప్పించుకోవాలని పొంగులేటి చూస్తున్నారని, తన శాఖలో ఆయన పెత్తనమేమిటని ప్రశ్నించారు. కొండా సురేఖ ఆరోపణలకు పొంగులేటి రియాక్ట్ అయ్యారు. చిన్న చిన్న టెండర్లకు కక్కుర్తి పడే మనిషిని కాదని పొంగులేటి వివరణ ఇచ్చుకున్నారు.