మంత్రుల పర్యటనలు.. పొంగులేటికి యాక్సిడెంట్
x

మంత్రుల పర్యటనలు.. పొంగులేటికి యాక్సిడెంట్

తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తున్నారు. స్థానిక పరిస్థితులపై ఆరా తీస్తూ... ప్రజలకు ధైర్యం చెబుతున్నారు.


తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తున్నారు. స్థానిక పరిస్థితులపై ఆరా తీస్తూ... ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించే పనుల్లో పడ్డారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రమాదానికి గురయ్యారు. ఆయన కాలికి గాయాలయ్యాయి.

ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలో ఎగువ నుండి భారీగా వరద పోటెత్తడంతో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఖమ్మంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రూరల్ మండలం మున్నేరు పరివాహక ప్రాంతంలోని నాయుడుపేట, జలగం నగ,ర్ దానవాయిగూడెం లో వరద ఉధృతి కారణంగా నీట మునిగిన కాలనీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బైక్ పై తిరుగుతూ పర్యటించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మంత్రి పొంగులేటి బైక్ పై నుండి కింద పడ్డారు. ఆయన కాలికి గేర్ రాడ్ గుచ్చుకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. దెబ్బలు పెద్దగా తగలకపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు అనంతరం ఆయనకి చికిత్స అందించారు.

నష్టపరిహారం చెల్లిస్తాం -ఉత్తమ్

ఖమ్మం జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాలోనూ వరద బీభత్సం సృష్టించింది. కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై పాలేరు వాగు పొంగి ప్రవహించింది. ప్రవాహం ధాటికి ఆంధ్రా, తెలంగాణకు వారధిగా ఉన్న బ్రిడ్జ్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కోదాడ పట్టణంలో వరదల్లో చిక్కుకుని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

సోమవారం ఉదయం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నడిగూడెం మండలం రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు పడిన గండి ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "దురదృష్టవశాత్తు కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లోనే అతి భారీ వర్షాలు పడ్డాయి. కోదాడ ప్రాంతంలో ఇద్దరు చనిపోవడం బాధాకరం. లెఫ్ట్ కెనాల్ తెగిపోవడం వల్ల సుమారు 300 ఎకరాలకు నష్టం వాటిల్లింది, ముఖ్యమంత్రితో చర్చించి నష్టపోయిన పంటకు నష్ట పరిహారం చెల్లిస్తామని హమీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వారం రోజుల్లో కాలవకు పడ్డ గండిని పూడ్చేందుకు చర్యలు తీసుకుంటాం" అని హామీ ఇచ్చారు.

Read More
Next Story