
‘తెలంగాణ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..’
మొంథా దెబ్బకు రాష్ట్రంలో భారీగా పంట, ఆస్తి నష్టం జరిగిందన్న మంత్రులు.
మొంథా తుఫాను ప్రభావం తెలంగాణ అంతటా తీవ్రంగా ఉంది. రైతులు తీవ్రంగా నష్ట పోయారు. పలు జిల్లాల్లో రైతుల ఆరబోసిన ధాన్యం రాసులు వర్షానికి కొట్టుకుపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో చేతికొచ్చిన పంట.. వర్షాలకు నీళ్లపాలయింది. ఈ నేపథ్యంలోనే తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులపై సీఎం రేవంత్ సహా మంత్రులు దృష్టి సారించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అక్కడి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రైతులకు జరిగిన పంటనష్టం, రాష్ట్రంలో జరిగిన ఆస్తి నష్టాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. మొంథా దెబ్బకు భారీగా రోడ్లు దెబ్బతిన్నాయని కోమటిరెడ్డి తెలిపారు. కాగా నష్టం జరిగిన ప్రతి రైతులు ప్రభుత్వం ఆదుకుంటుందని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
కేంద్రం ఆదుకోవాలి: పొన్నం
మొంథా తుపాను దెబ్బకు సిద్దిపేటలో నీటమునిగిన పంటలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. రైతులకు భయాందోళన చెందొద్దని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘‘హుస్నాబాద్ నియోజకవర్గం పూర్తిగా జలమయం అయింది. హుస్నాబాద్‌లో పర్యటించాలని సీఎంను కోరాం. తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను కేంద్రం ఆదుకోవాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.
దెబ్బతిన్న 230 కిలోమీటర్ల రోడ్లు: కోమటిరెడ్డి
‘‘మొంథా తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 230 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్లు, భవనాలశాఖ అప్రమత్తంగా ఉంది. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాం. దెబ్బతిన్న రోడ్లు, భవనాలు, కాజ్‌వే పునరుద్దరణ కోసం రూ.7 కోట్లు ఖర్చు అవుతుంది. దెబ్బతిన్న రోడ్లు శాశ్వత పునరుద్దరణకు రూ.225 కోట్లు ఖర్చు అవుతుంది. తుపాను దెబ్బకు నల్గొండలో భారీ నష్టం జరిగింది. వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బిన్నాయి. ఐకేపీ సెంటర్లో 2 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయి. పత్తి తేమ శాతం గురించి ఇప్పటికే సీసీఐ ఛైర్మన్‌ను కలిశా. నిబంధన సడలించాలని రైతుల పక్షాన ముంబైకి వెళ్లి విజ్ఞప్తి చేశా’’ అని తెలిపారు.

