Ponnam Prabhakar | ‘ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వారికి తొలి ప్రాధాన్యత’
x

Ponnam Prabhakar | ‘ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వారికి తొలి ప్రాధాన్యత’

తెలంగాణలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటిపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని జిల్లాల అధికారులతో సమావేశమయ్యారు.


తెలంగాణలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చాలా కాలంగా రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ చేయకపోవడంతో అనేక మంది వీటికోసం పడిగాపులు కాస్తున్నారని, గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా కొత్త రేషన్ కార్డులు అందించలేదని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల జారీ‌కి సిద్ధమైంది. అతి త్వరలోనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ పథకం అమలుపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 4 పథకాల ప్రారంభోత్సవానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం ఈ పథకం అమలు గురించి వివరించారు. ఈ నెల 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల పరిశీలన జరగనున్నట్లు తెలిపారు. హైదారాబాద్‌కి సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కానుక ఈ రెండు పథకాలు హైదరాబాద్, జీహెచ్ ఎంసీ పరిధిలో లేవని, మిగతా రెండు కార్యక్రమాలు రేషన్ కార్డులు పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ అతి త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు.

‘‘ప్రతి లబ్దిదారులకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి. అర్హులందరికీ లబ్ధి జరిగేలా ఎంపిక ప్రక్రియ జరగాలి. హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా సర్వే అనంతరం కూడా మీరు అధికారులకు సమాచారం ఇవ్వచ్చు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అర్హులందరికీ న్యాయం చేస్తుంది. రాజకీయ ప్రలోభాలు ఉండవు. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులు ఇవ్వడానికి కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. అన్ని ఉమ్మడి జిల్లాలో ఇన్చార్జి మంత్రులు సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు’’ అని తెలిపారు.

అందులో భాగంగానే ఆదివారం హైదరాబాద్ జిల్లాలో సమావేశం జరిగిందని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారులతో సమావేశం జరిగిందని, ప్రజలంతా ప్రభుత్వం అదిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పొన్నం ప్రభాకర్ కోరారు. ‘‘ఈ నెల 16, 20వ తేది మధ్య ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఫీల్డ్ వెరిఫికేషన్ తరువాత వచ్చిన జాబితాపై జనవరి 20-24 మధ్య వార్డుల వారీగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాం. అనంతరం ఈ నెల 21, 25 తేదీల మధ్య డేటా ఎంట్రీ పూర్తి చేయాలి. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. 26 నుండి కొత్త రేషన్ కార్డులు వస్తాయి.. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ప్రకటన ఉంటుంది’’ అని తెలిపారు.

‘‘ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో స్థలం ఉండి ఇండ్లులేని వారికి ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పటి వరకు భూమి ఉండి ఇళ్లు లేని వారికి 50 శాతం అప్లికేషన్‌లు వచ్చాయి. హైదరాబాద్‌లో స్థలం అంశం ప్రత్యేకమైనది. మల్టీస్టేర్ కట్టడానికి లేదా స్లమ్స్ డెవలప్ చేసి ఇల్లు నిర్మించేలా యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం. హైదరాబాద్ ఇల్ల సమస్య పరిష్కారం చేస్తం. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. హైదరాబాద్ ప్రజలకు ఎక్కడా అన్యాయం జరగనివ్వం..మైగ్రేషన్ అయిన వారికి ఇళ్లు, రేషన్ ఇవ్వాలి. ప్రజలు సహకరించాలి. జీరో టూ క్రెటీరియ ఉంటది. మండలాలు, వార్డుల వారీగా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ, రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా సజావుగా జరుగుతుంది’’ అని స్పష్టం చేశారు.

‘‘రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు న్యాయం జరగాలని పేద ప్రజల సొంతింటి కళ నిజం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను ప్రజలు స్వచ్చందంగా సానుకూలంగా ఈ ప్రక్రియను విజయవంతం చేయాలి. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసిన ప్రజల సహకారం కావాలి. ప్రభుత్వం ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కి గ్యాస్, రూ.2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10లక్షల ఆరోగ్య శ్రీ అందిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం. ప్రభుత్వ వసతిగృహాల్లో డైట్ చార్జీలు పెంచాం. రైతు భరోసా రూ.12 వేలు ఇస్తున్నాం. భూమి లేని రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తున్నాం.. ఇప్పుడు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్ రూంలు పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసినా తమ ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాలను అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం’’ అని మంత్రి తెలిపారు.

Read More
Next Story