
రాష్ట్రానికి రక్షణశాఖ భూములు ఇవ్వండి..: పొన్నం ప్రభాకర్
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వినతి పత్రం అందించిన మంత్రి.
హెచ్‌ఐసీసీలో జీటో కనెక్ట్ ఎగ్జిబిషన్‌ను కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఇందుకోసం ఆయన శుక్రవారం తెలంగాణకు విచ్చేశారు. ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగానే రాజ్‌నాథ్ సింగ్‌కు పొన్నం ప్రభాకర్ ఓ వినతి పత్రాన్ని అందించారు. రాష్ట్రంలోని రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి తమ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈమేరకు మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్.. సంతకాలు చేసిన వినతి పత్రాన్ని కేంద్రమంత్రికి అందించారు. కాగా వినతి పత్రాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారని పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘జంట నగరాల్లో ప్రజలకు కీలకమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో రక్షణశాఖ భూములు ఎంతగానో ఉపయోగపడతాయి. కంటోన్మెంట్ నుంచి తెలంగాణ సర్కార్ రావాల్సిన యూజర్ ఛార్జీలు రూ.1000 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ బకాయిలను సకాలంలో విడుదల చేయడం వల్ల రక్షణశాఖ పరిధిలో అభివృద్ధి జరుగుతున్న ప్రాంతాల్లోని ప్రజలకు సదుపాయాలు కల్పించడం, అవసరమైన పౌర సేవలు కొనసాగించడంలో ప్రభుత్వానికి మద్దతు లభిస్తుంది. అదే విధంగా ప్రజా వినియోగం కోసం కొన్ని రక్షణశాఖ భూములను ప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీకరించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అని పొన్నం పేర్కొన్నారు. ఆ భూములను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.