కేటీఆర్ ఢిల్లీకి వెళ్లింది కేసుల నుంచి తప్పించుకోవడానికా..!
x

కేటీఆర్ ఢిల్లీకి వెళ్లింది కేసుల నుంచి తప్పించుకోవడానికా..!

కేటీఆర్.. ఢిల్లీకి వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామానికి దారి తీసింది. ఈ విషయంపై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.


తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ టూర్‌కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉన్నపళంగా ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్లారన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. తన ఢిల్లీ పర్యటనలో కేటీఆర్.. కేంద్ర పెద్దలతో భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లో ఏం చర్చించనున్నారన్నది కీలకంగా మారింది. ఆయన ఢిల్లీకి పార్టీ పనులపైనో, సొంత పనులపైనో కాదు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రానికి ఫిర్యాదు చేయడానికే వెళ్తున్నారంటూ ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్.. ఢిల్లీ బాట పట్టారని ఆయన ఆరోపించారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా కేటీఆర్.. పోలీసుల విచారణకు సహకరించాలనేకానీ మొఖం చాటేయడం సబబు కాదని హితవు పలికారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

తప్పు చేయకపోతే ఉలికిపాటెందుకు

‘‘ఫార్ములా ఈ రేసింగ్ అక్రమాలపై కేటీఆర్ మీద ఆరోపణలు వస్తున్నాయి. కార్ రేసింగ్‌కి డబ్బులు ఇచ్చామని స్వయంగా కేటీయారే చెప్తున్నారు. తనను కాపాడుకునేందుకు కేటీఆర్ ఢిల్లి వెళ్తున్నారు. కేటీఆర్ తప్పు చేయకుంటే విచారణకు సహకరించాలి. అమృత్ పథకం అక్రమాలపై ఫిర్యాదు చేయడానికే కేటీఆర్ ఢిల్లి వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైన కేటీఆర్ తప్పు ఒప్పుకుంటే మంచిది. అమృత్ పథకంలో అక్రమాలంటూ ఢిల్లిలో బీజేపీతో దోస్తీ చేసేందుకు వెళ్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో అక్రమాలపై చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తున్నాము’’ అని తెలిపారు.

కేంద్రం ముందు మోకరిల్లడానికే

‘‘రవాణా శాఖలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు 113 మందికి సిఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. వీరిని ఎన్ ఫోర్స్ మెంట్‌లో వినియోగిస్తాం. డిల్లీకి వెళ్లి అమృత్ పథకం మీద ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ చెబుతున్నారు. కార్ రెస్ కు సంబంధించి ఇటీవలే గవర్నర్ అనుమతి కోరాము. మేము ఎవరిని జైల్లో పెడతాం అనడం లేదు. తనను తాను రక్షించుకేనేందుకు కేటీఆర్ కేంద్రం వద్ద మోకరిల్లెందుకు వెళుతూ...ప్రజల దృష్టిని మరల్చుతున్నారు. అమృత్ పథకంలో అవినీతి జరిగితే కేంద్రానికి ఫిర్యాదు చేయవచ్చు. కానీ మీ మీద జరిగే విచారణను ఆపుకునేందుకు వెళుతున్నట్లు కాంగ్రెస్ భావిస్తోంది. విచారణకు సహకరించి మీ చిత్త శుద్ధి నిరూపించుకొండి’’ అని కేటీఆర్‌ను ఛాలెంజ్ చేశారు.

అప్పుడే వణికితే ఎలా

కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్.. ఎక్స్‌(ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఇప్పుడే ఢిల్లీకి వచ్చాను అప్పుడే భయంతో వణికిపోతే ఎలా అంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ఇప్పుడే ఢిల్లీలో దిగాను. హైదరాబాద్‌లో వస్తున్న ప్రకంపనలను విన్నాను. అప్పుడే వణికిపోతే ఎలా’’ అని కేటీఆర్ పోస్ట్ పెట్టారు. కేటీఆర్ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Read More
Next Story