
మళ్లీ కరీంనగర్‌లో చేరనున్న హుస్నాబాద్
చేసి తీరుతామన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మళ్ళీ కరీంనగర్‌లోకి వెళ్లనుందా? ప్రస్తుతం తెలంగాణలో ఈ ప్రశ్న తీవ్ర చర్చలకు దారితీస్తోంది. కాగా తాజాగా ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం అదే జరగనుందని స్పష్టం చేస్తుంది. హుస్నాబాద్‌ను మళ్ళీ కరీంనగర్ పరిధిలోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం తాము రాజకీయాల కోసమో, మరే ఇతర స్వప్రయోజనాల కోసమే తీసుకోవడం లేదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ ప్రకటనతో సిద్దిపేట జిల్లా భవిష్యత్తు దాని సరిహద్దుల్లో మార్పులు ఉంటాయా లేక జిల్లా యథాతథంగా కొనసాగుతుందా అనే అంశాలపై రాజకీయ పరిపాలనా వర్గాల్లో ఆసక్తి పెరిగింది. హుస్నాబాద్ మండలాన్ని సిద్దిపేట నుంచి వేరు చేసిన పక్షంలో సిద్దిపేట జిల్లా పరిధి తగ్గుతుందా లేక ఇతర జిల్లాల పరిధిలోని కొన్ని ప్రాంతాలను సిద్దిపేటలో కలుపుతారా అన్న ప్రశ్నలకు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం సమగ్ర నిర్ణయం తీసుకోనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ పరిణామాలకు రాజకీయ నేపథ్యమూ ఉంది. గతంలో అధికారంలో ఉన్న సమయంలో సిద్దిపేట జిల్లా ప్రయోజనాల కోసం జనగామను జిల్లా కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో కొత్తగా ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లాలు బలంగా ఉండాలంటే జనగామను జిల్లా చేయకూడదన్న వ్యూహం వెనుక హరీష్ రావు ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.
అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతో చివరి విస్తరణ దశలో జనగామను జిల్లా చేయడానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని సమాచారం. ఆ నిర్ణయం అనంతరం రాష్ట్రంలో జిల్లాల సమీకరణ మరింత మార్పులకు లోనైంది.
ప్రస్తుత పరిస్థితుల్లో అప్పట్లో తీసుకున్న నిర్ణయాల ప్రభావమే ఇప్పుడు సిద్దిపేట జిల్లా ఎదుర్కొంటున్న సవాళ్లకు కారణమవుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకప్పుడు వ్యూహాత్మకంగా జిల్లాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన నేతలే ఇప్పుడు సిద్దిపేట జిల్లాను కాపాడుకునే పరిస్థితి ఎదుర్కొంటున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తంగా హుస్నాబాద్ బదిలీ నిర్ణయంతో తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఈ మార్పులను పరిపాలనా సౌలభ్యం ప్రజల అవసరాల దృష్ట్యా ఎలా అమలు చేస్తుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

