‘ఆర్టీసీ ఉద్యోగులకు అన్నీ కల్పిస్తాం’.. పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్
టీఎస్‌ఆర్‌టీసీ కార్మికులు, ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. మహలక్ష్మీ పథకం అమలై 300 రోజులు పూర్తయినట్లు గుర్తు చేశారు.
టీఎస్‌ఆర్‌టీసీ కార్మికులు, ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్‌టీసీ ఉద్యోగులు, కార్మికులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలను కూడా అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన సందర్బంగా ఆయన పలు కీలక అంశాలను వెల్లడించారు. ఆర్టీసీని అభివృద్ధి చేస్తామని, రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం కోసం ఆర్టీసీ.. జేబీఎం సంస్థతో ఒప్పందం చేసుకుందని వివరించారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డీజిల్ బస్ కూడా లేకుండా ప్రణాళికలలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఆర్టీసీని మెరుగుపరచడం కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నామని, మహిళల కోసం మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయడం కూడా అందులో భాగమేనని వివరించారు. ఇప్పటి వరకు వేల కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచింతంగా ప్రయాణం చేశారని వెల్లడించారు. రాష్ట్ర ఆర్టీసీని దేశానికే స్ఫూర్తిదాయకంగా మారుస్తామని, అందుకోసం ప్రణాళికలు రెడీ చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తామని, వారి కోసం పీఆర్‌సీ, కారుణ్య నియామకాలపై స్పెషల్ ఫోకస్ పెడతామని తెలిపారు. అన్ని జిల్లాల్లో ఎలక్ట్రిక్ బస్సులు తిప్పడానికి రంగం సిద్ధం చేస్తున్నామని, ఎప్పటికప్పుడు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకంటూ ఆర్టీసీని దినదినాభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
అతి త్వరలో 3వేల ఉద్యోగాలు..
ఆర్టీసీ అభివృద్ధిలో భాగంగా కేవలం కొత్త బస్సులను రోడ్లపై తిప్పడమే కాకుండా అతి త్వరలో భారీ మొత్తంలో ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘‘ఆర్టీసీలో అతి త్వరలోనే 3 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నాం. ఈ ఉద్యోగాల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేశాం. త్వరలోనే దీనిని అమలు చేస్తాం. ఆర్టీ అభివృద్ధి కోసం మహిళా శక్తి, మెప్నా ద్వారా ఆర్టీసీ బస్సులను కూడా కొనుగోలు చేస్తున్నాం. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయడానికి చర్యలు చేపడుతున్నాం’’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్టీసీ అంటే జీరో పొల్యూషన్ ట్రాన్స్‌పోర్టేషన్‌కు చిహ్నంగా మార్చడటే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.
ఆర్టీలో ఎంతమంది ఉచిత్ర ప్రయాణం చేశారంటే..
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హక్కును కల్పించే ‘మహాలక్ష్మీ’ పథకం అమలై 300 రోజులు అయినట్లు ఆర్టీసీ ఎంసీ సజ్జనార్ గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఈ పథకం ఎంతో మందికి విశేష సేవలు అందించినట్లు చెప్పారు. ‘‘9 డిసెంబర్ 2023న తెలంగాణ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ‘మహాలక్ష్మీ’ పథకాన్ని అమలు చేసింది. ఈరోజుతో ఈ పథకం మొదలై 300 రోజులు అయింది. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో 90 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. రానున్న కాలంలో ఈ పథకాన్ని మరింత చేరువ చేస్తాం. అన్ని మార్గాల్లో, అన్ని బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది’’ అని సజ్జనార్ వివరించారు. అదే విధంగా ఆర్‌టీసీ బస్సుల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు తెలియజేయాలని, వాటిని పరిష్కరించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.