
తెలివి ప్రదర్శించి ‘సారీ’ చెప్పిన మంత్రి పొన్నం
తెరవెనుక మంత్రాంగం కారణంగా బుధవారం ఉదయం అడ్లూరికి పొన్నం సారీ చెప్పారు
మొత్తానికి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాస్త తెలివిని ప్రదర్శించారు. గొడవ మరింత పెద్దది కాకముందే సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman Kumar) కు సారి చెప్పి వివాదానికి తెరదించారు. ‘అడ్లూరి మనసు నొచ్చుకుంటే సారి చెబుతున్నాను’ అని పొన్నం(Ponnam Prabhakar) ప్రకటించారు. అసలు విషయం ఏమిటంటే ఈనెల 5వ తేదీన జూబ్లీహిల్స్ అసెంబ్లీ(Jubilee Hills by poll) ఉపఎన్నికకు సంబంధించి మంత్రులు పొన్నం, అడ్లూరి, గడ్డం వివేక్(Gaddam Vivek) మీడియా సమావేశంలో మాట్లాడాల్సుంది. మంత్రులు గడ్డం, పొన్నం సమయానికి వచ్చినా అడ్లూరి రాలేదు. దాంతో పక్కనే కూర్చున్న వివేక్ తో పొన్నం మాట్లాడుతు సరైన టైంకు రావాలని----కు ఏమి తెలుసు ? అంటూ ఎద్దేవాచేశారు. అయితే పొన్నం మరచిపోయిన విషయం ఏమిటంటే తనముందున్న మైక్ ఆన్ లో ఉందని. మైక్ ఆన్లో ఉండటంతో పొన్నంచేసిన వ్యాఖ్యలు అందరికీ వినిపించాయి.
ఆతర్వాత పొన్నంవ్యాఖ్యలు అడ్లూరి దృష్టికి చేరటంతో పొన్నంపై మండిపోతున్నారు. ఈ విషయంలోనే మంగళవారం పొన్నంపై అడ్లూరి ఫైరయ్యారు. తనకు పొన్నం క్షమాపణ చెప్పాలని మంత్రి సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. వీరి వివాదంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కూడా దృష్టిపెట్టారు. పై ముగ్గురు ఇద్దరు మంత్రులతోను చాలాసార్లు మాట్లాడారు. అడ్లూరిని ఉద్దేశించి తాను ఏమీ అనలేదని పొన్నం పదేపదే చెబుతుంటే పొన్నం తనను ఉద్దేశించే అన్నారని అడ్లూరి కూడా గట్టిగా వాదిస్తున్నారు. తనకు పొన్నం క్షమాపణ చెప్పాల్సిందే అని గట్టిగా పట్టుబట్టడమే కాకుండా డెడ్ లైన్ కూడా విధించారు.
తెరవెనుక మంత్రాంగం కారణంగా బుధవారం ఉదయం అడ్లూరికి పొన్నం సారీ చెప్పారు. సహచరమంత్రి మనసు నొచ్చుకునుంటే తాను సారీ చెబుతున్నట్లు పొన్నం ప్రకటించారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు బొమ్మ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కూడా ఏర్పాటైంది. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ తర్వాత మీడియా సమక్షంలోనే అడ్లూరికి పొన్నం సారీ చెబుతారని అందరు అనుకున్నారు. అయితే మీటింగ్ కు ముందుగానే పొన్నం సారీ చెప్పేశారు. ఇదేసమయంలో తమిద్దరి అనుబంధంగురించి కూడా వివరించారు. విషయం ఏదైనా వివాదానికి ముగింపు పలికే విషయంలో పొన్నం విజ్ఞతతో వ్యవహరించటం సంతోషించాల్సిన విషయమే.
తొందరలో జరగబోతున్న స్ధానికసంస్ధల ఎన్నికలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల ముందు ఇద్దరు మంత్రుల మధ్య పంచాయితి రోడ్డున పడటంతో రేవంత్, బొమ్మ ఇద్దరు ఇరుకునపడ్డారు. ఇద్దరు కూడా కీలకమైన సామాజికవర్గాలకు చెందిన మంత్రులు అవటంతో విషయం బాగా సెన్సిటివ్ అయిపోయింది. అడ్లూరికి మద్దతుగా ఎస్సీ ఉపకులం మాదిగ నేతలు, సంఘాలు పొన్నంకు వ్యతిరేకంగా ఆరోపణలు మొదలుపెట్టాయి. అడ్లూరికి క్షమాపణలు చెప్పకపోతే విషయం మరింత తీవ్రమవుతుందని హెచ్చరికలు కూడా మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు ఈ కులపంచాయితి పెరిగిపోతే పార్టీకి నష్టమని భావించిన రేవంత్ వెంటనే బొమ్మను రంగంలోకి దింపారు. క్షేత్రస్ధాయిలోని వాస్తవాన్ని మంత్రి పొన్నం కూడా గ్రహించినట్లే ఉన్నారు. అందుకనే బుధవారం ఉదయం సహచర మంత్రి అడ్లూరికి క్షమాపణ చెప్పి వివాదానికి ముగింపు పలికారు.