
జూబ్లీలో కాంగ్రెస్ గెలుపుకు మూడు కారణాలను చెప్పిన మంత్రి సీతక్క
9వ రౌండు ముగిసేసమయానికి సమీప బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి(Maganti Sunitha) సునీతపై నవీన్ సుమారు 25 వేల ఓట్ల మెజారిటితో ఉన్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి వల్లాల నవీన్ యాదవ్ గెలుపుకు శుక్రవారం మంత్రి సీతక్క(Minister Seethakka)మూడు కారణాలను చెప్పారు. ఉపఎన్నికలో నవీన్(Naveen Yadav)గెలుపు అనధికారికంగా ఖాయమైన విషయం అందరికీ తెలిసిందే. 9వ రౌండు ముగిసేసమయానికి సమీప బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి(Maganti Sunitha) సునీతపై నవీన్ సుమారు 25 వేల ఓట్ల మెజారిటితో ఉన్నారు. నవీన్ గెలుపును కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించాల్సుంది.
ఇక మంత్రి చెప్పిన మూడు కారణాలు ఏమిటంటే సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు అంశాలతో జనాల్లో ప్రభుత్వంపై సానుకూల వాతావరణం కలిపించిందన్నారు. నియోజకవర్గంలో గడచిన రెండేళ్ళల్లో 14,197 కొత్త రేషన్ కార్డులను తమ ప్రభుత్వం పంపిణీ చేసిందని గుర్తుచేశారు. అలాగే 8,123 మందిని ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డుల్లో సభ్యులుగా యాడ్ చేసిందన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ళను కూడా ప్రభుత్వం 70 బస్తీల్లో మంజూరుచేసిందన్నారు. వీటికి అదనంగా నవీన్ బీసీ బిడ్డ పైగా లోకల్ క్యాండిడేట్ అని మంత్రి సీతక్క గుర్తుచేశారు.
బీఆర్ఎస్ సెంటిమెంటును ప్రయోగించినా జనాలు పట్టించుకోలేదని ఎద్దేవాచేశారు. దివంగత ఎంఎల్ఏ మాగంటి గోపీనాధ్ భార్య సునీతకు టికెట్ ఇచ్చినా, పిల్లలు ప్రచారంచేసినా జనాలు విశ్వసించలేదన్నారు. రేవంత్ ప్రభుత్వాన్ని బుల్డోజర్ ప్రభుత్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నిసార్లు ఆరోపించినా జనాలు పట్టించుకోలేదని చెప్పారు. హైడ్రా ద్వారా జరుగుతున్న మంచిపనులు, హైడ్రావల్ల ఉపయోగాలతో మెజారిటి ప్రజలు కన్వీన్స్ అయినట్లు మంత్రి తెలిపారు. నగరం మునిగిపోకుండా ఉండేందుకే కబ్జాలను హైడ్రా ద్వారా రేవంత్ ప్రభుత్వం తొలగిస్తున్న విషయాన్ని జనాలందరు గుర్తించినట్లు మంత్రి చెప్పారు.

