అధికారులంతా నిబంధనలు పాటించాల్సిందే: సీతక్క
తెలంగాణలోని అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా పని చేయాలని తెలిపారు.
తెలంగాణలోని అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా పని చేయాలని తెలిపారు. అన్ని నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో అన్ని విభాగాల శాఖాధిపతులతో సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని శాఖలపురోగతి, నూతన ప్రణాళికలు, పనితనంలో మెరుగుదలపై చర్చించారు. అనంతరం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ‘‘అధికారులంతా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా పని చేయండి. మీ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోండి. నిబద్ధతతో పనిచేసి శాఖ గౌరవాన్ని నిలబెట్టాలి. శాఖకు వన్నె తెచ్చేలా పనిచేయాలి’’ అని తెలిపారు.
‘‘శాఖ పరంగా వాస్తవాలనే నివేదించండి. మా మెప్పుకోసం వాస్తవాలను దాచి పెట్టొద్దు. అధికారులు, అమాత్యులు వేరు వేరు కాదు. మీరు పొరపాట్లు చేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయొద్దు. ఎవరూ తప్పులు చేయొద్దు, జైలు పాలు కావద్దు. మీ కింది ఉద్యోగులతో సంప్రదింపులు జరపండి, వారి సమస్యలను పరిష్కరించండి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. రూ. 300 కోట్ల ఎన్ఆర్ఈజీఏ బిల్లులను నిన్న విడుదల చేశాం. మల్టీ పర్పస్ వర్కర్ల వేతన బకాయిలను విడుదల చేశాం. పంచాయతీరాజ్ శాఖ తరహాలోనే ప్రతి విభాగంలో ఉద్యోగ సమస్యలను ఆన్‌లైన్‌లో పరిష్కరించే విధానాన్ని అవళంభించండి’’ అని సూచించారు.
మంత్రి సీతక్కకు నైటా ఆహ్వానం
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) కొత్త అధ్యక్షురాలిగా ఎంపికైన వాణి ఏనుగును పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అభినందించారు. అమెరికా ప్రధాన నగరమైన న్యూయార్క్‌లో తెలుగువారికి ఓ సంఘం ఏర్పాటు చేయటంతో పాటు, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగించేందుకు నైటా చేస్తున్న కృషిని మంత్రి సీతక్క అభినందించారు. హైదరాబాద్‌లో మంత్రి నివాసంలో జరిగిన కార్యక్రమంలో నైటా కొత్త కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా శక్తికి ఆదర్శంగా నిలిచి, నైటా సేవలను మరింత విసృత పరచాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. వాణి ఏనుగుతో పాటు కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగానే రానున్న జూన్‌లో నైటా తరపున న్యూయార్క్‌లో జరిగే బోనాల ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మంత్రిని నైటా కార్యవర్గం ఆహ్వానించింది. ఇందుకు మంత్రి సీతక్క సుముఖత వ్యక్తం చేశారు.