
బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం
ఢిల్లీ బీసీ ధర్నాలో బీఆర్ఎస్ , బీజేపీ ఎంపీలు ఎందుకు పాల్గొనలేదని నిలదీసిన మంత్రి శ్రీధర్ బాబు
రాజ్యాంగ వ్యవస్థలపై తమకు నమ్మకం ఉందని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పుకొచ్చిన ఆయన, జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నిరసన ధర్నాకు బీజేపీ ఎంపీలు ఎందుకు మద్దతు పలకలేదని ప్రశ్నించారు.బీఆర్ఎస్ ఎంపీలు కూడా పాల్గొనలేదని విమర్శించిన శ్రీధర్ బాబు ,ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం కొనసాగుతోందన్నారు.కరీంనగర్ పర్యటన సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు.బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే జనం నమ్ముతారా అని నిలదీశారు.
ఫోన్ ట్యాపింగ్ విచారణలో రాజకీయ జోక్యం లేదని శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్‌పై అధికారులే విచారణ చేస్తున్నారని తెలిపారు.ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు ఎవరినీ పిలవాలన్నది సిట్ అధికారులే నిర్ణయిస్తారని వెల్లడించారు. తమ మేనిఫేస్టోలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జ్యూడీషనల్ ఎంక్వైరీ వేస్తామని చెప్పామని,అన్నట్లుగానే వేశామని గుర్తుచేశారు.మేడిగడ్డ ప్రాజెక్ట్ లాంటి సంఘటనలు భవిష్యత్ లో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి వ్యాఖ్యానించారు.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌దేనని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు.
Next Story