‘అప్పుడేమైంది మీ రాజ్యాంగం’.. హరీష్ రావుకు మంత్రి శ్రీధర్ కౌంటర్
x

‘అప్పుడేమైంది మీ రాజ్యాంగం’.. హరీష్ రావుకు మంత్రి శ్రీధర్ కౌంటర్

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి ప్రభుత్వ చీఫ్ పదవి ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపైనే హరీష్ రావుకు శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు.


ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి ప్రభుత్వ చీఫ్ పదవి ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఫిరాయింపు నేతకు కీలక పదవి ఎలా ఇస్తారంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా పదవులు ఇచ్చుకోవడానికి కాంగ్రెస్ దగ్గర సొంత నేతలకు కూడా గతి లేదని, పక్క పార్టీ నుంచి వచ్చిన వారికే పదవులు ఇస్తున్నారంటూ చురకలంటిస్తున్నారు. తాజాగా ఈరోజు ఇదే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు కూూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మహేందర్ రెడ్డికి విప్ పదవి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిని కూడా మహేందర్‌ నమోదు చేసిన అనర్హత పిటిషన్‌‌కు జోడిస్తామని కూడా హరీష్ రావు అన్నారు. తాజాగా హరీష్‌కు మంత్రి శ్రీధర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో మహేందర్ రెడ్డికి పదవి ఇవ్వడంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మళ్ళీ మొదలైంది. పట్నం మహేందర్‌కు పదవి రావడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకున్నట్లుందంటూ విమర్శలు గుప్పించారు శ్రీధర్. ఈ సందర్భంగా పలు ఇతర అంశాల్లో కూడా హరీష్ రావును టార్గెట్ చేశారు శ్రీధర్‌బాబు.

హరీష్‌కు అలవాటే..

‘‘ప్రతి విషయాన్ని రాజకీయం చేసేయడం హరీష్ రావుకు అలవాటై పోయింది. వ్యవస్థలను రాజకీయాల్లోకి లాగడం ఏమాత్రం సరైన పద్దతి కాదు. పట్నం మహేందర్ నియామకం రాజ్యాంగానికి లోబడే జరిగింది. అన్ని నిబంధనలను పాటిస్తూనే ఆయనకు ఆ పదవికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టబెట్టింది. ఇప్పుడేదో కాంగ్రెస్ ప్రభుత్వం.. రాజ్యాంగాన్ని తుంగలో తెక్కేస్తున్నట్లు బీఆర్ఎస్ మాట్లాడుతోంది. అలా మాట్లాడే ముందు వాళ్లు ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటే బాగుంటుంది. గతంలోకి వెళ్తే.. శాసనసభ వ్యవహారాల మంత్రిగా హరీష్ రావు ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లోకి ఎలా చేర్చుకున్నారు? కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మీకు రాజ్యాంగం గుర్తుకు రాలేదా?’’ అని ప్రశ్నించారు. అంతేకాకుండా రాజ్యాంగబద్దంగా పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్ష నేతకే ఇచ్చామని గుర్తు చేశారు. అంతేకాకుండా ఫిరాయింపు నేతలపై అనర్హత వేటు అంశం కోర్టు పరిధిలో ఉందని, దాని గురించి కోర్టు చూసుకుంటుందని అన్నారు.

అసలు హరీష్ రావు ఏమన్నారంటే..

ప్రభుత్వ విప్‌గా సొంత పార్టీ నేతను నియమించుకోలేని దుర్భర స్థితిలో కాంగ్రెస్ ఉందంటూ చురకలంటించారు మాజీ మంత్రి. అసలు మండలి చీఫ్ విప్‌గా మహేందర్‌రెడ్డిని ఎలా నియమించారని కూడా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, అందుకు మహేందర్ రెడ్డికి ప్రభుత్వ విప్ పదవి అందించడం ఒక ఉదాహరణ అని హరీస్ రావు వివరించారు. ‘‘బీఆర్ఎస్ జెండాపై గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మహేందర్ రెడ్డికి ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఎలా ఇచ్చారు? ఆయనపై అనర్హత పిటిషన్ ఛైర్మన్ దగ్గర ఇప్పటికే పెండింగ్‌లో ఉంది. మహేందర్‌ను చీఫ్ విప్‌గా నియమించడం అనర్హత పిటిషన్‌కు మరింత బలం చేకూర్చింది. దీన్ని కూడా అనర్హత పిటిషన్‌లో సాక్ష్యంగా చేరుస్తాం. ఎమ్మెల్సీ హోదాలోనే మహేందర్.. ఆగస్టు 15, సెప్టెంబర్ 17న జాతీయ జెండాను ఎగరేశారు. మార్చి 15 నుంచే ప్రభుత్వ విప్‌గా నియమితులైనట్లు ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై సీఎస్‌కు లేఖ రాస్తాం. గవర్నర్, డీవోపీటీకి కూడా లేఖ రాస్తాం. తమ స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్.. గవర్నర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అని మండిపడ్డారు హరీష్ రావు.

Read More
Next Story