తింటున్నదంతా కల్తీయేనా, సిటీ పరువుతీస్తున్న రెస్టరాంట్లు
x
హోటల్ కిచెన్ రూంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు(ఫొటో: ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఎక్స్ ఖాతా సౌజన్యంతో)

తింటున్నదంతా కల్తీయేనా, సిటీ పరువుతీస్తున్న రెస్టరాంట్లు

తెలంగాణలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలతో ఆహార భద్రతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు.అనంతరం అధికారులు లోపాలపై నోటీసులు జారీ చేస్తున్నారు.


తెలంగాణలో ఆహార కల్తీపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కన్నెర్ర చేశారు. దేశంలోనే ఆహార కల్తీలో హైదరాబాద్ నగరం అగ్రస్థానంలో ఉందని నేషనల్ క్రైం బ్యూరో రికార్డులను పరిశీలించిన మంత్రి హోటళ్లు, హాస్టళ్లు, బేకరీలు, స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేశారు. తాము ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేసి ప్రజలకు నాణ్యత గల ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ నగర ఫుడ్ సేఫ్టీ అధికారి బాలాజీరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

హాస్టళ్లపై ఫుడ్‌సేఫ్టీ అధికారుల వరుస దాడులు
ఆహార భద్రతా అధికారుల బృందాలు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనాలతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత రెండు నెలల్లో పలు ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లు,పీజీల్లో తనిఖీలు నిర్వహించాయి. మొత్తం 387 హాస్టళ్లను అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఉల్లంఘనల ఆధారంగా పలు హాస్టళ్లకు నోటీసులు జారీ చేశారు.ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్,రిజిస్ట్రేషన్ లేకుండానే చాలా హాస్టళ్లు పనిచేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు.ఆహార తయారీ, నిల్వలో అపరిశుభ్రమైన పరిస్థితులున్నాయని తేలింది. ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006 నిబంధనలు పాటించని వారికి నోటీసులు జారీ చేశామని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమీషనర్ ఎక్స్ లో పోస్టు చేశారు.

ఓ హాస్టల్ స్టోర్ రూంలో కుళ్లిపోయిన బంగాళా దుంపలు

ఎమరాల్డ్ స్వీట్స్ షాప్ కిచెన్‌లో ఎలుకలు,పందికొక్కులు
హైదరాబాద్ నగరంలోని ఎమరాల్డ్ స్వీట్స్ షాపులో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు.ఎమరాల్డ్ స్వీట్స్ షాప్ కిచెన్‌లో ఎలుకలు, పందికొక్కులున్నాయని గుర్తించారు. స్వీట్ల తయారీలో పేరొందిన ఈ ఎమరాల్డ్ స్వీట్ షాపు కిచెన్ లో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయని, దీనిలో దుర్గంధం వెలువడుతుందని అధికారులు చెప్పారు. రోజుల తరబడిగా ఫ్రిజ్ లో పాలు, పెరుగు, పన్నీరు నిల్వ చేశారని తనిఖీల్లో తేలింది. స్వీట్ల తయారీలో మోతాదుకు మించి కలర్స్ వాడుతున్నారని వెల్లడైంది. ఫుడ్ హ్యాండ్ లర్సుకు సర్టిఫికెట్లు లేవని తేలింది. దీంతో ఎమరాల్డ్ స్వీట్ షాపులో మిఠాయిల శాంపిల్స్ ను సేకరించి ఫుడ్ సేఫ్టీ అధికారులు పరీక్ష కోసం ల్యాబ్ కు పంపించారు.

సికింద్రాబాద్ వివాహ భోజనంబు హోటల్ సింథటిక్ ఫుడ్ కలర్‌
సికింద్రాబాద్ వివాహ భోజనంబు హోటల్ లో ఆహార పదార్థాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. హోటల్ లో చిట్టిముత్యాలు బియ్యం పాత స్టాకు అని గుర్తించారు.స్టీల్ కంటైనర్‌లలో నిల్వ చేసిన ముడి ఆహార వస్తువులపై సరిగ్గా లేబుల్ లేదు మూతలు లేవని గుర్తించారు.

అమీర్‌పేట క్లౌడ్ కిచెన్‌లలో తనిఖీలు
అమీర్ పేట్ రెబల్ ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ కు చెందిన క్లౌడ్ కిచెన్ లో ని స్టోర్ రూంలో పెరి పెరి స్ప్రింక్లర్ మసాలా, ఫ్రోజెన్ బేబీ పొటాటో, గ్రీన్ క్యాబేజీ గార్లిక్ బ్రెడ్ మసాలా సాచెట్‌లు గడువు ముగిసినవని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచిన కొన్ని ఆహార పదార్థాలకు సరైన లేబుల్స్ లేవు.

కొత్తగా 17 మంది ఫుడ్ సేఫ్టీ అధికారుల నియామకం
తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తమ ప్రజా ప్రభుత్వం కొత్తగా 17 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించామని ఆయన పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని, ఇందులో భాగంగానే ఆకస్మిక తనిఖీలు చేపిస్తున్నామని మంత్రి చెప్పారు. త్వరలో మరో 10 మొబైల్ ఫుడ్ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. నాచారంలోని రాష్ట్ర ఫుడ్ ల్యాబ్ ను బలోపేతం చేస్తున్నామని ఆయన వివరించారు.

రోజుకు 200 ఫుడ్ సేఫ్టీ టెస్టులు
రాష్ట్రంలో 200 ఫుడ్ సేఫ్టీ టెస్టులు చేయాలని అధికారులను ఆదేశించామని మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, బోర్డింగ్ హాస్టళ్లు,క్యాంటీన్లలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఆహార కల్తీ చేసే సంస్థల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నామని, ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాను అధికారులను అదేశించామని మంత్రి రాజనర్సింహ వివరించారు.



Read More
Next Story