
‘మొంథా’పై మంత్రుల ఫోకస్..
అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రులు కోమటిరెడ్డి, సీతక్క.
‘మొంథా’ తుపాను ప్రభావం తెలంగాణలో కూడా భారీగానే ఉంది. పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా తుపాను కేంద్రానికి దూరంగా ఉన్న జిల్లాలో కూడా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు చేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మొంథా ప్రభావం మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క.. అధికారులతో సమీక్షించారు. మంత్రులు.. అధికారులకు పలు కీలక సూచనలు చేయడంతో పాటు ప్రజలకు పలు సూచనలు చేశారు. మొంథా తుపాను ప్రభావం భారీగా ఉన్న నేపథ్యంలో అధికారులతంగా సమన్వయంతో పని చేయాలని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తక్షణమే చర్యలు తీసుకోవాలి: కోమటిరెడ్డి
‘‘రాష్ట్రంలో “మొంథా” తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ఆర్ అండ్ బి శాఖ అధికారులు హై అలర్ట్‌లో ఉండాలని నిర్దేశించాను. ఈఎన్సీలు, సీఎస్‌లు, ఎస్‌ఈలతో సమీక్షించి, క్షేత్ర స్థాయిలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. ప్రతి అధికారి ఫీల్డ్ లెవెల్‌లో క్లోజ్ మానిటరింగ్ చేయాలని అత్యవసరం అయితే తప్ప సెలవులకు వెళ్లవద్దని స్పష్టం. లోకాజ్‌వేలు, కల్వర్టుల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు..
పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచన. ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ ద్వారా అన్ని జిల్లాలతో అనుసంధానం. ప్రజా రవాణాకు ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేయాలని ఆదేశాలు. మాన్సూన్ సమయంలో మా ఇంజనీర్లు క్షేత్ర స్థాయిలో చేసిన మేల్కొలుపు చర్యలు అభినందనీయం. అదే స్పూర్తిని ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కొనసాగించాలి. ప్రజలందరూ అత్యవసరం అయితేనే రోడ్లపైకి రావాలి
స్థానిక అధికారులు జారీ చేసే సూచనలు ఖచ్చితంగా పాటించాలి’’ అని తెలిపారు.
ప్రజలూ జాగ్రత్త: సీతక్క
‘‘వర్షాలు పడుతున్న నేపథ్యంలో పశువులను మేతకు తీసుకురావడం, చేపల వేటకు వెళ్లడం మానుకోవాలి. అదే విధంగా అధికారులు కూడా ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకుంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలి. తాగు నీటి సమస్య అసలే లేకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజలు అత్యవసరం అయితే తప్పితే బయటకు రాకండి’’ అని సీతక్క సూచించారు.

