మొదటిసారి రేవంత్ కు మద్దతుగా నిలిచిన మంత్రులు
x
Revanth and ministers

మొదటిసారి రేవంత్ కు మద్దతుగా నిలిచిన మంత్రులు

రేవంత్ కు మద్దతుగా కేసీఆర్ పైన సోమవారం నుండి విరుచుకుపడుతునే ఉన్నారు.


మొట్టమొదటిసారిగా మంత్రులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. మామూలుగా అయితే ఏ విషయంలో అయినా రేవంత్ దారి రేవంత్ ది మంత్రుల దారి మంత్రులదే. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ ఎవరైనా సరే రేవంత్ పై ఎన్ని ఆరోపణలు చేసినా, విమర్శలు చేసినా చాలామంది మంత్రులు ఉలకరు, పలకరు. తనపైన ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు రేవంతే సమాధానాలు చెప్పుకుంటారులే అన్నట్లుగానే ఉండేది మంత్రుల వ్యవహారం. అలాంటిది ఇపుడు మాత్రం మంత్రులు ఒక్కసారిగా కేసీఆర్ కు వ్యతిరేకంగా యాక్టివ్ మోడ్ లోకి వచ్చేశారు.

మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఒక్కసారిగా రేవంత్ కు మద్దతుగా కేసీఆర్ పైన సోమవారం నుండి విరుచుకుపడుతునే ఉన్నారు. ఆదివారం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతు రేవంత్ పైన తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేశారు. అవే ఆరోపణలతో మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు కూడా పెద్దఎత్తున ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయారు.

ఆదివారం రాత్రి కేసీఆర్ ఆరోపణలు, విమర్శలకు ధీటుగా రేవంత్ స్పందించి ఎదురుదాడిచేశారు. అలాగే ఉత్తమ్ కూడా గట్టిగానే ఎదురుదాడి చేశారు. అయితే సోమవారం ఉదయం నుండి మంత్రులు పొన్నం, జూపల్లి, సీతక్క, అడ్లూరి ఒకరి తర్వాత మరొకరుగా మంత్రులు మీడియా ముందుకు వచ్చేశారు. రేవంత్ కు మద్దతుగా కేసీఆర్ పైన రెచ్చిపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ హయాంలో ఏమిజరిగిందనే పాయింట్ మీద రేవంత్, ఉత్తమ్ రెచ్చిపోగా మిగిలిన మంత్రులు కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో తెలంగాణకు జరిగిన నష్టంపై ఓ రేంజిలో రెచ్చిపోయారు.

ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోవటంలేదంటు చాలాసార్లు మంత్రులకు రేవంత్ క్లాసులు పీకిన విషయం తెలిసిందే. క్యాబినెట్ సమావేశంలోనే మంత్రులను ఈ విషయమై నిలదీశారు. ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలకు సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం తనకు ఒక్కడికే ఉందా ? మంత్రులకు పట్టడంలేదా ? అని రేవంత్ నిలదీశాడు. క్లాసు ఫలితమో లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులకు లభించిన విజయం లేదా తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల ప్రభావమో తెలీదు కాని మంత్రులు ఒక్కసారిగా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఫుల్లుగా యాక్టివ్ మోడ్ లోకి వచ్చేశారు.

Read More
Next Story