మీరాలం  కష్టకాలం, జూలో జంతువులకూ మంచినీళ్ల కరువు
x
HYD ZOO PARK

మీరాలం కష్టకాలం, జూలో జంతువులకూ మంచినీళ్ల కరువు

మీరాలం చెరువు నుంచి వెలువడుతున్న కలుషిత జలాలు జూపార్కులోని జంతువులను కాటేస్తున్నాయి.జంతువులను కలుషిత జలాల బారినుంచి కాపాడాలని జంతుప్రేమికులు కోరుతున్నారు.


హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల లోపలకు వెళుతుంటే మీరాలం చెరువు నుంచి ప్రవహిస్తున్న కాల్వలు, డ్రెయిన్లలో అత్యంత విషపూరితమైన కలుషిత జలాలు కనిపిస్తుంటాయి. ఈ కలుషిత జలాల వల్ల జూపార్కులోని జంతువులకు కిడ్నీ ఇతర రకాల వ్యాధులు వస్తున్నాయని జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత జలాల నుంచి జంతువులను కాపాడేందుకు టైగర్ సఫారీ ప్రాంతంలో సీవరేజి ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్మించాలని అటవీశాఖ ప్రతిపాదించింది.


జంతువులను కాటేస్తున్న కలుషిత జలాలు
హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్కులోకి వస్తున్న మీరాలం చెరువు నుంచి వస్తున్న కలుషిత జలాలు జంతువులకు ముప్పు కలిగిస్తున్నాయి. మీరాలం చెరువు ఛానల్ నుంచి వస్తున్న కలుషిత జలాల్లోనైట్రేట్లు,మాలిబ్డినం ఉన్నాయని, దీనివల్ల జూపార్కులోని జంతువుల ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగిస్తుంది.జూపార్కులో 2వేలకు పైగా వివిధ రకాల జంతువులున్నాయి.ఈ జూపార్కులో పులులు, సింహాలు, కోతులు, పక్షులు, మొసళ్లు ఉన్నాయి.మీరాలం కలుషిత జలాలు జంతువుల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారాయి.మీరాలం చెరువు కలుషిత జలాల బారినుంచి కాపాడేందుకు జూపార్కులో ఎస్టీపీల నిర్మాణం చేపట్టాలని అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారని జూపార్కు ప్రజాసంబంధాల విభాగం అధికారి హనీఫ్ చెప్పారు.

కలుషిత జలాల ప్రమాదం
మీరాలం ట్యాంక్ నుంచి నెహ్రూ జూ పార్క్ ఛానెల్‌లు,కాలువల గుండా వెళుతున్న నీటిలో భారీ లోహాలు, నైట్రేట్లతో కలుషితమై జూ జంతువులకు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తుందని గుర్తించారు.ఈ కాలుష్యం వల్ల జంతువులు కిడ్నీ, ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.జంతుప్రదర్శనశాల ప్రాంగణం,జంతువుల కందకాలలోకి ప్రవేశించే నీరు కలుషితం కాకుండా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.నెహ్రూ జూ పార్క్ అధికారులు నీటి కలుషిత సమస్యను పరిష్కరించడం ద్వారా జూ జంతువుల ఆరోగ్యం మరియు భద్రతను నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

కలుషిత జలాలతో 58 జంతువులు మృత్యువాత
మీరాలం ట్యాంకు నుంచి జూపార్కులోకి వస్తున్న కలుషిత జలాల వల్ల 58 జంతువులు మరణించాయని జూపార్కు వెటర్నరీ అధికారులే చెబుతున్నారు. ఆసియా ఆడ సింహం, హిమాలయన్ గోరల్, ఆసియా సింహం అరుణ,హంసలు కలుషిత జలాల వల్ల లివర్ వ్యాధులతో మరణించాయి. వీటి కళేబరాలను పోస్టుమార్టం చేయగా కలుషిత జలాలే ఈ జంతుజాలం మృతికి కారణమని జూపార్కు పశుసంవర్ధక శాఖ అధికారులే తేల్చారు. దీంతో జూపార్కులోని జంతువులకు సురక్షితమైన శుద్ధ జలం అందించాలని నిర్ణయించారు.జంతువులు కలుషిత నీటి బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని జూపార్కు డిప్యూటీ డైరెక్టర్‌ (వెటర్నరీ) డాక్టర్‌ ఎం.ఎ.హకీమ్‌ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

కూల్ ఎన్‌క్లోజర్లు
జంతువులను ఎండ దెబ్బ బారిన పడకుండా కాపాడేందుకు అహ్మదాబాద్ నగరంలోని కమలా నెహ్రూ జూలాజికల్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన విధంగా కూల్ ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కూల్ ఎన్ క్లోజర్ల వల్ల జూపార్కులో ఎండతీవ్రత 6 నుంచి 8 డిగ్రీల వరకు తగ్గుతుందని జూపార్కు అధికారులు చెప్పారు.

సీవరేజి ప్లాంట్లు నిర్మించండి
హైదరాబాద్ జూపార్కులోకి మీరాలం చెరువు నుంచి కలుషిత జలాలు జంతువులున్న ప్రాంతంలోకి వస్తున్నాయని తెలంగాణ అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ మోహన్ పర్గెయిన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిషోర్ కు నోటీసు ఇచ్చారు. కలుషిత జలాల నుంచి జంతువుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లకుండా మున్సిపల్ శాఖ రెండు సీవరేజి ప్లాంట్లు నిర్మించాలని మోహన్ పర్గెయిన్ కోరారు. జూపార్కులో కలుషిత జలాల బెడదను పరిశీలించిన మోహన్ ఈ మేర మున్సిపల్ శాఖకు లేఖ రాశారు.వేసవికాలంలో వేడిని తట్టుకునేలా జంతువులకు మంచినీటిని స్ప్రేయింగ్ చేయించాలని జూ క్యూరేటరుకు ఆయన సూచించారు.భారతీయ బైసన్,ఒక పులిని కాకతీయ జంతుప్రదర్శనశాలకు త్వరగా తరలించాలని నెహ్రూ జూలాజికల్ పార్క్ డైరెక్టర్‌ను వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ మోహన్ పర్గెయిన్ ఆదేశించారు.

చెరువుల ఆక్రమణలతోపాటు కాలుష్యాన్ని నివారించాలి : పర్యావరణ సామాజికవేత్త లూబ్నా సర్వత్
మీరాలం చెరువులోకి పై భాగంలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమల వల్ల నీరు కలుషితమవుతుందని పర్యావరణ సామాజిక వేత్త డాక్టర్ లూబ్నా సర్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హైదరాబాద్ నగరంలో పలు చెరువులు కబ్జా దారుల కబంధ హస్తాల్లో చిక్కుకోవడంతో నీరు కలుషితమవుతోంది.చెరువు పై భాగంలో ఉన్న ప్లాస్టిక్ పరిశ్రమల నుంచి కలుషిత వ్యర్థాలు చెరువులోకి కలుస్తుందని లూబ్నా చెప్పారు. చెరువునీరు కలుషితం కావడంతో జూపార్కులో జంతువులకు పెను ప్రమాదం ఏర్పడింది. ‘‘జూపార్కులోపల ఉన్న రెండు చిన్న చెరువులు కూడా కలుషితమయ్యాయి. దీనివల్ల జంతువులకు బయటి నుంచి మినరల్ వాటర్ తెప్పించి ఇవ్వాల్సి వస్తుంది, చెరువు ఆక్రమణలతో పాటు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని లూబ్నా వివరించారు.మీరాలం చెరువులో కేబుల్ బ్రిడ్జి, వాక్ వేల నిర్మాణాలతో కాలుష్యానికి తెరపడదని ప్రభుత్వం గుర్తించాలి. అసలు కాలుష్య మూలాలను నివారించినపుడే జూపార్కులోని జంతువులను కలుషిత జలాల బారిన పడకుండా కాపాడుకోగలుగుతామని లూబ్నా చెప్పారు.

కలుషిత జలాలను మూసీలో కలపాలని కోరాం : జూ క్యూరేటర్ డాక్టర్ సునీల్ ఎస్ హీరిమత్
మీరాలం చెరువు నుంచి జూపార్కులోకి వస్తున్న కలుషిత నీటిని పైపులైన్ల ద్వారా మూసీనదిలోకి కలపాలని కోరామని జూ క్యూరేటర్ డాక్టర్ సునీల్ ఎస్ హీరిమత్‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మీరాలం ట్యాంక్ నుంచి మూసీ నదికి పైప్‌లైన్ నిర్మించాలని మెట్రో వాటర్ బోర్డును కోరామని ఆయన చెప్పారు. జూపార్కులోని అన్ని జంతువులకు రక్షిత నీటిని అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. జూపార్కులో దశల వారీగా అన్ని తడి కందకాలను పొడి కందకాలుగా మారుస్తున్నామని చెప్పారు.కలుషితమైన నీరు జూ పార్క్‌లోకి ప్రవేశించకుండా సఫారీ ఎంట్రీ పాయింట్‌లో మురుగునీటి ప్లాంట్‌ను ఏర్పాటు చేయమని తాము మున్సిపల్ అధికారులను అభ్యర్థించామని సునీల్ వివరించారు.

HYD ZOO PARK

జంతువులకు రక్షితనీరు అందిస్తున్నాం
జంతుప్రదర్శనశాల నిర్వహణలో అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటూ కలుషితమైన నీరు జంతువులు తాగకుండా సంరక్షిస్తున్నామని జూ క్యూరేటర్ డాక్టర్ సునీల్ ఎస్ హీరిమత్ చెప్పారు.కందకాల్లోని జంతువులు కలుషితమైన నీటిని తాగకుండా బారికేడింగ్ చేస్తున్నామని చెప్పారు. సఫారీలోని అన్ని జంతువులకు రక్షిత నీటిని అందించడంతోపాటు బీకాంప్లెక్స్ ,మల్టీవిటమిన్ టాబ్లెట్లు అందిస్తున్నామని చెప్పారు.జంతువులకు వ్యాధి కలిగించే ఇన్ఫెక్షన్లను నియంత్రించడానికి తాగునీటిలో యాంటీబయాటిక్స్ అందిస్తున్నామని సునీల్ తెలిపారు.











Read More
Next Story