
రైతుల కోసం ఎమ్మెల్యే భారీ విరాళం..
కుమారుడి రిసెప్షన్ రద్దు చేసిన సీఎంకు చెక్కు అందించిన బత్తుల లక్ష్మారెడ్డి.
‘సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడ్పడవోయ్’ అని గురజాడ అప్పారావు చెప్పారు. దానిని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆచరిస్తున్నారు. తన కుమారుడు సాయి ప్రసన్న రిసెప్షన్‌ను రద్దు చేసిన ఆ డబ్బును నియోజకవర్గ రైతుల కోసం ఖర్చు చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి రూ.2కోట్ల చెక్‌కు కుటుంబసమేతంగా అందించారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వివాహం ఇటీవల జరిగింది. మిర్యాలగూడలో వారి రిసెప్షన్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే భావించారు. కానీ తన నియోజకవర్గం రైతులు పడుతున్న కష్టాలను చూసి వారికి సహాయం చేయాలనుకున్నారు. అంతే తన కుమారుడి రిసెప్షన్‌ను రద్దు చేసి ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేయాలని భావించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌ను కలిసి చెక్‌ను అందించారు. ఆయన చేసిన ఈ ఆలోచనను సీఎం అభినందించారు.
తెలంగాణ రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్నా బస్తా యూరియా దొరుకుతుందన్న నమ్మకం లేదు. అలాంటి ఘటనలు తన నియోజకవర్గంలో కూడా జరుగుతుండటాన్ని గమనించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గ రైతులకు అండగా నిలవాలని డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయంలో ఆయన కుటుంబం కూడా ఆయనకు మద్దతు పలికింది. అంతా కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారం.. తన నియోజకవర్గ రైతుల కోసం ఖర్చు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి రూ.2 కోట్ల రూపాయల చెక్‌ను ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి అందించారు. అంతేకాకుండా రైతుకు ఒక యూరియా బస్తా చొప్పున లక్షమంది అన్నదాతలను అందించాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.