
మేడిగడ్డ ప్రాజెక్టుకు పగుళ్లు...
కాళేశ్వరంలో కాసుల కైంకర్యం, పలువురు ఇంజినీర్లపై ఏసీబీ కేసులు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పలువురు ఇంజినీర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడి వందల కోట్లరూపాయలను అక్రమంగా సంపాదించారని ఏసీబీ విచారణలో తేలింది.
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) నిర్మాణంలో పాలుపంచుకున్న నీటిపారుదల శాఖ ఇంజినీర్లు పలువురు కోట్లాది రూపాయల ఆస్తులు కూడగట్టారని సాక్షాత్తూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (Anti Corruption Bureau: ACB) దర్యాప్తుల్లో తేలింది. పలువురు కాళేశ్వరం ఇంజినీర్లు అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని తేలింది. ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనలను తుంగలో తొక్కి అక్రమాలకు పాల్పడ్డారని తెలంగా విజిలెన్స్ అండ్ ఎన్ పోర్స్ మెంట్ నివేదికలో వెల్లడైంది. తాజాగా బయటపడిన కేసు కాళేశ్వరం మాజీ ఇంజనీర్ -ఇన్-చీఫ్ (Engineer-in-Chief) సి. మురళీధర్ రావు కు సంబంధించినది.
ఏసీబీ తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్న అక్రమాలు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాల బాగోతంపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీరింగ్ చీఫ్ సి మురళీధర్ రావు పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న ఏఈ నుంచి ఈఎన్సీ దాకా అందరూ అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీ తేల్చింది. కాళేశ్వరం ఏఈ (Assistant Engineer) నికేశ్ నుంచి మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు దాకా అక్రమార్జనతో కోట్లాది రూపాయల ఆస్తులు కూడగట్టారని తేలింది.
కాళేశ్వరం ఇంజినీర్ల అక్రమాలు
ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి పలువురు కాళేశ్వరం ఇంజినీర్లు అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరాం అదాయానికి మించిన ఆస్తులున్నాయని వెల్లడైంది. బహిరంగ మార్కెట్ లో హరిరాం ఆస్తుల విలువ వందల కోట్లలో ఉంటుందని ఏసీబీ తెల్చింది. నీటిపారుదల ఎస్ ఈ బన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేశ్ లు ఏసీబీ వలలో చిక్కారు.పటాన్ చెరు ఇరిగేషన్ ఏఈఈ రవికిశోర్, సిరిసిల్ల ఈఈ అర్రం రెడ్డి అమరనాథ్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. శ్రీధర్ కు పలు ప్రాంతాల్లో విలువైన భూములున్నాయి. ఎస్సారెస్పీ ఈఈ శ్రీధర్ కు వందల కోట్ల ఆస్తులున్నాయని ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది.
మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు నివాసాలపై 11 ప్రాంతాల్లో సోదాలు
మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు నివాసాలపై 11 ప్రాంతాల్లో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేశారు. ఏసీబీ దాడుల్లో మురళీధర్ రావుకు సంపాదనకు మించిన ఆస్తులున్నాయని తేలింది.
వెలుగుచూసిన కోట్ల రూపాయల ఆస్తులు
తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుకు కోట్ల రూపాయల ఆస్తులున్నాయని ఏసీబీ అధకారుల తనిఖీల్లో వెల్లడైంది. హైదరాబాద్ నగరంలోని కొండాపూర్, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ, బేగంపేట, కోకాపేట ప్రాంతాల్లో ఒక విల్లా, నాలుగు ప్లాట్లు, నాలుగు ఓపెన్ ప్లాట్లు, ఒక వాణిజ్య భవనం, 6,500 చదరపు గజాల ఓపెన్ ల్యాండ్, 11 ఎకరాల వ్యవసాయ భూమి, జహీరాబాద్ లోని 2కేవీ మెగావాట్ల సామర్ధ్యం కలగ సోలార్ పవర్ ప్రాజెక్టు, కరీంనగర్ లో ఒక వాణిజ్య భవనం, కోదాడలో అపార్టుమెంట్, వరంగల్ లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు, మూడు ఫోర్ వీలర్లు ఏసీబీ దాడుల్లో వెలుగు చూశాయి.
మురళీధర్ రావుకు 13 ఏళ్లపాటు పదవీ కాలం పొడిగింపు
తెలంగాణ నీటిపారుదల శాఖ,కమాండ్ ప్రాంత అభివృద్ధి శాఖలో ఈఎన్సీగా పనిచేసిన సి మురళీధర్ రావుకు 13 ఏళ్లపాటు పదవీకాలాన్ని పొడిగించారని తేలింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే మురళీధర్ రావు పదవీ విరమణ చేయగా, ఆయన పదవీ కాలాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం పొడిగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చాక ఈయన ఈఎన్సీగా కొనసాగారు. మేడిగడ్డ బ్యారేజీ కి పగుళ్లు వచ్చాక వచ్చిన విజిలెన్స్ నివేదికను చూసిన కాంగ్రెస్ సర్కారు అతన్ని ఈఎన్సీ పదవి నుంచి తొలగించింది.
Next Story