
MLA ANIRUDH REDDY | ఎమ్మెల్యే వెండి ఫర్నిచర్ అఫిడవిట్‌లో అంతర్ధానం
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇంటి నిండా తళుకులీనుతున్న వెండి ఫర్నిచర్ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ వెండి ఫర్నిచర్ ఎన్నికల అఫిడవిట్‌లో కనిపించలేదు.
నాడు సీబీఐ,ఈడీ కేసుల్లో నిందితుడైన ఐరన్ ఓర్ మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి ఏకంగా బంగారంతో కుర్చీని చేయించుకున్న వార్తలు సంచలనం రేపాయి. కానీ నేడు నా బెడ్రూం వెండిమయ కాను అన్నట్లు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జానంపల్లి అనిరుధ్ రెడ్డి తన బెడ్రూంలోని మంచం నుంచి కుర్చీలు, డైనింగ్ టేబుల్, బెడ్ , కాఫీటేబుల్, బెడ్ సైడ్ టేబుల్స్ , డ్రెస్సింగ్ టేబుల్ ఇలా ఒకటేమిటి? బెడ్రూం, హాలు నిండా తన గదిని వెండితో ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. అనిరుధ్ రెడ్డికి భార్య గంగారం మంజూష, ముగ్గురు పిల్లలున్నారు.
యూనిక్ గా ఉండాలనేది నా కోరిక : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
తన బెడ్రూం యూనిక్ గా ఉండాలనేది తన కోరిక ప్రకారం బెడ్రూం అంతా వెండి ఫర్నిచరుతో నింపివేశానని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పారు. పడకగదిలో ఫీల్ రావాలనే ఉద్ధేశంతోనే తాను బెడ్రూం అంతా వెండిమయం చేశానని పేర్కొన్నారు. వెండి ఫర్నిచరుతో యూనిక్ గా ఉండాలని చెప్పి వెండితో నా రూం ఇట్లా తయారు చేయించానని ఎమ్మెల్యే సెలవిచ్చారు.తాను ప్రత్యేకంగా వెండి కార్మికులను నియమించి వెండి ఫర్నిచర్ చేయించానని చెప్పారు. బెడ్రూంను వెండిమయం చేసిన ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అంతా అనిరుధ్ రెడ్డి ఆస్తులపై గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. దీంతో అనిరుధ్ రెడ్డి ఆస్తుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
రాజప్రసాదాన్ని తలపించిన ఎమ్మెల్యే ఇల్లు
మామూలుగా అయితే కొంచెం డబ్బున్న వారు ఇళ్లలో వెండి ప్లేట్లు, గ్లాసులు, పూజా సామాగ్రి పెట్టుకుంటారు...మధ్య తరగతి మహిళలైతే కాళ్లకు అయిదారు తులాల బరువున్న పట్టీలు పెట్టుకుంటారు. కానీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాత్రం తన బెడ్రూంలో బెడ్ నుంచి డైనింగ్ టేబుల్ దాకా అన్నీ వెండితో చేయించిన ఫర్నిచర్ ను అమర్చారు.రోజ్ వుడ్‌తో సీలింగ్, రాజ భవనం లాంటి ఆ ఇంట్లో వెండితో బెడ్, డైనింగ్ టేబుల్,కుర్చీలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్ చేయించుకున్నారు.
పెట్టి పుట్టడమంటే ఇదేనేమో?
చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో పెద్ద రాజప్రసాదం లాంటి పెద్ద బంగళా ఎదురుగా ఏనుగు బొమ్మ , ఒక్కో గదిలో ఒక్కో రకంగా డిజైన్ తో కూడిన రంగురంగుల షాండిలర్స్, వివిధ రకాల డిజైన్ల లైట్లతో అనిరుధ్ రెడ్డి ఇల్లు నాటి రాజుల నాటి ఇంద్రభవనాన్ని తలపింపజేసింది. రోజ్ వుడ్ తో చేసిన సీలింగ్ , గోడకు రెండు తుపాకులు వేలాడదీసి, రాజప్రసాదాన్ని తలపించేలా ఎమ్మెల్యే ఇల్లు మెరిసిపోతోంది. ఎమ్మెల్యే ఇంటిని వీడియోలో చూసిన నెటిజన్లు పెట్టి పుట్టడమంటే ఇదేనేమో అని వ్యాఖ్యానించారు.
విలాసవంతమైన భవనం
గతంలో క్యాండిల్స్ ఇప్పుడు రంగురంగుల బల్బులతో మిరుమిట్లు గొలుపుతున్న షాండిలైర్స్, వెండి ఫర్నిచర్, ఇంటి ఆవరణలో సుందర్, కాజల్, రాకీ లనే గుర్రాలతో గుర్రపుశాల,అంతులేని విలాసవంతమైన ఇల్లు ఎమ్మెల్యే సొంతం. తన ఫాం హౌస్ లో గుర్రాలపై స్వారీ చేసే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్వయంగా మూడు మేలిరకపు అశ్వాలను పెంచుకుంటున్నారు. కానీ గుర్రాలను మాత్రం ఎమ్మెల్యే తన ఎన్నికల అఫిడవిట్ లో మాత్రం చూపించలేదు.
సొంత కారు లేదట...
వందలాది కిలోల వెండితో బెడ్రూం నిండా ఫర్నిచర్ తయారు చేయించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంత కారే లేదని తన ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు. తనకు కేవలం విక్టార్ బైక్ మాత్రమే ఉందని అఫిడవిట్ లో ప్రకటించారు.
వెండి లేదట...
వెండి ఫర్నిచరుతో ఇంటిని నింపేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తన వద్ద ఎలాంటి వెండి లేదని 2023 ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో ప్రకటించుకున్నారు. ఆభరణాలు లేవని ప్రకటించిన ఎమ్మెల్యే తన భార్య పేరిట రూ.64.36 లక్షల విలువ చేసే 1215 గ్రాముల బంగారం మాత్రమే ఉందని ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. అంటే ఈ వెండి ఫర్నిచర్ అంతా ఎమ్మెల్యే అయ్యాక అనిరుధ్ రెడ్డి సంపాదించారా అంటే దానికి ఎమ్మెల్యేనే సమాధానం చెప్పాల్సి ఉంది.
వెండి మంచాలు, వెండి కుర్చీలు ఉన్నట్లు అఫిడవిట్ లో చూపించలేదు. ఎన్నికల తర్వాత వెండి ఫర్నిచర్ చేయించారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే అయ్యాక 14 నెలల కాలంలోనే ఇన్ని కిలోల వెండిని ఎలా సంపాదించారు. వెండి మంచాలు, వెండి పరుపులు, అయితే వందలాది కిలోల వెండితో బెడ్రూం నిండా ఫర్నిచర్ ఎలా వచ్చిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇంట్లోనే అభివృద్ధి చేశారు...
ఏడాది పాలన అభివృద్ధి నియోజకవర్గంలో చేయాల్సింది ఇంట్లోనే చేశారని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రెడ్డి ఎక్స్ లో ట్వీట్ చేశారు.2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం అనిరుధ్ రెడ్డి కుటుంబానికి రూ.48.57 కోట్ల ఆస్తులున్నాయి. బ్యాంకులు, ఇతర కంపెనీల్లో రూ.40లక్షల డిపాజిట్లు ఉన్నాయి. అనిరుధ్ రెడ్డి భార్య మంజూష చరాస్తుల విలువ రూ.11.52 కోట్లుగా ఉన్నాయి. మంజూషకు 1215 గ్రాముల బంగారం, ఇతర బాండ్లు ఉన్నాయి. ఎమ్మెల్యేకు 53 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని అఫిడవిట్ లో చూపించారు. మరి ఈ వెండి ఫర్నిచర్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
ఎన్నెన్నో ఇళ్ల స్థలాలు, భవనాలు
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి పలు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఉన్నాయి. ఈయనకు జడ్చర్లలో 816,200 గజాల రెండు ప్లాట్లు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో 666,619 గజాల రెండు ప్లాట్లు,మియాపూర్ లో 389 గజాలు, శేరిలింగంపల్లి ఇజ్జత్ నగర్ లో 600 గజాల స్థలాలున్నాయి. బెంగుళూరు నగరంలోని జలహోబ్లీ తరబన్ హళ్లిలో మూడు వేల చదరపు అడుగుల భవనం ఉంది. రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడలో 500, 530 చదరపు గజాల రెండు స్థలాలు, చేవేళ్ల మండలం కనవడలో 1400 గజాల ప్లాటు, శంకరపల్లి మండలం మోకిల గ్రామంలో ఎకరం భూమి ఉన్నాయి. గోపన్ పల్లిలో 4554 చదరపు అడుగుల్లో విల్లా, ఖాజాగూడ గ్రీన్ గ్రేస్ లో 3,050 చదరపు అడుగుల భవనం ఉన్నాయి.
వ్యవసాయ భూములెన్నో...
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి పలు ప్రాంతాల్లో వ్యవసాయ భూములున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ గ్రామం ఖానాపూర్ పరిధిలో 1.22 గుంటల వ్యవసాయ భూమి ఉంది. నవాబ్ పేట మండలం యనమనగండ్ల గ్రామంలో 35 ఎకరాల భూమి, రంగారెడ్డి గూడ గ్రామంలో 9 ఎకరాలు,సంగారెడ్డి మండలం చేరియాల గ్రామంలో 1.29 గుంటలు, రాఘవనగర్ లో 1.11గుంటల భూమి, తిరుమలపూర్ లో 5 ఎకరాల భూమి, గండిపేట మండలం మంచిరేవులలో 2 ఎకరాల భూమి, రంగారెడ్డి గూడలో 3.25 గుంటల వ్యవసాయ భూములున్నాయి. రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కర్నూల్ జిల్లా కల్లూరు మండలం ఉలిండ కొండ గ్రామంలో 13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
ఎమ్మెల్యేల రహస్య భేటీతో వార్తల్లోకెక్కిన అనిరుధ్
ఎమ్మెల్యేలకు నిధులివ్వాలని కోరుతూ పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశానికి సూత్రధారి అయిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మంత్రులకు అధిక నిధులు వస్తుండటంతో వారి నియోజకవర్గాలు బాగుపడుతున్నాయని, అందుకే నిధుల గురించి తాము మాట్లాడుకున్నామని అనిరుధ్ రెడ్డి చెప్పారు. నియోజకవర్గాల్లో సమస్యలపై తాము మాట్లాడుకున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ఉద్ధండపూర్ రైతుల పక్షాన తాను పోరాడుతానన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం వెలిమల గ్రామంలోని కొండకల్ తండా గిరిజనులకు చెందిన సీలింగ్ భూములను ఓ మంత్రి కబ్జా చేశారని అనిరుధ్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఎస్సీ, ఎస్టీ భూములు, పేదవారి కోసం తాను పోరాటం చేస్తున్నాని ఎమ్మెల్యే చెప్పారు. జడ్చర్ల ఎమ్మెల్యే జానంపల్లి అనిరుద్ రెడ్డిని ఇటీవల కొందరు కార్యకర్తలు నిలదీశారు.
కంప్యూటర్ ఇంజినీర్ అనిరుధ్ రెడ్డి
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కంప్యూటర్ ఇంజినీర్, జేఎన్ టీయూలో కంప్యూటర్ సైన్సులో బీటెక్ చదివారు.ఆపై రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మల్యే అయ్యారు.ఈయనపై రెండు కేసులు జడ్చర్ల కోర్టులో పెండింగులో ఉన్నాయి.విరాసత్ కోసం ఓ అధికారి లక్షరూపాయలు లంచం అడిగాడని అనిరుద్ రెడ్డి స్వయంగా అధికారులపై విమర్శలు గుప్పించారు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రాజభోగం
పాలమూరు బిడ్డ హోం టూర్ వీడియో చూసిన ప్రజలు అబ్బబ్బ మొత్తం వెండితో చేసిన ఫర్నిచర్ ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.దీంతో అనిరుధ్ రెడ్డి ఆస్తులు సెర్చ్ చేయగా పలు నిజాలు వెలుగుచూశాయి. కేవలం 2 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను ఇలా దోచుకుంటోందా అని ఓ నెటిజన్ ప్రశ్నించారు.బాలానగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ సెలవు రోజు కూడా తలుపులు వేసుకొని విధులు నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఫిర్యాదు చేశారు.
Next Story