హైడ్రాపై ఎమ్మెల్యే దానం ధ్వజం.. ప్రతాపం పేదలపై కాదంటూ..
x

హైడ్రాపై ఎమ్మెల్యే దానం ధ్వజం.. ప్రతాపం పేదలపై కాదంటూ..

హైడ్రాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలపై ప్రతాపం చూపొద్దని, టార్గెట్ స్లమ్స్ కాకూడదని ముందుగానే హెచ్చరించామని ఆయన వివరించారు.


హైడ్రాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలపై ప్రతాపం చూపొద్దని, టార్గెట్ స్లమ్స్ కాకూడదని ముందుగానే హెచ్చరించామని ఆయన వివరించారు. నగరంలో జలవిహార్, ఐమాక్స్ లాంటివి అక్రమంగా నిర్మించినవి ఎన్నో ఉన్నాయని, హైడ్రా ముందుగా వాటిని పరిశీలించాలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల జోలికి వెళ్లొద్దని హైడ్రాకు ముందే చెప్పామని, దీనిపై మరోసారి చర్చిస్తామని కూడా ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అన్నీకూడా ఈ అంశాన్ని తమకు అనువుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మూసీ, హైడ్రా బాధితులతో ప్రత్యేక ఓటర్ బ్యాంకును సిద్ధం చేసుకోవడమే వారి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాలను పరిశీలించిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కానీ, ఈరోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన బీఆర్ఎస్ నేతలు కానీ మూసీ నిర్వాసితులకు ప్రభుత్వానికి వ్యతిరకంగా రెచ్చగొట్టమే ప్రధాన కారణంలా మాట్లాడుతున్నారని, అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి శతవిధాలా యత్నిస్తున్నారని దానం నాగేందర్ మండిపడ్డారు. ఎప్పుడూ డిగ్నిఫయిడ్‌గా ఉండే హరీష్ రావు కూడా హైడ్రా విషయంలో అందరి తరహాలోనే మాట్లాడుతున్నారని, ఆయన కావాలనే మూసీ నిర్వాసితుల దగ్గరకు వెళ్లి లేనిపోని రచ్చ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు..

ఎంతో మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని, పార్టీ మారడానికి ఆలక్తి చూపుతున్నారని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. పార్టీ కండువా కప్పుకోవడం కోసం బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారన్నారు. ‘‘మేమూ కాంగ్రెస్‌లో చేరతామంటూ ఎంతో మంది ఎమ్మెల్యేలు నాతో టచ్‌లోకి వస్తున్నారు. ప్రతి రోజూ వారి నుంచి కాన్ ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. వారిని ఆయా పార్టీలు భయపెట్టి, బెదిరించి అపుతున్నాయి. పార్టీ మారితే అనర్హత వేటు వేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే మా పార్టీతో హైదరాబాద్ ఎమ్మెల్యే టచ్‌లోనే ఉన్నారు. ఎవరైనా పార్టీ మారితే ఉపఎన్నిక తథ్యమని భయపెడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా స్టేషన్ ఘన్‌పూర్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఇటువంటి వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. కాగా కేటీఆర్‌కు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సరైన బదులిచ్చారని అన్నారు.

కేసీఆర్ అన్నదే కాంగ్రెస్ చేస్తోంది..

‘‘రాష్ట్రంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని గతంలో కేసీఆర్ కూడా అన్నారు. ఇప్పుడు హైడ్రా చేస్తున్నది కూడా అదే. ఇప్పటి వరకు హైడ్రా ఒక్క సరైన కట్టడాన్ని కూడా కూల్చలేదు. అప్పట్లో కేసీఆర్ అన్నదే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నా.. ఇప్పుడు బీఆర్ఎస్ దీనిని రాజకీయం చేస్తోంది. కానీ పేదలకు సరైన సమయం ఇవ్వకుండా ఇళ్లు కూల్చేయడం సరికాదు. స్లమ్స్ జోలికి వెళ్లొద్దని హైడ్రాకు వివరించాం. ఈ అంశంపై మరోసారి చర్చ చేస్తాం’’ అని ఆయన అన్నారు.

కన్నీరు ఆగలేదు..

‘‘పేదల ఇళ్లు కూల్చడం సరైన పద్దతి కాదు. పుస్తకాలు తీసుకుంటాను.. లోపలే ఉండిపోయాయి అని చిన్నపాప వేడుకుంటున్న వీడియో చూసి కన్నీరు ఆగలేదు. నిర్వాసితులకు కౌన్సెలింగ్ ఇప్పించాలి. ముందు వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. బదిలీకి కావాల్సిన సమయం కూడా అందించిన తర్వాత కూల్చివేతలను చేపట్టాలి. నిర్ణయించిన బఫర్, ఎఫ్‌టీఎల్ పరిధిలో ప్రస్తుత ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం’’ అని దానం నాగేందర్ చెప్పారు.




కాంగ్రెస్ భస్మాసుర హస్తం: హరీష్

మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్లను కూల్చాలంటూ బుల్డోజర్లు తమ బాడీలపై నుంచి వెళ్లాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావ్ వ్యాఖ్యానించారు. హైడ్రా పుణ్యమా అని ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారని, సీఎం రేవంత్ రెడ్డి అనవసరంగా మూసీ సుందరీకరణ అంటున్నారని హరీష్ రావు అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీది ఆపన్న హస్తం అంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్‌ది మాత్రం భస్మాసుర హస్తంలా ఉంది. కాంగ్రెస్ పార్టీ తన గుర్తును హస్తం నుంచి బల్డోజర్2కు మార్చుకుంటే బాగుంటుంది. కొడంగల్‌లోని రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది. ముందు దాన్ని, రేవంత్ సోదరుడి ఇంటికి కూల్చుకోవాలి. వాటిని పట్టించుకోకుండా పేదల ఇళ్లే టార్గెట్‌గా కూల్చివేతలు చేపట్టడం అమానవీయం’’ అని మండిపడ్డారు హరీష్ రావు. ఆపద ఉంటే ఫోన్ చేయాలని, అర్థగంట అండగా, అడ్డుగా నిలబడేందుకు అక్కడికి చేరుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. బుల్‌డోజర్లు వచ్చినా, బులెట్లు కురిసినా ముందు మమ్మల్ని దాటాలని అన్నారు.

Read More
Next Story