
రాజీనామాకు దానం నాగేందర్ మెలిక పెడుతున్నారా ?
ఫిరాయింపుల్లో తొమ్మిదిమంది ఎలాగోలా అనర్హతవేటునుండి తప్పించుకున్నా దానంపైన అనర్హత వేటుపడటం మాత్రం ఖాయం
ఫిరాయింపు ఎంఎల్ఏ దానంనాగేందర్ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఖైరతాబాదులో గెలిచిన దానం(Danam Nagendar) తర్వాత కాంగ్రెస్(Telangana Congress) పార్టీలోకి ఫిరాయించిన విషయం అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్(BRS) నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన దానం 2024 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్(Secunderabad) ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. మొత్తం పదిమంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు(BRS Defection MLAs)కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. వీరందరిపైనా అనర్హత వేటువేయించి, ఉపఎన్నికలు వచ్చేట్లుచేయాలన్నది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పట్టుదల. అందుకనే ఫిరాయింపులపై కోర్టులో కేసులు దాఖలు చేయించారు. ఇదేసమయంలో అనర్హత వేటునుండి ఎలాగైనా తప్పించుకోవాని ఫిరాయింపులు ప్రయత్నిస్తున్నారు.
మొత్తంఫిరాయింపుల్లో తొమ్మిదిమంది ఎలాగోలా అనర్హతవేటునుండి తప్పించుకున్నా దానంపైన అనర్హత వేటుపడటం మాత్రం ఖాయం. ఎలాగంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏగా గెలిచిన దానం కాంగ్రెస్ ఎంపీగా ఎలాగ పోటీచేశారు. పార్టీ ఫిరాయింపులపై తొమ్మిదిమంది ఎంఎల్ఏలు ఏవో సమర్ధించుకుంటున్నారు. సమర్ధించుకోవటానికి దానం ఏమి కారణం చెబుతారు ? కాబట్టి అనర్హత వేటుపడటం ఖాయమని దానంతో పాటు అందరికీ అర్ధమైపోయింది. ఈ విషయంలోనే దానం రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనర్హత వేటు వేయించుకునే కన్నా తనంతట తానుగా ముందుగానే ఎంఎల్ఏగా రాజీనామా చేసేస్తే ఎలాగుంటుందని దానం ఆలోచిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.
అయితే ఇక్కడే దానం ఒకమెలిక పెడుతున్నారు. అదేమిటంటే తొందరలోనే జరగబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక జరుగుతుంది. ఉపఎన్నికలో తనకు టికెట్ ఇవ్వాలని దానం గట్టిగా పట్టుబడుతున్నారని తెలిసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తనకు టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తానని ఇప్పటికే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి దానం గట్టిగా చెప్పారట. అంతేకాకుండా పార్టీలోని తనకు మద్దతుగా ఉండే కొందరు సీనియర్లతో కూడా రేవంత్ తో పాటు ఢిల్లీలోని అధిష్ఠానంతో చెప్పిస్తున్నట్లు సమాచారం. టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో రేవంత్ అభిప్రాయానికి విలువ ఉంటుంది కాని సీఎం చెప్పిన వాళ్ళకే అధిష్ఠానం టికెట్ ఖాయంచేస్తుందనే గ్యారెంటీ అయితే లేదు. అందుకనే తనను కలిసి టికెట్ అడుగుతున్న వాళ్ళకు రేవంత్ కూడా ఎక్కడా కమిట్ కావటంలేదు.
టికెట్ కోసం నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, బాబా ఫసియుద్దీన్ లాంటి మరికొంతమంది గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అధిష్ఠానం టికెట్ ఎవరికి ఇస్తుందన్న విషయం ఇప్పట్లో తేలదు. ఎందుకంటే ఆశావహుల విషయంలో కాంగ్రెస్ పార్టీ సర్వేలు చేయించుకుంటోంది. ఉపఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేంతవరకు సర్వేలు చేయించుకుంటునే ఉంటుంది పార్టీ. కాబట్టి అభ్యర్ధి ఎవరన్న విషయం ఇప్పట్లో తేలదు. ఈ విషయం తెలుసుగనుకే దానం తనక టికెట్ ఇవ్వమని అధిష్ఠానంకు గట్టిగా చెప్పించుకుంటున్నారు. తనపైన అనర్హత వేటు పడేలోగా అధిష్ఠానంతో తనకు టికెట్ గ్యారెంటీ అనిపించుకుంటే ఖైరతాబాద్ ఎంఎల్ఏగా రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నారని సమాచారం. రాజీనామా విషయంలో దానంకు ఉండే తొందర కాంగ్రెస్ అధిష్ఠానంకు ఎందుకు ఉంటుంది ? చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.