వరుస భేటీల వేళ బీఆర్ఎస్ కి మరో ఎమ్మెల్యే గుడ్ బై?
x

వరుస భేటీల వేళ బీఆర్ఎస్ కి మరో ఎమ్మెల్యే గుడ్ బై?

ఎమ్మెల్యేల ఫిరాయింపులతో సతమతమవుతోన్న బీఆర్ఎస్ కి మరో ఎదురుదెబ్బ తగలనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.


ఎమ్మెల్యేల ఫిరాయింపులతో సతమతమవుతోన్న బీఆర్ఎస్ కి మరో ఎదురుదెబ్బ తగలనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ లోకి జంప్ అవగా.. లిస్ట్ లోకి ఇంకొక ఎమ్మెల్యే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాషాయ కండువా కప్పుకోనున్నట్టు సంకేతాలు వ్యక్తం అవుతున్నాయి.

గత రెండు రోజులుగా మహిపాల్ రెడ్డి హస్తినలోనే తిష్ట వేశారు. రాష్ట్రంలో గులాబీ అధినేత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వరుస భేటీలు జరుపుతున్న వేళ ఆయన ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆయన మాజీ ఎంపీ బీజేపీ నేత బీబీ పాటిల్ తో చర్చలు జరిపారు. ఆయన ద్వారానే బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ అయినట్టు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ నేతలతోనూ ఆయన టచ్ లో ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఈడీ కేసుల నేపథ్యంలోనే ఆయన పార్టీ మారే ఆలోచనలో పడ్డారనే ప్రచారం నడుస్తోంది.

అయితే మహిపాల్ రెడ్డి మాత్రం పార్టీ మారడంపై తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. కాగా, "కేసీఆర్ ఎమ్మెల్యేలతో ఫామ్‌ హౌస్‌ లో సమావేశాలు నిర్వహిస్తున్న సమాచారం తనకు అందలేదని, తాను ఈడీ కేసులకు సంబంధించి న్యాయవాదులతో చర్చించే నిమిత్తం ఢిల్లీకి రావడం జరిగిందని" స్పష్టం చేశారు.

అక్రమ మైనింగ్ ఆరోపణలతో ఈడీ కేసు...

గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి.. మైనింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ. 39 కోట్లు నష్టం చేకూర్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గుర్తించారు. మొత్తం రూ. 300 కోట్ల మైనింగ్ అక్రమాలు జరిగినట్లు ఈడీ అధికారులు గతంలో వెల్లడించారు. సంతోష్ శ్యాండ్, సంతోష్ గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలు కొనసాగించారని ఈడీ తెలిపింది. మైనింగ్‌ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారంటూ మహిపాల్‌రెడ్డి సోదరుల నివాసాల్లో గత శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి నివాసాల్లో జరిగిన సోదాలపై ఈడీ ఓ ప్రకటన విడుదల చేసింది.

మనీలాండరింగ్‌, హవాలా నేపథ్యంలో సోదాలు చేసినట్టు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాల్లో కూడా అక్రమ లావాదేవీలను గుర్తించామన్నారు. అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులుగా పెట్టినట్టు వెల్లడించారు. మరికొన్ని బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉందని, మహిపాల్‌రెడ్డి సోదరులకు పలువురు బినామీలుగా ఉన్నట్టు బయటపడిందని ఈడీ అధికారులు తెలిపారు. బినామీ పేర్లతో ఉన్న లావాదేవీలనూ ఈడీ గుర్తించింది.

Read More
Next Story