
బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా
మీ పార్టీకో దండం , ఎమ్మెల్యే పదవికో దండం అంటూ కిషన్ రెడ్డికి లేఖ పంపిన రాజాసింగ్
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలను ప్రశ్నిస్తూ వస్తున్న రాజాసింగ్ పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షపదవి ఎన్నిక విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన రాజాసింగ్ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించినట్లు వెల్లడించారు.మీ పార్టీకో దండం , ఎమ్మెల్యే పదవికో దండం అంటూ కిషన్ రెడ్డికి లేఖ పంపిన రాజాసింగ్ ,ఎమ్మెల్యే పదవికి తన రాజీనామా లేఖను కూడా పంపుతున్నానని , దానిని కిషన్ రెడ్డే స్పీకర్ కు పంపుకోవచ్చన్నారు.బీజేపీ గుర్తుపై గెలిచినందునే ఎమ్మెల్యే పదవిని వదులుకుంటున్నట్లు తెలిపారు.
"ఎమ్మెల్యేగా డిస్ క్వాలీఫై చేసేలా అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ పంపమని కిషన్ రెడ్డిని కోరాను.. 2014 నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డాను. తాను టెర్రరిస్టుల హిట్ లిస్ట్‌లో ఉన్నాను. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకూడదని పార్టీలోని కొందరు పెద్ద నాయకులు కోరుకుంటున్నారు," అని రాజా సింగ్ చెప్పారు.
పార్టీలో రెబల్ గా రాజాసింగ్ ..కాంట్రవర్సీకి కేరాఫ్
తెలంగాణ బీజేపీలో స్వపక్షంలో విపక్ష నేతగా ఆ పార్టీ నేతలను బహిరంగంగా విమర్శిస్తూ వచ్చిన రాజా సింగ్ తొలి నుంచి మింగుడు పడటం లేదు. పార్టీ లక్ష్మణ రేఖను దాటి ఆయన చేస్తోన్న వ్యాఖ్యలకు అధిష్టానం పలు మార్లు వివరణ కూడా కోరింది. బీజేపీ లైన్ దాటి పార్టీలో ఏకపక్షంగా వ్యవహరిస్తుడనేది టాక్.పార్టీ కంటే తాను గొప్ప అనే అర్ధం వచ్చేలా ఆయన మాటలు వుంటూ వచ్చాయి.గోషామహల్ ఎమ్మెల్యేగా వున్న రాజాసింగ్, మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేయడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది.దీనిపై బీజేపీ అధినాయకత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అటు, శాసనసభాపక్ష నేత పదవి నుంచి కూడా తొలగించింది. రాజాసింగ్ పై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. రాజాసింగ్ వీడియోపై మైనారిటీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, వివాదాస్పదమైన ఆ వీడియోను పోలీసులు యూట్యూబ్ నుంచి తొలగించారు.
గత ఎన్నికల ముందు సస్పెన్షన్ కు గురైన రాజాసింగ్ ,భారీ లాబీయింగ్ కారణంగా.. అప్పట్లో బతికిపోయారు. సస్పెన్షన్ ఎత్తేయించుకుని ఎమ్మెల్యే టికెట్‌ను కూడా పొందారు. ఆ తరువాత రాజాసింగ్ తీరు కొంత మారినా , మరో కీలక నాయకుడి అండ చూసుకుని, ఆయన ప్రత్యర్థులను తన ప్రత్యర్థులుగా మార్చుకుని ,వారిని కార్నర్ చేస్తూ వచ్చారన్న వాదన బలంగా వినిపించింది.తాజాగా తనను దమ్ముంటే సస్పెండ్ చేయాలన్న స్థాయికి వెళ్లిపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిన కూడా నేరుగా టార్గెట్ చేస్తూ స్వరం పెంచారు.
ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల విషయంలో కూడా రాజాసింగ్ బహిరంగంగా తన మద్దతు తెలిపారు. ఆ అంశం కాస్త రెండు పార్టీల మధ్య తీవ్ర చర్చనీ అంశంగా మారింది. "లిక్కర్ కేసులో కవిత తీహార్ జైల్లో ఉన్న సందర్భంగా బిఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో బిజెపీ లోకి విలీనం చేసి, ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ నేతలే తమ పార్టీ టికెట్లను నిర్ణయించే స్థాయికి బిజెపి చేరుకుంది" అంటూ రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చాయని భావించారు.