చర్చల డ్రామాలెందుకు?  కవితక్కనే దించండి బరిలోకి!!
x
kavita curtesy wikipedia

చర్చల డ్రామాలెందుకు? కవితక్కనే దించండి బరిలోకి!!

ఈసారికి తప్పిస్తే బాగుంటుందేమోనని బీఆర్ఎస్ నేతలు ఆలోచిస్తుంటే అభిమానులు మాత్రం అక్కే కావాలంటున్నారట..


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ నిజామాబాద్ పార్లమెంటు బరిలోకి దిగుతారా? బీఆర్ఎస్ అధిష్టానం మళ్లీ కవితనే బరిలోకి దింపాలని అనుకుంటుందా..? లేక కొత్త అభ్యర్ధి కోసం అన్వేషణ మొదలు పెట్టిందా..? అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్యేను పోటీలో పెట్టి బీజేపీ సిట్టింగ్ ఎంపీ అర్వింద్‌ను కట్టడి చేయాలని BRS భావిస్తోంది. కానీ కవితనే మళ్లీ పోటీలోని దింపాలని ఉద్యమకారులు కోరుతున్నారు.

కవిత భవితవ్యంపై చర్చోపచర్చలు...

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్‌పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం తర్వాత కవిత భవిష్యత్‌ ఎలా ఉంటుందనే విషయంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఓటమి పాలైనప్పటి నుంచి కొద్ది రోజుల పాటు పొలిటికల్‌గా సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక.. మళ్లీ జిల్లా వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్, బోధన్, ఆర్మూర్, జగిత్యాల, కోరుట్ల గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్నారు. అయితే ఊహించని విధంగా మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. మరో రెండు నియోజకవర్గాల్లో గెలిచారు. అప్పటి వరకు రాబోయే ఎంపీగా ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసేందుకు కవిత గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు. కానీ ఎమ్మెల్సీ పదవి కాలం మరో నాలుగేళ్లు ఉండటం, ఇప్పుడున్న పరిస్థితుల్లో మండలిలో పార్టీ గొంతు బలంగా వినిపించాలంటే కవిత మండలిలో ఉండటమే కరెక్ట్ అనే చర్చ జరగుతోంది. దీంతో కవిత ఎంపీగా పోటీ చేయరంటూ పార్టీలోని కొంతమంది చెప్తున్నారు. అయితే కవితే మళ్లీ పోటీ చేయాలని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కవితే కావాలంటూ ప్రచారం...

కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయకపోతే.. ఎవరిని బరిలోకి దింపుతారనేది జిల్లా నేతల్లో ఆసక్తి రేపుతోంది. నిజాబామాద్ లోక్‌సభకు బీఆర్ఎస్ తరుపున పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థిగా ఉన్న MLC కవిత తప్ప మరో నేత కనిపించడం లేదు. ప్రత్యామ్నాయంగా ఓడిపోయిన అభ్యర్థుల్లో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి పేరును గులాబీ పార్టీ పరిశీలన చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఎంపీ అర్వింద్‌ను కట్టడి చేయాలంటే బాజిరెడ్డే సరైన ప్రత్యర్థి అని భావిస్తున్నారు. కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయని పక్షంలో బరిలోకి దిగేందుకు రెడీగా ఉండాలని బాజిరెడ్డికి సూచించింది బీఆర్ఎస్ అధిష్టానం.

సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం...

నిజామాబాద్ గులాబీ పార్టీలో కొద్దిరోజలుగా ఎమ్మెల్సీ కవిత అనుచరులు ప్రజాగళం కల్వకుంట్ల కవిత అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలుపెట్టారు. మన గళం వినిపించే కవితను గెలిపిద్దామంటూ ప్రచారం చేస్తున్నారు. తాజా పరిణామాలతో కల్వకుంట్ల కవితనే మళ్లీ నిజామాబాద్ ఎంపీ బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీఆర్ఎస్ కవితను నిజామాబాద్ నుంచి బరిలోకి దింపాలా లేక ప్రత్యామ్నయంగా బాజిరెడ్డితో పోటీ చేయించాలా అన్న డైలామాలో పడింది. ఇంతకీ ఇందూరు బీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత మరోసారి పోటీ చేస్తారా.. లేక కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తారాన్నది ఆసక్తికరంగా మారింది.

Read More
Next Story