కవిత అనూహ్య నిర్ణయం.. ఉవ్వెత్తున ఎగసిన భారత జాగృతి కమిటీలు రద్దు
ఎమ్మెల్సీ కవిత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. భారత జాగృతి (విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి) కమిటీలను రద్దు చేశారు.
ఎమ్మెల్సీ కవిత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. భారత జాగృతి (విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి ) కమిటీలను రద్దు చేశారు. కమిటీల రద్దు తక్షణమే అమలులోకి వస్తుందని జాగృతి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. అయితే, ఇందుకు సంబంధించిన కారణాలను వెల్లడించలేదు. కాగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మారిన తర్వాత తెలంగాణ జాగృతి ని భారత జాగృతి గా మార్చారు. వివిధ రాష్ట్రాల్లో కమిటీలకు ఇంచార్జులను కూడా నియమించారు. ఇప్పుడు, ఆకస్మికంగా భారత జాగృతి కమిటీలను రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఉద్యమ సమయంలో కీలకంగా తెలంగాణ జాగృతి..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమం నుండి ప్రేరణ పొంది 2006 లో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ అధికారికంగా 2007 నవంబరులో నమోదు చేయబడింది. తెలంగాణ కళలు, సంస్కృతిపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం ఈ సంస్థను స్థాపించినట్లు ఆమె తెలిపారు. తెలంగాణ పండుగలలో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. జాగృతి ద్వారా బతుకమ్మను పెద్ద ఎత్తున జరుపుకుంటూ, అన్ని వర్గాల ప్రజలను అందులో పాల్గొనేలా చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుత పోరాటంలో మహిళలు, యువత, సమాజంలోని పెద్ద వర్గాల మద్దతును సమీకరించడంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. కవిత తెలంగాణ జాగృతి ద్వారా దశాబ్దానికి పైగా తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ప్రస్తుతం 30కి పైగా దేశాల్లో బతుకమ్మను జరుపుకుంటున్నారు. మరోవైపు యువతకు ఉపాధి అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాగృతి స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి వివిధ అంశాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.