ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం
x
ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్న కవిత

ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం

జీఓ3 వల్ల ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల విషయంలో మహిళలకు అన్యాయం జరుగతుందని ఇందిరా పార్క్ దగ్గర చేస్తున్న ధర్నాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.



తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇందిరా పార్క్ దగ్గర భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేశారు. మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తున్న జీఓ3ని రద్దు చేయాలని డిమాండ్ చేశారామె. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు అన్యాయం జరగడం మొదలైందని, కేసీఆర్ పాలనలో మహిళల సాధికారత కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ఆమె వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు కల్పిస్తామంటూ చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏమీ చేయలేదని, జీఓ 3 అమలు చేసి మహిళలకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతో పాటు భారత్ జాగృతి శ్రేణులు పాల్గొన్నాయి.


పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్లు

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడంపై కోసం ఎన్నో చర్యలు తీసుకుందన్నారు. దేశంలో రాజ్యాంగం అమలైనప్పటి నుంచి మహిళ కోసమని అనేక ప్రత్యేక చట్టాలు చేసుకుంటూ పోయామని, వాటిలో అనేక రిజర్వేషన్ చట్టాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. ‘‘పోలీసు శాఖలో మహిళల కోసం 33శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీఆర్ఎస్‌దే. కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పాటయ్యాకే ప్రతి యూనివర్సిటీలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగింది. పోటీ పరీక్షల్లో కూడా మహిళలే టాపర్లుగా నిలిచారు. మహిళలు ఆర్థిక సాధికారత సాధించడానికి బీఆర్ఎస్ ఎంతగానో పాటుపడింది. మహిళలకు అన్ని శాఖల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్ కోరారు’’అని తెలిపారు.

జీఓ-3తో మహిళలకు అన్యాయం

ఎన్నికల సమయంలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేతికి రాగానే జీఓ-3 అమలు చేసి మహిళలకు తీరని అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. ఈ జీఓ వల్ల మహిళలకు కేవలం 12 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే లభిస్తాయని చెప్పారు. ‘‘ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి. ఒక కోర్టుకు కాకుంటే మరో కోర్టుకు వెళ్లే రేవంత్ రెడ్డి.. మహిళలకు న్యాయం చేయడానికి సుప్రీంకోర్టుకు అయినా వెళ్లాలి. జీఓను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా ఇలానే ఉంటే మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మారుతుంది’’అని హెచ్చరించారు. ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీలోని పెద్దలను కలుస్తారు తప్ప, సామాన్య ప్రజలను కలవరని విమర్శించారు.

జీఓ-3 మహిళలకు అనుకూలమే
జీఓ-3 వల్ల మహిళలకు అన్యాయం జరుగుతుందన్న విపక్షాల వాదనలను కాంగ్రెస్ ప్రభుత్వం తోసిపుచ్చింది. వారి ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని, అంశంపై అవగాహన లేకుండా వాళ్లు మాట్లాడుతున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు కల్పించడానికే ఈ జీఓ-3 తెచ్చామని స్పష్టం చేసింది. రాజేశ్ కుమార్ దరియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు, రాష్ట్ర హైకోర్టు తీర్పులను అనుసరిస్తూనే మహిళలు, పురుషులకు రిజర్వేషన్ల ప్రకారం సమాన వాటా దక్కేలా ఈ జీఓను సిద్ధం చేశామని వెల్లడించింది.

Read More
Next Story