‘ఇది పనిచేసే ప్రభుత్వం కాదు’
x

‘ఇది పనిచేసే ప్రభుత్వం కాదు’

అన్ని మనమే దగ్గరుండి చేయించుకోవాలి..


కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది పనిచేసే ప్రభుత్వం కాదని, అన్నీ మనమే దగ్గరుండి చేయించుకోవాలంటూ చురకలంటించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శనివారం పర్యటించిన కవిత.. ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సీఎంకు పాలన చేతకావడం లేదని దుయ్యబట్టారు. ప్రజా సేవకంటే ప్రచారానికే ఈ సర్కార్ పెద్దపీట వేస్తోందని ఎద్దేవా చేశారు. తైక్కుమంటే ఢిల్లీకి వెళ్తున్నారే తప్ప.. రాష్ట్రానికి ఇవ్వాల్సినంత సమయం సీఎం ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల ముందు వరకు అమ్మాయిలకు స్కూటీలు, పెళ్ళికి లక్ష రూపాయాల నగదు, తులం బంగారం అందిస్తామని అలివిమాలిన హామీలిచ్చిన రేవంత్.. అధికారం రాగానే అన్నీ మరిచారన చురకలంటించారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా పూర్తిగా నెరవేర్చని ప్రభుత్వం ఏదైనా ఉందా? అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్శలు గుప్పించారు. సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో అంబులెన్సులకు డీజిల్ లేక నానా అవస్థలు పడుతున్న పరిస్థితులు ఉన్నాయని అన్నారు.

రేషన్ షాపుల్లో కూడా సన్నబియ్యం పేరుతో నానా హంగామా చేసిన ప్రభుత్వం.. తీరా నూకలు, పాలిష్ పట్టిన దొడ్డు బియ్యానికి కలిపి ఇచ్చిందని ఆరోపించారు. 50శాతం వరకు నాణ్యతలేని దొడ్డుబియ్యమే ఆ సన్నబియ్యంలో ఉన్నాయని అన్నారు. కావాలంటే వీటికి ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని చెప్తూనే.. గ్రామాలకు వెళ్లే బస్సుల సంఖ్యను తగ్గించేశారని అన్నారు. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచడంలో ఈ ప్రభుత్వం బిజీబిజీగా ఉందని చురకలంటించారు.

Read More
Next Story