Kavitha | ‘అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’
బీసీలకు రేవంత్ సర్కార్ అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీలకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
బీసీలకు రేవంత్ సర్కార్ అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఈక్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని బట్టబయలు చేయడం కోసం బీసీలతో కలిసి కవిత.. హైదరాబాద్‌లోని ఇందిర పార్క్ వద్ద భారీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే సావిత్రి బాయి పూలేకి నివాళులు అర్పించారు. చదువు లేకుండా జీవితాన్ని ముందుకు సాగించిన సావిత్ర బాయి పూలే వివాహం తర్వాత భర్త వద్దే చదువు నేర్చుకుని అనేక మందిని విద్యను నేర్పించారని గుర్తు చేశారు. స్త్రీ విద్య, సాధికారత కోసం అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడిన చదువుల తల్లి, చైతన్యమూర్తి సావిత్రీబాయి ఫూలే, వారి ఆదర్శాలను కొనసాగించడమే సావిత్రీబాయి ఫూలేకి మనం అందించే నిజమైన గౌరవం అని కవిత పేర్కొన్నారు. జ్ఞానం అనేది ఒక కాంతి. ఒక మహిళ చదువుకుంటే, కుటుంబం మొత్తం చదువుకున్నట్లే అని సావిత్రీబాయి ఫూలే చెప్పారని కవిత గుర్తు చేశారు. సమాజ ఉద్దరణ కావాలంటే విద్య వికాసం కావాలని చెప్పిన వ్యక్తులు వారు. ఎన్ని అవమానాలు జరిగినా మొక్కవోని ధైర్యంతో పోరాటం చేసిన మహనీయురాలు సావిత్రి బాయి ఫూలే అని చెప్పారు. అనంతరం బీసీలకు కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాలను లేవనెత్తారు. చరిత్ర తెలుసుకున్నోడే భవిష్యత్తు నిర్మాణం చేస్తాడని చెప్తారని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, ఈ కాలంలో బీసీలకు ఏం జరిగిందో అందరూ గుర్తు తెచ్చుకోవాలన్నారు.
భారత్‌లో కులం ఉంది
‘‘కొందరు పెద్దోళ్లు కులరహిత సమాజాన్ని నిర్మిస్తామంటూ పెద్దపెద్ద మాటలు చెప్తుంటారు. కానీ అది జరుగుతుందా. జరిగిందా? మన దేశంలో కులం ఉంది. దాని ఆధారంగా సమాజం నడుస్తోంది. అది తెలిసే భారతదేశ రాజ్యాంగం రాసిన పెద్దమనుషులు అందరూ కూడా కులం ఆధారంగా కొన్ని రక్షణలు కల్పించారు. ఎస్సీ, ఎస్టీల్లో ఉన్న కులాలకు రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించారు. ఆ విధంగా రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొందించకపోయి ఉంటే ఈనాటికి కూడా ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫలాలు దక్కకపోతుండేవి. కాకపోతే అదే సమయంలో బీసీలను కూడా రాజ్యాంగంలో చేర్చి వారికి కూడా రక్షణ కల్పించి ఉంటే బాగుండేది. కానీ అది జరగలేదు. అదే జరిగి ఉంటే.. మన బీసీల సంఖ్యాబలంతో.. అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేది. పైగా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా బీసీలను చులకనచేసే చూశాయి’’ అని అన్నారు.
ఎన్నో ఉద్యమాలతోనే సాధ్యం
‘‘బీసీలకు న్యాయం కోసం ఎందరో మహానుభావులు ఎన్నో ఉద్యమాలు చేసి మరెందరో ప్రాణ త్యాగాలు చేస్తే 1953లో తొలిసారి ఆనాటి ప్రధాని నెహ్రూ.. బీసీలపై అధ్యయం చేయడానికి కాకా కాలేల్‌కర్ కమిషన్ వేశారు. ఆయన అన్ని పరిస్థితులను అధ్యయం చేసి రెండేళ్లలో రిపోర్ట్ ఇచ్చారు. దానిని స్వీకరించిన నెహ్రూ.. బీసీలలో 2.399 కులాలు ఉన్నాయని చెప్తున్న మాట వాస్తవమే. వాటిలో 833 కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్(ఎంబీసీ)గా ఉన్నాయని చెప్తున్నారు.. కానీ దీనికి ప్రాతిపదిక ఏంటి? అని ప్రశ్నించారు. అంతేకాకుండా కాకా రిపోర్ట్‌ను ఆనాడు ప్రధాని నెహ్రూ రిజెక్ట్ చేశారు. ఇది చరిత్ర కాదనలేని వాస్తవం. ఈ విషయంలోనే ఈ కాంగ్రెస్‌ను నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నా. నెహ్రూ ప్రభుత్వమే కమిషన్ వేస్తే రెండేళ్ల పాటు సాగిన అధ్యయనం ఏ ప్రాతిపదికన జరిగిందో ఆనాటి ప్రధానికి తెలియలేదంటే... ఆ రెండేళ్లు రివ్యూ చేయలేదంటే ఇది బీసీలకు కాంగ్రెస్ ప్రభత్వం చేసిన అన్యాయం కాదా? అని నేటి కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తున్నా’’ అని అడిగారు కవిత. 1955లో కాకా రిపోర్ట్‌ను రిజెక్ట్ చేస్తే ఆ తర్వాత 24 ఏళ్ల వరకు ఏ ఒక్క నేత కూడా బీసీల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు అని గుర్తు చేశారు. కేంద్రం బీసీలకు ఏమీ చేయలేదు, అప్పుడే కాంగ్రెస్ యేతర ప్రభుత్వం అధికారం చేపట్టిందని అన్నారు.
‘‘జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1979లో బీసీ మండల్ కమిషన్ వేశారు. ఆయన కూడా చాలా మంచిగా స్టడీ చేసి బీసీలకు అన్యాయం జరుగుతుందని గుర్తించారు. 70 శాతం విద్య, ఉద్యోగాల్లో వాటా ఇవ్వాలని ఏడాదిలోనే రిపోర్ట్ ఇచ్చారు. కానీ అంతలోనే జనతా పార్టీ పోయి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఆమె హయాంలో మండల్ కమిషన్ రిపోర్ట్‌ను తీసి బీరువాలో పెట్టి పదేళ్లు తాళం పెట్టారు. ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు ఏమాత్రం న్యాయం జరగలేదు. ఈ వాస్తవాన్ని కాదనగలదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? 1988లో మండల్ కమిషన్ ఇస్తే పదేళ్ల తర్వాత కాంగ్రెస్ యేతర ప్రధాని వీపీ సింగ్ వచ్చే వరకు ఆ రిపోర్ట్‌లో కదలిక రాలేదు. కానీ ఇవాళ మాత్రం ప్రతి కాంగ్రెస్ నేత కూడా నోరుపెట్టుకుని కాకమ్మ కబుర్లు బాగా చెప్తున్నారు. బీసీలమంతా ఇక్కడ మాట్లాడుకుంటాం అంటే అనుమతులు ఇవ్వడానికి తచ్చట్లాడిన వీళ్లా బీసీలకు న్యాయం చేసేది’’ అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
‘‘ఆనాడు బీసీలకు న్యాయం చేయాలని వీపీ సింగ్ భావిస్తే.. గొప్పలు చెప్పునే బీజేపీ నేతలంతా కూడా ఆనాడు ఏం చేశారు. వీపీ సింగ్‌కు తమ మద్దతును విరమించుకున్నారు. ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టారు. బీజేపీతో కలుసున్న ప్రభుత్వం ఉండేది. కానీ బీసీలకు మంచి చేసే ప్రధాని ఉండకూదనే ఆనాడు బీజేపీ తన మద్దతును విరమించుకుంది. ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు కూడా వీపీ సింగ్‌కు మద్దతు ఇవ్వలేదు. ఆతర్వాత ఆయనపై కేసుపైన కేసులు వేశారు. ఆ తర్వాత 1993లో తొలిసారి కేవలం ఉద్యోగాలలో మాత్రమే 27శాతం రిజర్వేషన్ కల్పించారు. ఆ తర్వాత మళ్ళీ 2006 వరకు అంటే 13 ఏళ్ల పాటు బీసీల గురించి పట్టించుకున్న వారు లేరు. అప్పుడు విద్యలో రిజర్వేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ గొప్పగా చెప్పుకునే ప్రధాని రాజీవ్ గాంధీ.. బీసీల రిజర్వేషన్‌పై ఏమన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే దేశం విచ్చన్నం అయిపోతుందని అనడం వాస్తవం కాదా?’’ అని కవిత ప్రశ్నించారు.
‘‘ఆ తర్వాత సోనియమ్మ రాజ్యం వచ్చింది. అప్పుడు కూడా కోట్లాడితే 2011లో కుల గణన చేస్తామని చెప్పారు. రూ.4,500 కోట్లు ఖర్చు చేసి కులగణన చేశారు. కానీ ఆ రిపోర్ట్ మాత్రం ఇంత వరకు బయటకు రాలేదు. ఎందుకు భయం. ఎంత మంది బీసీలు ఉంటే అంత వాటా ఇవ్వాల్సి వస్తందన్న భయంతోనే ఆ రిపోర్ట్‌ను బయటపెట్టలేదు. ఆ తర్వాత 2014లో అధికారం చేపట్టిన బీజేపీ కూడా ఆ రిపోర్ట్‌ను బయట పెట్టలేదు. ఇప్పుడు బీజేపీ నేతలు తాము కుల గణనకు వ్యతిరేకమని బాహాటంగానే చెప్తున్నారు. అదే చెప్తూ వారు సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ వేశారు. రెండు జాతీయ పార్టీలు కూడా బీసీలకు అడుగడుగునా అన్యాయం చేశారు. నేను చెప్పిన ఈ విషయాల్లో ఏ ఒక్కటైనా అసత్యం ఉంటే? దానిని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా’’ అని ఛాలెంజ్ చేశారు కవిత.
ఆ ఘనత ప్రాంతీయ పార్టీలదే
‘‘ఈ భారతదేశంలో బీసీలకు న్యాయం చేసిన వాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం ప్రాంతీయ పార్టీల నాయకులే. మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, శరద్ పవార్, డీఎంకే, ఏఐడీఎంకే, ఎన్టీఆర్, కేసీఆర్ ఇలా ఎక్కడ చూసుకున్నా కేవలం ప్రాంతీయ పార్టీ నేతలే బీసీలకు న్యాయం చేశారు. ఈరోజు నిర్వహించిన సమావేశం వేదికగా బీజేపీకి మేము మొదటి డిమాండ్ చేస్తున్నాం. అదేంటంటే.. ఇప్పుడు జనభా గణన చేస్తున్నారు. దాంతో తప్పకుండా కుల గణన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ నడుస్తోంది. ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ ఏం చెప్పింది. 42శాతం బీసీ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్తామన్నారు. అంటే హామీ ఇచ్చే టప్పుడు రిజర్వేషన్ ఎలా చేయాలో మీకు తెలియదా? రిజర్వేషన్లు ఇవ్వాలంటే మొదట డెడికేటెడ్ కమిషన్ వేయాలని మీకు తెలుసు అయినా ఎందుకు చేయలేదు’’ అని ప్రశ్నించారు.
మేము గుర్తు చేయలేదా..?
‘‘డెడికేటెడ్ కమిషన్ వేయాలని కాంగ్రెస్ మర్చిపోతే తొలి నెలలోనే మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిమరీ తెలంగాణ జాగృతి నుంచి గుర్తు చేశాం. మీరు రిజర్వేషన్ ఇస్తామన్నారు ప్రక్రియ ప్రారంభించండి అన్నాం. కానీ ఈ ప్రభుత్వంలో కదలిక రాలేదు. మనం పోరాటాలు చేస్తే.. హైకోర్టు మొట్టికాయలు వేస్తే ఇప్పుడు కమిషన్ వేశారు. కానీ ఇందులో లెక్కలు ఇంకో కమిషన్ వేస్తోంది. ఇందులో భారీ కుట్ర జరుగుతోంది. ఇక్కడ లెక్కలు ఒక కమిషన్ పెడుతుంటే.. రిపోర్ట్ ఇంకో కమిషన్ ఇస్తోంది. ఇలా చేస్తే కోర్టులో ఈ కమిషన్ రిపోర్ట్ నిలుస్తుందా? అందుకే దీని గురించి ప్రశ్నించడానికే ఈరోజు బీసీ మహాసభ పెట్టాం. నేను ఏదైనా సందర్భాన్ని బట్టే మాట్లాడతా. స్థానిక సంస్థల ఎన్నికలయిన తర్వాత మాట్లాడితే.. ఎన్నికల ముందు ఏం చేసినవ్ అంటారు. అందుకే ఇప్పుడే మాట్లాడుతున్నా. అన్నీ బయటకు తీస్తున్నా. ఇవాళ మీరు జవాబు చెప్పాల్సిందే. 42శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారో, అందులో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎలా ఇస్తారో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చింది. రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని చెప్పారామే.