కస్టడీ పొడిగింపు.. లెటర్ రిలీజ్ చేసిన ఎమ్మెల్సీ కవిత
x

కస్టడీ పొడిగింపు.. లెటర్ రిలీజ్ చేసిన ఎమ్మెల్సీ కవిత

లిక్కర్ కేసుకు సంబంధించి తనకి ఎలాంటి సంబంధం లేదని కవిత మరోసారి తెలిపారు. కేసులో తానొక బాధితురాలినని, తనకి ఎలాంటి ఆర్ధిక ప్రయోజనం చేకూరలేదని స్పష్టం చేశారు.


ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తనకి ఎలాంటి సంబంధం లేదని కవిత మరోసారి తెలిపారు. ఈ కేసులో తానొక బాధితురాలినని, తనకి ఎలాంటి ఆర్ధిక ప్రయోజనం చేకూరలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం నాలుగు పేజీల లేఖ ద్వారా ఆమె మీడియాకి వెల్లడించారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 23 వరకు పొడిగించింది. ఆమెకు గతంలో మంజూరు చేసిన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ గడువు మంగళవారంతో ముగియడంతో ఈడీ అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు హాజరుపరిచారు.

సాక్షులను ప్రభావితం చేసేందుకు కవిత ప్రయత్నించారని, సాక్ష్యాలను తారుమారు చేశారని, అందుకే ఆమె జ్యుడీషియల్ కస్టడీని 14 రోజుల పాటు పొడిగించాలని పేర్కొంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన విజ్ఞప్తిని ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా అనుమతించారు. ఇటీవల, తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీ సమయంలో కవితను వచ్చే వారంలో ఏ రోజునైనా ప్రశ్నించడానికి సీబీఐ చేసిన విజ్ఞప్తిని అదే కోర్టు అనుమతించింది.

ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తరపున న్యాయవాది జోహెబ్ హొస్సేన్, నవీన్ కుమార్ మట్టా, సైమన్ బెంజమిన్ వాదించగా, కవిత తరపున న్యాయవాదులు నితేష్ రాణా, దీపక్ రాణా, మోహిత్ రావు హాజరయ్యారు. నితేష్ రాణా ఈడీ అభ్యర్థనను వ్యతిరేకించారు.

న్యాయస్థానం వెలుపల మీడియాతో కవిత మాట్లాడుతూ, “ఇది పూర్తిగా స్టేట్‌మెంట్ ఆధారంగా జరిగిన కేసు. ఇది రాజకీయ కేసు. ఇది ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసే ఉదంతం. సీబీఐ ఇప్పటికే జైల్లో నా వాంగ్మూలాన్ని నమోదు చేసింది అని చెప్పారు.

కాగా, విచారణ సందర్భంగా జడ్జి ముందు చెప్పాలనుకున్న విషయాలను కవిత నాలుగు పేజీల లేఖలో రాసుకొచ్చారు. కానీ జడ్జి ముందు తన వాదనలను వినిపించే అవకాశం రాకపోవడంతో ఆ లేఖని మీడియాకి విడుదల చేశారు. ఎక్సైజ్ పాలసీ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం కానీ, ఆర్థిక ప్రయోజనం కానీ పొందలేదని కవిత లేఖలో పేర్కొన్నారు.


"ఈ కేసులో నేనొక బాధితురాలిని. గత రెండున్నరేళ్లలో ‘ఎప్పటికీ ముగియని’ ఈడీ/సీబీఐ దర్యాప్తు మీడియా విచారణగా మారిపోయింది. ఒక మహిళా రాజకీయ నాయకురాలిగా, ఈ ప్రక్రియలో నేను అతిపెద్ద బాధితురాలిని. నా వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నాయి. నా వ్యక్తిగత మొబైల్ ఫోన్ నంబర్ అన్ని టెలివిజన్ ఛానెల్స్ లో రివీల్ చేశారు. ఇది నా వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించింది” అని రాశారు.

తాను ED మరియు CBI రెండింటికీ సహకరించానని, నాలుగు సార్లు వారి ముందు హాజరై, వారి ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చానని, తన మొబైల్ ఫోన్‌లన్నింటినీ సమర్పించానని ఆమె పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లలో రెండు ఏజెన్సీలు అనేకసార్లు దాడులు నిర్వహించాయని, శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాయని, బలవంతంగా, బెదిరించి, అరెస్టు చేశారని ఆమె రాసుకొచ్చారు.

"ఈ కేసులో నాది కీలక పాత్ర అని, సాక్షులను బెదిరించానంటూ ED ఆరోపించింది. అలాంటప్పుడు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఎందుకు అరెస్టు చేయలేదు? మా పార్టీ అధికారంలో లేనప్పుడు మా వాదనను ఎవరూ పట్టించుకోరు అనే కదా” అని ఆమె ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోమని హామీ ఇచ్చినప్పటికీ, జాతీయ ఎన్నికలకు ముందు, బీజేపీ నేతలు "నోరు మూసుకోండి లేదంటే ఈడీని పంపుతాం" అని చేసిన వ్యాఖ్యలను అనుసరించి ఈడీ తనను అరెస్టు చేసిందని ఆమె ఆరోపించారు.

“ఈ విపత్కర పరిస్థితిలో ఉపశమనం కల్పిస్తుందని విపక్ష పార్టీలు న్యాయవ్యవస్థ వైపు ఆశగా చూస్తున్నాయి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అయినప్పటికీ కేసు దర్యాప్తుకు సహకరిస్తున్నాను, అదే కంటిన్యూ చేస్తాను. నా చిన్నకొడుకు పరీక్షలకు హాజరవుతున్నాడు. ఈ సమయంలో తల్లిగా నేను తన పక్కనే ఉండాలి. నా లోటును ఎవరూ భర్తీ చేయలేరు. నాకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా మరోసారి కోరుతున్నాను’’ అని కవిత లేఖ ద్వారా జడ్జికి విజ్ఞప్తి చేశారు.

Read More
Next Story