మోడీ, షా ఆశలన్నీ తెలంగాణా బీజేపీ పైనేనా ?
x
Narendra Modi

మోడీ, షా ఆశలన్నీ తెలంగాణా బీజేపీ పైనేనా ?

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే స్కోర్ 400 సీట్లు దాటాలని నరేంద్రమోడి టార్గెట్ పెట్టుకున్నారు.


రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే స్కోర్ 400 సీట్లు దాటాలని నరేంద్రమోడి టార్గెట్ పెట్టుకున్నారు. అందుకనే స్ధానిక పరిస్ధితుల ఆధారంగా రాష్ట్రానికి ఒక వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. 400 స్ధానాలు దాటాలంటే ఉత్తరాధితో పాటు దక్షిణాధి రాష్ట్రాలు కూడా కలిసిరావాలి. ఉత్తరాధిలో దాదాపు బీజేపీ సాచురేషన్ కు చేరుకున్నది. అందుకనే కొత్తగా దక్షిణాదిపైన మోడి, షా దృష్టిపెట్టారు. దక్షిణాది అంటే ఇప్పటివరకు ఉన్నది కర్నాటక మాత్రమే. అందుకనే రాబోయే ఎన్నికల్లో కర్నాటకతో పాటు తెలంగాణా మీద కూడా ప్రత్యేక దృష్టిపెట్టారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాలో మినిమం 10 సీట్లు, 35 శాతం ఓట్లు తెచ్చుకోవాలన్నది వీళ్ళ టార్గెట్.

మామూలుగా అయితే ఇంత పెద్ద టార్గెట్ రీచవ్వటం పార్టీకి కష్టమనే చెప్పాలి. కాకపోతే రెండు అంశాలు తమకు కలిసొస్తాయి కాబట్టి తమ టార్గెట్ రీచవ్వటం పెద్ద కష్టంకాదని కమలనాదులు అంచనాలు వేసుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా పది ఎంపీసీట్లను గెలుచుకోవాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నది. 10 సీట్లకు తక్కువ కాకుండా వీలుంటే 12 సీట్లను గెలుచుకోవటంతో పాటు 35 శాతం ఓటుషేర్ సంపాదించటమే టార్గెట్ గా పెట్టుకున్నది. మోడీ, షా పెట్టిన టార్గెట్ గనుక తెలంగాణాలో రీచైతే ఎన్డీయే స్కోర్ 400 దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే తెలంగాణాలో మోడి, షా పదేపదే పర్యటిస్తున్నది.

ఇంతపెద్ద టార్గెట్ ఎందుకు పెట్టుకున్నదంటే నరేంద్రమోడి జనాకర్షణ, అయోధ్యలో రామమందిరం నిర్మాణం తమకు బాగా కలిసొస్తుందనే ఆశలో నేతలున్నారు. రామమందిరం నిర్మాణం బీజేపీకి దక్షిణాదిలో ఎంతవరకు సానుకూలమవుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. దేశమంతా రామమందిరం మానియాలో ఉంది కాబట్టి కచ్చితంగా తెలంగాణాలో కూడా తమకు బాగా కలిసివస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు. ఉత్తరాధిలో రామమందిరం అంశం కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాని దక్షిణాదిలో ఆలయ నిర్మాణం ఏ మేరకు ప్రభావం చూపుతుందనే విషయంలో ఎవరికీ స్పష్టతలేదు. సరే వాళ్ళపార్టీ వాళ్ళిష్టం కాబట్టి ఎంతైనా అంచనాలు వేసుకుంటారు.

ఈమధ్యనే తెలంగాణాలో పర్యటించిన అమిత్ షా నేతలతో మాట్లాడుతు 10 స్ధానాల్లో కచ్చితంగా గెలవటమే కాకుండా 35 శాతం ఓట్ షేర్ సాధించాల్సిందే అని స్పష్టంగా చెప్పారు. 35 శాతం ఓటు షేర్ పై బీజేపీ నేతల అంచనాలకు చిన్న రీజనింగ్ ఉంది. అదేమిటంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి 7 శాతం ఓట్లొచ్చాయి. కొద్ది రోజుల తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్లలో గెలుపుతో పాటు 20 శాతం ఓట్లొచ్చాయి. ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలవటంతో పాటు 14 శాతం ఓట్లు తెచ్చుకున్నది. అంటే పార్టీకి 20 శాతం ఓటుబ్యాంకు ఉన్నదన్న విషయాన్ని కమలనాదులు గట్టిగా నమ్ముతున్నారు. కొంచెం కష్టపడితే అమిత్ షా చెప్పినట్లు 35 శాతం ఓట్లు కాకపోయినా కనీసం 30 శాతం ఓటుషేరన్నా తెచ్చుకోలేకపోతామా అని అనుకుంటున్నారు.

సో, సీట్లు, ఓట్ల షేర్ విషయంలో బీజేపీ నేతలు చాలా వ్యూహాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగానే ఇతర పార్టీల నుండి సీనియర్ నేతలను ఆకర్షిస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీలు బీబీ పాటిల్, పీ. రాములు ఈమధ్యనే బీజేపీలో చేరారు. అయితే వీళ్ళ ప్రభావం ఎన్నికల్లో ఎంతవరకు ఉంటుందో చూడాల్సిందే. ఎందుకంటే పార్టీ బలమే పై ఇద్దరు ఎంపీల బలం. వీళ్ళకంటు సొంతబలం చాలా తక్కువనే చెప్పాలి. కాని బీజేపీ మాత్రం వీళ్ళిద్దరి వల్ల పార్టీకి చాలా లాభం ఉంటుందని ఆశలు పెట్టుకున్నది. మొత్తం 17 సీట్లలో అభ్యర్ధులను ప్రకటించినా అక్కడక్కడ కొందరు అభ్యర్ధులపై అసంతృ వ్యక్తమవుతోంది. మల్కాజ్ గిరి అభ్యర్ధి ఈటల రాజేందర్ పై లోకల్ నేతల్లో బాగా అసంతృప్తి పెరిగిపోతోంది. బీఆర్ఎస్ నుండి వచ్చి టికెట్ ఎగరేసుకుపోయిన బీబీ పాటిల్ అంటే కూడా పార్టీ నేతలు మండిపోతున్నారు.

పార్టీపరంగా చూస్తే ఈటల రాజేందర్ కు బండి సంజయ్ కు పడదు. అలాగే అధ్యక్షుడు కిషన్ రెడ్డికి బండికి పడటంలేదు. ఇదే సమయంలో కిషన్ తో ఈటలకు కూడా మంచి సంబంధాలు లేవు. ముగ్గురు అగ్రనేతల మధ్య ట్రయాంగిల్ ఫైట్ జరుగుతోంది. అలాగే గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ కు కిషన్ కు పడటంలేదు. చాలామంది నేతల మధ్య ఏవో తగాదాలు నడుస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతే పార్టీకి ఇపుడున్న నాలుగు సీట్లు కూడా వచ్చేది అనుమానమనే చెప్పాలి. అందుకనే నరేంద్రమోడి, అమిత్ షా పదేపదే తెలంగాణాలో పర్యటిస్తు నేతలకు 10 సీట్లు, 35 శాతం ఓటు షేర్ గురించి హెచ్చరిస్తున్నది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Read More
Next Story