మోదీకి ఒక్క సక్సెస్ స్టోరీ కూడా లేదు: రేవంత్
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర ఎన్నికల(Maharashtra Elections) ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్(Congress) ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. అదే విధంగా పదేళ్లుగా దేశంలో పాలన కొనసాగిస్తున్న మోదీ(Modi) నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇటువంటి సక్సెస్ స్టోరీ ఒక్కటి కూడా లేదని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఇచ్చిన 50 వేల ఉద్యోగాల నియామక పత్రాలను తానే స్వయంగా ఎల్‌బీ నగర్‌లో అందించినట్లు కూడా గుర్తు చేశారు. పూణెలో నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పదకొండేళ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీకి గానీ, మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వానికి కానీ చెప్పుకోవడానికి ఒక్క విజయగాథ కూడా లేదని ఎద్దేవా చేశారు. ప్రతిసారీ కూడా ఎన్నికలు వస్తున్నాయంటే.. బాంబు పేలుళ్లు, ఉగ్రవాదులు వంటి ఇతరత్రా అంశాలనే ప్రధాని మోదీ తెరపైకి తెస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడం వల్లే వాళ్లు ఇటువంటి విషయాలపై ఆధారపడుతున్నారని మండిపడ్డారు. 2014 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల సమయంలో కూడా బీజేపీ ఇటువంటి మార్గాల్లోనే ప్రచారాలు చేస్తోందని విమర్శించారు.
చెప్పిందేంటి.. చేసిందేంటి..
‘‘2014 ఎనప్నికల సమయంలో ఎన్ని హామీలు ఇచ్చారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్నారు. 2022 కు ముందే దేశంలోని ప్రతి పేదవానికి ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వీటిలో ఏ ఒక్కటైనా జరిగిందా..? రైతుల ఆదాయం రెట్టింపు కావడం దేవుడెరుగు.. వారికి వ్యతిరేకంగా మూడు నల్లచట్టాలు తీసుకొచ్చారు. దాదాపు 16 నెలల పాటు రోడ్డెక్కి ధర్నాలు చేశారు రైతన్నలు. ఆ ఆందోళనల సమయంలో 700 మందికిపైగా రైతన్నలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి కూడా దేశంలో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర టాప్‌లో ఉంది. కానీ ఈ విషయంపై ప్రధాని మోదీ మాత్రం మాట్లాడారు?’’ అని ప్రశ్నలు గుప్పించారు.
నేనే ప్రశ్నించా..!
‘‘నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈ 2 కోట్ల ఉద్యోగాలపై లోక్‌సభలో ప్రశ్నించాను. అందుకు సమాధానంగా 7.50 లక్షల ఉద్యోగాలే ఇచ్చామన్నారు. దీనిని ఇచ్చిన హామీతో బేరీజు వేసుకుంటే.. చెప్పినదాంట్లో ఒక్క శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. రైతులు, పేదలు, ఉద్యోగాల విషయంలో మోదీ పూర్తిగా విఫలమైంది. ఇచ్చిన హామీలన్నింటిలో విఫలమైన మోదీ.. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న హామీలపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటు. తెలంగాణ సీఎం హోదాలో నేను ఓ ఛాలెంజ్ చేస్తున్నా. కేంద్రమంత్రి లేదా కేంద్ర ఉన్నతాధికారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి తెలంగాణకు పంపండి. వాళ్లకు అన్ని వివరాలు ఇస్తాం. అవసరమైతే వారి విమాన ఖర్చులు మేమే భరిస్తాం’’ అని సవాల్ చేశారు.
50 రోజుల్లోనే రుణమాఫీ
‘‘అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదు వేశాం. ఇందుకోసం రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశాం. దానికి సంబంధించి ప్రతి రైతు ఖాతా వివరాలను అందిస్తాం. అధికారులు తరువుగా తనిఖీ చేసుకోవచ్చు. అదే విదంగా అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇప్పటికే కోట్లాది మంది ఈ ఉచిత బస్ు పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. 2004లో సోనియా గాంధీ సూచన మేరకు దీపం పథకం కింద రూ.400కే గ్యాస్ సిలెండర్, స్టవ్‌ను ప్రభుత్వం అందించింది. మోదీ ప్రధాని అయిన తర్వాత రూ.400గా ఉన్న గ్యాస్ సిలెండర్‌ను రూ.1200 చేశారు. తెలంగాణలో తమ ప్రభుత్వం పేద ప్రజలకు రూ.500 కే సిలెండర్ ఇస్తున్నాం. దాదాపు 50 లక్షల కుటుంబాలు రూ.500కే సిలెండర్‌ను పొందుతున్నాయి. వీటికి సంబంధించిన అన్ని వివరాలను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అని రేవంత్ చెప్పారు.