ఆ ఒక్కటి మోదీ మరచిపోయారా ?
సుదీర్ఘ ఉపన్యాసంలో ప్రత్యర్ధులకు ఎందుకు ఓట్లేయకూడదో వివరించిన మోడి ఏ కారణంతో బీజేపీకి ఓట్లేయాలో మాత్రం చెప్పలేదు.
తెలంగాణా పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో రెండు బహిరంగసభల్లో నరేంద్రమోడి ప్రసంగించారు. ఉదయం కరీంనగర్లో పాల్గొన్న మోడి మధ్యాహ్నం వరంగల్ సభలో పాల్గొన్నారు. వరంగల్ సభలో మాట్లాడిన మోడి కాంగ్రెస్ కు ఎందుకు ఓట్లేయకూడదు, బీఆర్ఎస్ కు వేసే ఓట్లు ఏ విధంగా వృధాపోతాయో వివరించే క్రమంలో ఒక విషయాన్ని మరచిపోయారు. అదేమిటంటే బీజేపీకి ఎందుకు ఓట్లేయాలో జనాలకు చెప్పలేదు. సుదీర్ఘ ఉపన్యాసంలో ప్రత్యర్ధులకు ఎందుకు ఓట్లేయకూడదో వివరించిన మోడి ఏ కారణంతో బీజేపీకి ఓట్లేయాలో మాత్రం చెప్పలేదు. దాదాపు 40 నిముషాలపాటు ప్రసంగించిన మోడి కాంగ్రెస్, రాహుల్ పైన చాలా ఆరోపణలు, విమర్శలు చేశారు. రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవంద్ ను ఎంపికచేసినపుడు, ద్రౌపది ముర్మును ప్రతిపాదించినపుడు కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని ప్రస్తావించారు.
దళిత, ఆదివాసి నేతలను కాంగ్రెస్ ముఖ్యంగా రాహుల్ వ్యతిరేకించిన కారణాలను కూడా వివరించారు. ఇద్దరు కూడా నల్లగా ఉంటారు కాబట్టే తెల్లగా ఉండే రాహూల్ వ్యతిరేకించారనే విచిత్రమైన కారణాన్ని చెప్పారు. దళితులు, ఆదివాసీలను రాష్ట్రపతులుగా బీజేపీ ప్రతిపాదించటాన్ని రాహుల్ తీవ్రంగా వ్యతిరేకించారని మోడి మండిపోయారు. నిజానికి రామ్ నాథ్ కన్నా ముందే కాంగ్రెస్ కేయార్ నారాయణ్ ను రాష్ట్రపతిగా చేసిన విషయాన్ని మోడి మరచిపోయారు. వరంగల్ ఎస్సీ నియోజకవర్గంలో మాట్లాడిన మోడి కాంగ్రెస్, రాహుల్ దళిత వ్యతిరేకి అనే ముద్రవేయటానికి చాలా ప్రయత్నించారు. నల్లగా ఉన్న వారంతా ఆఫ్రికన్లని రాహుల్ కు వాళ్ళ అంకుల్ చెప్పారని మోడి ఎద్దేవాచేశారు. ఈ దేశంలో చర్మం రంగు మనిషి యోగ్యతను నిర్ణయిస్తుందని రాహుల్ అనుకుంటున్నట్లు మోడి ఆరోపించారు.
నిజానికి రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపదిని ఎన్డీయే ప్రతిపాదించింది కాబట్టి యూపీఏ తన తరపున యశ్వంత్ సిన్హాను పోటీలో పెట్టింది అంతేకాని ఆమె నల్లగా ఉందనో లేకపోతే ఆదివాసీ అనో కానే కాదు. అయితే మోడి మాత్రం తనిష్టం వచ్చినట్లు కాంగ్రెస్, రాహూల్ పై ఆరోపణలు చేసేశారు. నిజానికి వరంగల్లో మాట్లాడిన మోడి బీజేపీకి ఓట్లేయమని అడిగినపుడు గడచిన పదేళ్ళల్లో తెలంగాణాకు కేంద్రం మంజూరుచేసిన నిధులు, చేసిన అభివృద్ధిని వివరించాలి. ప్రత్యేకంగా వరంగల్ జిల్లా, వరంగల్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరించి ఓట్లేయమని అడగాలి. ఎన్నికల్లో ఎవరైనా అదే పనిచేస్తారు. కాని మోడి మాత్రం విచిత్రంగా వరంగల్ కు లేదా తెలంగాణాలో ఎన్డీయే ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, మంచిని చెప్పకుండా ప్రత్యర్ధులను దూషించటంతోనే సరిపెట్టారు.
తెలంగాణా, వరంగల్లో కేంద్రంచేసిన అభివృద్ధిని గురించి ఎందుకు చెప్పలేదంటే చేసిందేమీ లేదు కాబట్టే. పదేళ్ళ మోడి పాలనలో తెలంగాణాకు కేంద్రప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని రేవంత్ రెడ్డి, కేసీయార్ పదేపదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో కేంద్రమంత్రి, తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణాలో అభివృద్ధికి కేంద్రం రు. 10 లక్షల కోట్లు ఇచ్చిందని అంటున్నారు. ఏదో రొటీన్ గా జరిగే అభివృద్ధి, వచ్చే నిధులు వచ్చుండచ్చు కాని రు. 10 లక్షల కోట్లతో అభివృద్ధి చేసిందని కిషన్ రెడ్డి చెప్పటాన్ని జనాలు నమ్మటంలేదు. మొత్తానికి తమకు ఎందుకు ఓట్లేయాలో జనాలకు చెప్పకుండా ప్రత్యర్ధులపై ఆరోపణలు, విమర్శలు చేసి బీజేపీకి ఓట్లేయాలని అడగటమే మోడి గొప్పతనంగా ఉంది.