ఓవర్ యాక్షన్ ఫలితమిదేనా ?
x

ఓవర్ యాక్షన్ ఫలితమిదేనా ?

ముగ్గురు ప్రముఖ నేతలు డాంభికాలకుపోయి చేసిన ప్రకటనలతో బోల్తాపడ్డారు. ఎన్నికలప్రచారంలో తమను తాము చాలా ఎక్కువగా ఊహించుకున్న ఫలితం ముగ్గురికి పెద్ద షాకే ఇచ్చింది.


ముగ్గురు ప్రముఖ నేతలు డాంభికాలకుపోయి చేసిన ప్రకటనలతో బోల్తాపడ్డారు. ఎన్నికల ప్రచారంలో పదేపదే తమను తాము చాలా ఎక్కువగా ఊహించుకున్న ఫలితం ముగ్గురికి పెద్ద షాకే ఇచ్చింది. ‘ఎన్డీయేకి 400 సీట్లు ఖాయం...వైనాట్ 175 సీట్స్...ప్రధానమంత్రి రేసులో నేను కూడా ఉన్నాను’ ఇవి ఎన్నికల సమయంలో ముగ్గురు ప్రముఖులు చేసిన ప్రకటనలు. వివరాల్లోకి వెళితే వైనాట్ 175 సీట్స్ విషయంచూస్తే ఎన్నికలకు చాలాకాలం ముందునుండే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటు పదేపదే చాలెంజులు చేశారు. కుప్పంలో చంద్రబాబునాయుడును ఓడించటం ఖాయమన్నారు. పార్టీ నేతలు, అభ్యర్ధులతో సమావేశం, బహిరంగసభలు ఎక్కడ మాట్లాడినా జగన్ నినాదం ఒక్కటే వైనాట్ 175. ఫలితాల్లో చూస్తే ఏమైంది టీడీపీ కూటమి 147 సీట్లలో మెజారిటితో అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. వైసీపీ పరిస్ధితి ఏమిటంటే 12 సీట్లతో ముక్కి మూలుగుతోంది. 12 సీట్లంటే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా అర్హత కూడా కోల్పోయింది. ఫలితాల తర్వాత దేశమంతా ఏపీ వైపు నెవ్వెరపోయి చూస్తుందన్న జగన్ మాటే నిజమైపోయింది. 175 సీట్లనూ వైసీపీనే క్లీన్ స్వీప్ చేస్తుందని జగన్ చెబితే చివరకు అసెంబ్లీలో గౌరవప్రదమైన హోదా కూడా దక్కలేదు.

ఇక కేసీయార్ వ్యవహారం చూస్తే జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ చక్రంతిప్పబోతోందని, ప్రధానమంత్రి రేసులో తాను కూడా ఉన్నానని పదేపదే చెప్పారు. ప్రధానమంత్రి రేసు కాదు కదా చివరకు తెలంగాణాలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. పదేళ్ళు అధికారంలో ఉన్నపార్టీ మొత్తం 17 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటులో కూడా గెలవలేదంటే అర్ధమేంటి ?

చివరగా 400 సీట్లతో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని నరేంద్రమోడి పదేపదే దేశమంతా ప్రచారం సమయంలో ఊదరగొట్టారు. ఎన్డీయేకి 400 సీట్లు వస్తాయి ఇందులో బీజేపీకే 370 సీట్లు ఖాయమన్నారు. తీరా ఫలితాలు చూస్తే ఏమైంది ? అతికష్టమ్మీద ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తోందని అర్ధమవుతోంది. చివరి వార్తలు అందే సమయానికి ఎన్డీయే కూటమి 296 సీట్లలో మెజారిటిలో ఉంది. ఇందులో నుండి ఏవైనా రెండు గట్టి ప్రాంతీయపార్టీలు బయటకు వెళిపోతే ఎన్డీయే ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే. పై ముగ్గురి మాటల్లోను కామన్ పాయింట్ ఏమిటంటే గర్వం, అహంకారమే కనబడుతోంది. దేశంలో ప్రతిపక్షాలన్నవే లేకుండా చేయాలని మోడి, తెలంగాణా, ఏపీలో ప్రతిపక్షాలు ఉండకూడదని కేసీయార్, జగన్ గట్టిగా అనుకున్నారు. నిజానికి బలమైన ప్రతిపక్షం ఉన్నపుడే అధికారపార్టీకి విలువ పెరుగుతుందన్న విషయాన్ని వీళ్ళముగ్గురు మరచిపోయారు. ప్రతిపక్షాలన్నవే లేకపోతే ప్రజాస్వామ్యం స్ధానంలో నియంతృత్వం చోటు చేసుకుంటుంది. ఈ విషయాన్ని మోడి, కేసీయార్, జగన్ మరచిపోయి ఓవర్ యాక్షన్ చేస్తున్నారని జనాలు అనుకోబట్టే ఓటు అనే ఆయుధంతో ముగ్గురికీ ఒకేసారి గట్టిగా బుద్ధిచెప్పారు.

Read More
Next Story