మావోలకు షాక్.. మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు
x

మావోలకు షాక్.. మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు

మొన్న భార్య.. ఇప్పుడు భర్త.. 60 మందితో లొంగుబాటు


మావోయిస్ట్‌(Maoists)లకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా కీలక నేతలు, కమిటీ సభ్యులు పోలీసుల ముందు లొంగిపోతున్నారు. తాజాగా మావోయిస్ట్ పార్టీ కీలక నేత మల్లోజుల వేణుగోపాల్(Mallojula Venugopal) అలియాస్ సోను.. పోలీసుల(Police) ముందు లొంగిపోయారు. 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయన మహారాష్ట్ర(Maharashtra)లోని గడ్చిరోలిలో లొంగిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, అధికారిక ప్రతినిధిగా ఆయన కొనసాగారు. ఇకపై తాను పార్టీలో ఉండనని, కొన్ని అనివార్య కారణాల కారణంగా పార్టీని వీడుతున్నానంటూ ఆయన తాజాగా ప్రకటించారు. అన్నట్లుగానే పోలీసులు ముందు లొంగిపోయారు.

కగార్ దెబ్బతో మావోయిస్ట్‌లకు నో చాయిస్..

నక్సల్ రహిత భారత దేశాన్ని నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) ఎప్పుడో ప్రకటించారు. అందుకోసమే ఆపరేషన్ కగార్‌(Operation Kagar)ను ప్రారంభించామని, 2026 మార్చ్ 31 నాటికి భారతదేశంలో ఒక్క మావోయిస్ట్ కూడా ఉండడని షా పలు సార్లు పునరుద్ఘాటించారు. అదే విధంగా భద్రతా బలగాలు కూడా మావోయిస్ట్‌లపై ఉక్కుపాదం మోపుతూ దండకారణ్యాల్లో సెర్చ్ ఆపరేషన్లు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మావోలకు ప్రభుత్వం రెండే చాయిస్‌లు ఇచ్చింది.. ఒకటి పార్టీ కోసం భద్రతా బలగాల చేతిలో మరణించడం, లేదా పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవడం. ఈ విషయంలో చాలా మంది రెండో ఆప్షన్‌ను ఎంచుకుంటున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్ట్‌లు పోలీసుల ముందు లొంగిపోయారు.

2వేల మంది లొంగుబాటు

ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 2000 మంది మావోయిస్ట్‌లు లొంగిపోయారు. ఒక్క ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో లొంగిపోయిన వారి సంఖ్యే 1500 వరకు ఉందని అధికారులు చెప్తున్నారు. ఇక తెలంగాణలో వీరి సంఖ్య 500కు చేరినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 10 వరకు 412 మంది లొంగిపోయారని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు పలు దఫాల్లో మావోయిస్ట్‌లు లొంగిపోయారు. దీంతో తెలంగాణలో లొంగిపోయిన వారి సంఖ్య 500 వరకు చేరి ఉంటుందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. మహారాష్ట్రలో 70 మంది లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్‌తో పాటు మరో 60 మంది లొంగిపోయారు. ఇటీవల ఆయన భార్య తారక్క అలియాస్ సుజాత.. తనతో పాటు మరో 10 మందితో కలిసి లొంగిపోయారు. దీంతో మహారాష్ట్ర గచ్చిరౌలిలో లొంగిపోయిన మావోల సంఖ్య 70కి చేరింది. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2000 మంది లొంగిపోయి ఉంటారని సమాచారం. ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఇప్పటి వరకు 350 మంది మావోయిస్ట్‌లు, పలువురు కేంద్ర కమిటీ సభ్యులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. వారిలో నంబాల కేశవరావు, సుధాకర్, మధు, నవీన్, రామచంద్రారెడ్డి, రామ్‌నారాయణ్ రెడ్డి ఉన్నారు.

అసలెవరీ మల్లోజుల వేణుగోపాల్..

మధురమ్మ(మరణం: 1 అక్టోబర్ 2022), మల్లోజుల వెంకటయ్య (మరణం: 1997) దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో చిన్నవాడు వేణుగోపాల్. మావోయిస్ట్ పార్టీలో అగ్రనాయకత్వంలో పనిచేసిన కిషన్ జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావుకు తమ్ముడు. కిషన్‌జీ 24 నవంబర్ 2011న బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. వీరి అన్నయ్య మల్లోజున అంజన్న పౌరోహిత్యం చేసుకుంటున్నారు. వీరి తాత, తండ్రి ఇద్దరూ స్వాతంత్య్రయోధులు. వేణుగోపాల్.. మావోయిస్ట్‌ పార్టీలో చేరిన తర్వాత 30 సంవత్సరాల పాటు ఇంటికి దూరంగా ఉన్నారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం అతని భార్య, కమాండర్ తారక్క లొంగిపోయారు. ఇప్పుడు తాజాగా వేణుగోపాల్ కూడా లొంగిపోయారు.

వేణుగోపాల్.. పీపుల్స్ వార్ గ్రూప్‌లో నాయకునిగా పనిచేశారు. భూపతి, సోనూ, మాస్టర్, అభయ్ వంటి పేర్లను ఆయన వినియోగించారు. గడ్చిరోలిలోని అటవీ ప్రాంతంలోని ప్రత్యేక జోనల్ కమిటీ నాయకుడిగా పనిచేశారు. అతను దక్షిణ భారత దేశంలోని పశ్చిమ కనుమలకు రెండు వైపులా, కేరళ లోని గోవా నుండి ఇడుక్కి వరకు గల గెరిల్లా జోన్ ను నెలకొల్పడానికి నియమింపబడ్డాడు. చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ అజాద్ మరణం తర్వాత సీపీఐ పార్టీ అధికార ప్రతినిధిగా వేణుగోపాల్ నియమితులయ్యారు. 2010 ఏప్రిల్‌లో జరిగిన దంతెవాడ ఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన 76 మంది పోలీసుల మరణం వెనక వేణుగోపాల్ వ్యూహం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆయన తలపై భారీ వెల ఉంది. కిషన్‌జీ మరణం తరువాత అతనిని పశ్చిమ బెంగాల్ లో ఆపరేషన్ గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న లాల్‌గర్ ఉద్యమానికి నాయకునిగా నియమించారు.

Read More
Next Story