
ఎన్నికలలో కోతుల పంచాయితీ !
పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను ఓటర్లు చేస్తున్న డిమాండ్ ‘కోతుల సమస్య పరిష్కారం’
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో అభ్యర్థులు ఓటర్ల నుంచి 'కోతుల సమస్య" పరిష్కారం ప్రధాన డిమాండును ఎదుర్కొంటున్నారు.
గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తామని, డ్రైనేజులు కడతామని, డ్రింకింగ్‌వాటర్ ఇస్తామని అభ్యర్థులు గతంలో ఓట్లు అడిగేవారు. కానీ ఈసారి ఎన్నికలలో కోతుల సమస్య పరిష్కారం ప్రధాన అంశంగా అదనంగా చేరింది. కోతుల బెడదను తీర్చే వారికే ఓట్లేస్తామని అనేక గ్రామాలలో అభ్యర్థులకు స్పష్టం చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులై తే దాన్నే తమ ప్రచారాస్త్రాంగా మలుచుకుంటున్నారు. తమను గెలిపిస్తే కోతుల బెడద లేకుండా చేస్తామని కొంతమంది అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఒకరు కొండముచ్చుతో ప్రచారం చేయగా, మరోచోట ఇద్దరు ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణలతో ప్రచారం చేయించారు.
2022 సంవత్సరం అంచనా ల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల కోతులు ఉన్నట్టు అధికారుల అంచనా. ఆ సంఖ్య ఇప్పుడు మూడింతలు పెరిగి కోటికి చేరి ఉంటుందని అంచనా.
పలు గ్రామాలు, పట్టణాల్లోని కోతుల సమస్య తీవ్రంగా ఉంది. అటు పంట పొలాలనూ నాశనం చేసి, రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, మొక్కజొన్న, పల్లి, కంది, సోయా, శనగ, వేరుశనగ ఇలా ఆహార పంటలను కోతులు ధ్వంసం చేస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యంతో వచ్చే నష్టంకన్నా కోతుల మందపడి చేసే నష్టమే ఎక్కువగా ఉంటుందని రైతులు వాపోతున్నారు.
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి- భువనగిరి జిల్లాలోని అనేక గ్రామాలలో పంచాయతీ ఎన్నికలలో కోతుల సమస్య ప్రధాన అంశంగా మారింది. యాదాద్రి-భువనగిరి జిల్లా గుండాలలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కోతుల సమస్య ప్రధాన ప్రచార అంశంగా మారింది. దీనికి కారణం ఆ గ్రామంలో కోతుల సంఖ్య జనాభా కంటే ఎక్కువ ఉండటమే.
మహబూబాబాద్ జిల్లా దాట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొమ్మినేని రాములమ్మ కోతుల బెడద నుంచి విముక్తి కలిపిస్తానని ఓటు అడుగుతుంది. తనను గెలిపిస్తే ప్రతి సంవత్సరం కోతులను పట్టించి దూర ప్రాంతాలకు తరలిస్తానని హామి ఇస్తోంది.
హనుమకొండ జిల్లా నేరెళ్ల పంచాయతీలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో తమను గెలిపిస్తే కోతుల బెడద నివారణకు కృషి చేస్తామంటూ సర్పంచ్ అభ్యర్థులు జెట్టి నాగలక్ష్మి, గోల్కొండ శ్రీరాం అనుచరులు చింపాంజీ, ఎలుగు బంటి వేషధారణ వేసి గ్రామంలో వేర్వేరుగా ప్రచారం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తున్న రాజేశ్వర్ బుధవారం కొండ ముచ్చుతో ప్రచారం చేశాడు. గ్రామంలో దానిని తిప్పుతూ కోతుల బెడద తీర్చేందుకు కొండ ముచ్చును తీసుకొచ్చానని, ఓటు తనకే వేయాలని కోరుతున్నారు. గెలిచిన తర్వాత మరో మూడింటిని తీసుకొచ్చి కోతులను తరిమేస్తానని హామీ ఇచ్చాడు. హన్మకొండ జిల్లా నేరేళ్లలో తమను ఎన్నుకుంటే కోతుల బాధ తప్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఊరికే హామీ ఇవ్వడమే కాకుండా.. తమ అనుచరులకు ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణ వేయించి, వాటిని తరిమేయిస్తున్నారు. తమను ఎన్నుకుంటే శాశ్వతంగా కోతుల బెడద తప్పిస్తామని చెబుతున్నారు. కాగా గ్రామస్తులు, యువకులు ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణతో కలిసి ఫొటోలు దిగుతున్నారు. పాపం ఓట్ల కోసం ఎన్ని తిప్పలు పడుతున్నారో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ కోతుల బెదడ నుంచి తమను ఎవరైతే గట్టెక్కిస్తారో వాళ్లకే ఓట్లు వేస్తామని కొన్ని గ్రామాల ఓటర్లు ప్రచారానికి వచ్చిన అభ్యర్థులకు తేల్చి చెబుతున్నారు. ఇది చాల కష్టంతో కూడుకున్న పని అని తెలిసినా అభ్యర్థులు మాత్రం హామీ ఇస్తూ ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు.

