Monkey Menace | తెలంగాణలో కోతుల కిష్కింధకాండ
కోట్ల రూపాయలు వెచ్చించినా బెదరని తెలంగాణ వానరాలు...
తెలంగాణలోని పలు అటవీ జిల్లాల్లో కోతుల బెడద ప్రజలను అల్లాడిస్తోంది. కోతులను నియంత్రించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మల్ జిల్లాలో కోతుల సంరక్షణ,పునరావాస కేంద్రంలో సంతాన నిరోధక ఆపరేషన్లు చేస్తున్నా వీటి సంతతి మాత్రం తగ్గడం లేదు.
- తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పోడు కోసం అడవులను నరికివేస్తుండటంతో అడవుల్లో ఉండాల్సిన కోతులు జనారణ్యంలో స్వైరవిహారం చేస్తున్నాయి.పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా గుంపులు, గుంపులుగా తిరుగుతున్న కోతులు ఇళ్లలోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. జనంపై కోతులు దాడి చేయడమే కాకుండా వివిధ పంటలను నాశనం చేస్తున్నాయి. కోతుల గుంపులు తెలంగాణ పల్లెలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటిగా మారింది.పొద్దంతా వానరాల బెడద, రాత్రి అయితే అడవి పందుల సంచారంతో అటవీ గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.
ఆరు లక్షలకు పైగా కోతులు
తెలంగాణలోని పలు అటవీ జిల్లాల్లో ఆరు లక్షలకు పైగా కోతులున్నాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, మెదక్, కరీంనగర్, మెదక్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్ జిల్లాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉందని అధికారులు గుర్తించారు.కోతులు పంటపొలాలను దెబ్బతీయడంతోపాటు ఇళ్లలోకి వచ్చి ఇళ్లు పీకి పందిరేస్తున్నాయి.25 నుంచి 30 ఏళ్ల పాటు జీవించే కోతులు సంతానోత్పత్తి చేస్తుంటాయి. దీంతో కోతుల సంఖ్య నానాటికి పెరుగుతోంది.
పంటలు వేసేందుకు రైతుల విముఖత
వానరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు,రైతులు కోరుతున్నా పాలకుల్లో చలనం లేకుండా పోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కోతుల బెడదతో రైతులు ఉల్లి,కూరగాయలు టమాట,బెండకాయ,దొండకాయ, దోసకాయలు, మొక్కజొన్న, పల్లీ సాగు చేయలేక పోతున్నారంటే ఈ వానరాల సమస్య ఎంత తీవ్రంగా ఉందో విదితమవుతుంది. పంటలు వేస్తే వానరాల గుంపు వచ్చి తమ పంటలను నాశనం చేస్తున్నాయని పలు జిల్లాలో రైతులు ఆవేదనగా చెప్పారు. కోతుల భయంతో తాము పొలాల్లో పంటలు వేసేందుకు కడెం ప్రాంతానికి చెందిన పలువురు రైతులు విముఖత వ్యక్తం చేశారు.
వానరాల నియంత్రణేది?
దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామం వద్ద కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని 2020 డిసెంబరు 21వతేదీన ప్రారంభించారు.కోతులు ఎక్కువగా ఉన్న గ్రామాల పంచాయతీలు,మున్సిపాలిటీలు కోతులను పట్టుకొని వస్తే వాటికి సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేసి అడవుల్లో వదిలివేసేందుకు వీలుగా రూ.2.25 కోట్లతో తొలి కోతుల సంరక్షణ,పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినా, వానరాల నియంత్రణ పూర్తి స్థాయిలో సాధ్యం కావడం లేదు.
ముందుకు రానీ పంచాయతీలు, మున్సిపాలిటీలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోతుల బెడద ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కోతులను పట్టుకొని నిర్మల్ జిల్లాలోని తమ కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రానికి తీసుకువస్తే, వాటిని పరిశీలించి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేస్తామని ఈ కేంద్రం పశు వైద్యుడు డాక్టర్ శ్రీకర్ రాజు చెప్పారు. కోతులను పట్టుకొని తీసుకువచ్చేందుకు అయ్యే రవాణ ఖర్చులు, ఆపరేషన్ సందర్భంగా వారంరోజుల పాటు కోతిని ఈ పునరావాస కేంద్రంలో ఉంచినపుడు దానికి ఆహారాన్ని సైతం ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీలే భరించాలని వైద్యులు చెబుతున్నారు. గతంలో తెచ్చిన కోతులకు ఆపరేషన్లు చేసి, వాటిని నిర్మల్ సమీపంలోని అడవిలో పునరావాస కేంద్రం సిబ్బంది వదిలివేసేవారు. దీంతో నిర్మల్ ప్రాంతంలో కోతుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో శస్త్రచికిత్స కోసం ఎక్కడ నుంచి వానరాలను తీసుకువస్తారో అక్కడికి సమీపంలోని అడవుల్లో ఆపరేషన్ల తర్వాత వదిలివేయాలని నిబంధన విధించారు. దీనివల్ల కోతులను పట్టుకోవడం, తీసుకువచ్చి ఆపరేషన్లు చేయించడం, మళ్లీ వాటిని తీసుకువెళ్లి అడవుల్లో వదలడం పంచాయతీలు, మున్సిపాలిటీలకు భారంగా మారింది. దీంతో వారు కోతులకు సంతాన నిరోధక ఆపరేషన్లు చేయించేందుకు ముందుకు రావడం లేదు.
పిల్ల కోతులు, గర్భంతో ఉంటే...
నిర్మల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రంలో పశువైద్యాధికారి,సహాయకులతోపాటు ప్రయోగశాల,ఆపరేషన్ థియేటర్,డాక్టర్ల రెస్ట్ రూం, పరికరాలు ఉన్నాయి. కోతులను ఉంచేందుకు ప్రత్యేకంగా బోనులు కూడా ఏర్పాటు చేశారు.ఒక్కో కోతికి లాప్రోస్కోపిక్ పద్ధతిలో సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేస్తారు. దీనికి 20 నిమిషాల సమయం పడుతుందపి డాక్టర్ శ్రీకర్ రాజు చెప్పారు. ఏడాదిన్నర వయసు లోపు ఉన్న పిల్ల కోతులకు, గర్భంతో ఉన్న వానరాలకు శస్త్రచికిత్సలు చేయమని ఆయన పేర్కొన్నారు.
కోతికి ట్యాగ్ స్థానంలో పచ్చబొట్టు
గతంలో ఆపరేషన్ చేసిన కోతిని గుర్తించేందుకు వీలుగా చెవికి ట్యాగ్ వేసేవారు. శస్త్రచికిత్స తర్వాత మూడు రోజుల పాటు కోతిని బోన్లలో బంధించి ఆరోగ్య పరిస్థితిని గమనించి ఆ తర్వాత అడవుల్లో వదిలివేస్తారు. అయితే శస్త్రచికిత్స చేసిన కోతికి వేసిన ట్యాగ్ పోతుండటంతో తాజాగా త్రిశూలం ఆకారంలో కోతి నుదుటిపై పచ్చబొట్టు వేస్తున్నామని డాక్టర్ శ్రీకర్ రాజు చెప్పారు. శస్త్రచికిత్సల కోసం తమ వద్దకు తీసుకువచ్చే కోతులకు గతంలో ఆపరేషన్లు చేసి ఉంటే పచ్చ బొట్టు ద్వారా సులభంగా గుర్తిస్తున్నామని డాక్టర్ వివరించారు.
స్థానిక సంస్థల అనాసక్తి
కోతులను పట్టుకొని వాటికి సంతాన నిరోధక ఆపరేషన్లు చేయిండంపై స్థానిక సంస్థలు అనాసక్తి చూపిస్తున్నాయి. తెలంగాణలోని పలు పంచాయతీలు, మున్సిపాలిటీలు తమ ప్రాంతాల్లో సంచరిస్తున్న కోతులను పట్టుకోవడానికి ఆసక్తి చూపకపోతుండటం పట్ల ఆయా ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.కోతులను పట్టుకునేందుకు ప్రత్యేక సిబ్బంది అవసరం. అలాగే ప్రత్యేకవాహనంతో పాటు ఖర్చు కూడా అధికమవుతున్న కారణంగా గ్రామపంచాయతీలు,మున్సిపాలిటీలు కోతులను పట్టుకునేందుకు ముందుకు రావడం లేదు.
మంకీ డే
ప్రతీ ఏటా డిసెంబరు 14వతేదీన కోతుల దినోత్సవాన్ని అటవీశాఖ నిర్వహిస్తోంది. కోతులు సంక్షేమం చూస్తున్న అటవీశాఖ కోతుల బెడదతో జనం పడుతున్న అవస్థలను పట్టించుకోవడం లేదు. కోతుల బెడదను నివారించాలని గ్రామస్థులు, కోతుల బారి నుంచి తమ పంటలను కాపాడాలని రైతులు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించడం లేదు.గతంలో అడవి పందుల బెడద నివారణకు వాటిని చంపేందుకు అధికారం ఇచ్చారు.కోతుల పట్ల జనాల్లో ఒక సెంటిమెంట్ వల్ల వీటిని చంపేందుకు జనం ఇష్టపడటం లేదు.అడవి పందుల వల్ల దెబ్బతిన్న పంటలకు సర్కారు నష్టపరిహారం ఇస్తుంది.కానీ కోతుల విధ్వంసం వల్ల దెబ్బతిన్న రైతులకు కూడా పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు
కోతుల బెడదను నివారించేందుకు జిల్లాల వారీగా కోతుల సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేసేందుకు వీలుగా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. తెలంగాణలోని అన్నీ జిల్లాల్లో స్టెరిలైజేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని 2022వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, అటవీ, వ్యవసాయ శాఖ మంత్రుల కమిటీ ప్రతిపాదించినా ఒక్క కేంద్రం కూడా ప్రారంభించలేదు. అటవీ, పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖలు కోతులకు మత్తు మందులు, ఆహారం కోసం నిధులు కేటాయించాల్సి ఉండగా నిధుల కొరతతో కోతుల నియంత్రణ సజావుగా సాగడం లేదు.
ప్రాణాలు తీసిన కోతులు
- సిద్ధిపేట జిల్లా చుంచనకోటలో ఇటీవల ధర్మారెడ్డి అనే ఉపాధ్యాయుడు బైక్ పై పాఠశాలకు వెళుతుండగా ఓ కోతి అడ్డం వచ్చింది.అంతే బైక్ అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయమై రక్తస్రావంతో మరణించాడు.
- నిర్మల్ జిల్లాలో కోతుల భయంతో భవనం పై నుంచి ఓ మహిళ ఇటీవల కిందపడి మరణించింది.
- కామారెడ్డి జిల్లా రామారెడ్డి గ్రామంలో కోతుల గుంపు అన్నం తింటున్న నర్సవ్వపై దాడి చేయడంతో ఆమె తలకు తీవ్ర గాయమై మరణించింది.
కోతి చేష్టలు ఎన్నెన్నో...
- తెలంగాణలోని పలు పల్లెలు, పట్టణాలు కోతుల బెడదతో అల్లాడిపోతున్నాయి. కోతుల చేష్టలతో జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోతులు అడవులను వదిలి గుంపులుగా జనవాసాల్లోకి వస్తున్నాయి. అలా వచ్చిన కోతులు ఆహారం కోసం ఇళ్లలోకి చొరబడి నానా బీభత్సం సృష్టిస్తున్నాయి.
- గోదావరి నదీ తీరంలోని నిజామాబాద్, ఆదలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్గగూడెం, ములుగు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. తమ పంటలను నాశనం చేస్తున్నాయని నదీ తీర ప్రాంత రైతులు గగ్గోలు పెడుతున్నారు.
- అటవీ గ్రామాలు, పట్టణాల్లో కోతుల గుంపు ఇళ్లు పీకి పందిరేస్తున్నాయి. ఇళ్ల పైన, వరండాల్లో ఏమున్నా కోతులు తీసుకెళుతున్నాయి. చెత్త బుట్టలను చెల్లాచెదురు చేస్తున్నాయి. పిల్లలపై దాడి చేసి వారి చేతుల్లో పండ్లు, బిస్కెట్లు ఉంటే వాటిని లాక్కెళుతున్నాయి.
- వికారాబాద్ జిల్లా దారుల్ మండలంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
- కోతులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి.కోతుల బెడద వల్ల కూరగాయల తోటలు సాగు చేయడానికి రైతులు వెనుకంజ వేస్తున్నారు. వేస్తే కోతుల గుంపు వచ్చి వాటిని తినేస్తున్నాయని రైతులు ఆవేదనగా చెప్పారు.
- మంచిర్యాల జిల్లాలో ఏడాది కాలంలో 200 కు పైగా మంకీ బైట్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వ వైద్యులు చెప్పారు.
-కోతుల దాడిలో పలువురు గాయపడ్డారు. ఇంటి తలుపులు వేయడం మరిస్తే కోతులు లోపలకు వచ్చి వంట సామాగ్రి, దుస్తులు, ఆహారపదార్తాలను చిందరవందర చేస్తున్నాయి.విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటేనే కోతుల భయంతో వెనుకంజ వేస్తున్నారు.
- నల్గొండ జిల్లా అనుముల మండలం పేరూరు గ్రామంలో ధాన్యాన్ని ఆరబెడితే కుప్పలపై కోతుల గుంపులు పడి నాశనం చేస్తున్నాయని రైతులు లబోదిబో మంటున్నారు.
- కరీంనగర్ లో కోతులు చేస్తున్న అల్లరి ఇంతా అంతా కాదు. ఒకేసారి గుంపులకు గుంపులుగా ఇళ్లలోకి వెళ్లి చేతికి దొరికిన వస్తువులను తీసుకెళుతున్నాయి. ఎవరైనా వాటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తే వారిపై దాడి చేస్తున్నాయి.
-ఆసిఫాబాద్ లో కోతులు గుంపులు గుంపులుగా తిరుగతూ ఇళ్లు , దుకాణాలలో తినుబండరాలు, వస్తువులను ఎత్తుకెళ్లడంతో పాటు పండ్లచెట్లను ధ్వంసం చేస్తున్నాయి. ప్రజలపై దాడులకు దిగుతూ గాయపరుస్తున్నాయి.
అడవుల్లో పండ్ల మొక్కల పెంపకం
పంటలు, ఇళ్లపై కోతులు దాడి చేయకుండా ఉండేందుకు వీలుగా అడవుల్లోనే వివిధ రకాల పండ్ల మొక్కలను పెంచాలని తెలంగాణ అటవీ శాఖ నిర్ణయించింది. వికారాబాద్ జిల్లాలోని పరిగి, కొడంగల్, ధారూర్, తాండూర్, వికారాబాద్ ప్రాంతాల్లోని అడవుల్లో 2.10 లక్షల హెక్టార్లలో 40వేల పండ్ల మొక్కలను అధికారులు నాటారు. సీతాఫలం, మర్రి, మేడి, సీమచింత, జువ్వి, నక్కెర, మొర్లి, అల్లనేరెడు, చింత , మామిడి పండ్ల మొక్కలను నాటారు. కోతుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అటవీ శాఖ అడవుల్లో కోతులకు ఆహారం దొరికేలా పండ్ల మొక్కలు నాటామని వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి జ్ణానేశ్వర్ చెప్పారు.
కొండముచ్చులను తీసుకువచ్చినా...
నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ గ్రామాల మీద పడుతున్న కోతులను ఇదివరకటిలా కొండముచ్చులను తెచ్చి బెదిరించడం ఫలితమివ్వడం లేదని బాధితులు చెప్పారు. కోతుల బెడద బాధితుల సంఘం ఏర్పాటు చేశారంటే దీని సమస్య తీవ్రత తెలుస్తుంది.
గొరిల్లా వేషధారణతో...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామంలో కోతుల బెడద నివారణకు పంచాయతీ సెక్రటరీ ఓ ఉపాయం కనిపెట్టి దాన్ని అమలు చేశారు. గుంపులుగా వస్తున్న కోతులను తరిమి కొట్టేందుకు ఆన్ లైన్ లో ఓ గొరిల్లా డ్రెస్ తెప్పించి పంచాయతీ ఉద్యోగికి దాన్ని తొడిగించి గామంలో తిప్పారు. అంతే నిజంగానే గొరిల్లా వచ్చిందనే భ్రమతో కోతులు పరుగులు పెట్టాయి. గొరిల్లా వేషధారణతో గ్రామంలో తిరగడంతో అక్కడ ఒక్క కోతి కూడా లేకుండా మాయమయ్యాయి.
కొండముచ్చుల ఫ్లెక్సీలు...
కరీంనగరం పట్టణాన్ని కోతుల గుంపులు గుంపులుగా చుట్టుముట్టి వీరంగాన్ని సృష్టిస్తుంది.దీంతో కోతులకు చెక్ పెట్టేందుకు నగరవాసులు కొండముచ్చుల ఫ్లెక్సీలను ఇంటి గేట్ల ముందు ఏర్పాటు చేశారు. ఇలా ఫ్లెక్సీల ఏర్పాటుతో కోతుల బెడద కాస్తా తగ్గింది.
కొండెంగల ఫొటోలు వేలాడదీసి...
ఖానాపూర్ లో కోతులు గుంపులుగా కోతులు వచ్చి షాపుల్లోని సామాగ్రిని ఎత్తుకుపోతున్నాయి. ఈ క్రమంలో పట్టణంలోని శ్రీలక్ష్మి కిరాణా జనరల్ స్టోర్ యజమాని చంద్ర ప్రకాష్ వినూత్నంగా ఆలోచించి షాపు ముందు కొండెంగల ఫోటోలతో రెండు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు.
హైకోర్టు ఆదేశాలు బేఖాతర్
కోతుల బెడదను నివారించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఇటీవల తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎ శాంతికుమారి వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు కానీ, దీన్ని శాశ్వత నివారణకు చర్యలు తీసుకోలేదు.దీంతో హైకోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు అయ్యాయి.కోతుల నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని అటవీ, పశుసంవర్థకశాఖల అధికారులను ఆదేశించినా, కోతుల బెడద తీర లేదు.
Next Story