తెలంగాణను తాకిన రుతుపవనాలు.. పరవశించిన ప్రజలు
నైరుతి రుతుపవనాలు సోమవారం తెలంగాణను తాకాయి. నాగర్ కర్నూల్, గద్వాల్, నల్గొండ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. రుతువపనాల చినుకులతో ప్రజలు పరవశించారు.
ప్రతీ ఏటా జూన్ రెండో వారంలో తెలంగాణ రాష్ట్రానికి రుతుపవనాలు వస్తుంటాయి. కానీ ఈ ఏడాది వారం రోజుల ముందే రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి.
- ఉపరితల ఆవర్తనం వల్ల సోమవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. రాగల మూడు రోజుల పాటు దక్షిణ తెలంగాణలో భారీవర్షాలు కురవవచ్చని ఐఎండీ అధికారులు వెల్లడించారు.
రైతుల్లో వెల్లివిరిసిన సంతోషం
నైరుతి రుతుపవనాలు సోమవారం కర్ణాటక,రాయలసీమ, కోస్తా ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతాల మీదుగా తెలంగాణ లోని కొన్ని ప్రాంతాల్లో ప్రవేశించాయి.రుతుపవనాల ఆగమనంతో ప్రజలు మండే ఎండల నుంచి ఉపశమనం పొందారు. రుతుపవనాల రాకతో రైతన్నల్లో సంతోషం వెల్లివిరిసింది. రుతుపవనాలు రాబోయే 4నుంచి ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ప్రవేశించడానికి అనువైన పరిస్థితులు నెలకొన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి సునీల్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆదివారం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ - ఉత్తర తమిళనాడు తీరం వద్ద పశ్చిమ-మధ్య పరిసర నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం సోమవారం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లఎత్తులో కేంద్రీకృతమై ఉందని సునీల్ తెలిపారు.
రాగల 3 రోజులపాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఎండీ అధికారులు చెప్పారు.
వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలు
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో సోమవారం ఉరుములు,మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్టేషన్ డైరెక్టర్ నాగరత్న ‘ఫెడలర్ తెలంగాణ’కు చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని నాగరత్న తెలిపారు.మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవవచ్చని ఆమె పేర్కొన్నారు. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని ఆమె వివరించారు.
ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో సోమవారం నుంచి గురువారం వరకు నాలుగురోజుల పాటు భారీ గాలులు, ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో హైదరాబాద్ ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మంగళవారం నాడు నిర్మల్, నిజిామబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు.
ఉరుములు,మెరుపులతో భారీవర్షాలు
మంగళవారం ఆదిలాబాద్, కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో పాటు వర్షాలతోపాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు.
Next Story