
మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత
వర్షాలు కురవడంతో బ్రిడ్జిపై నుంచి పొంగుతున్న వరద నీరు
హైదరాబాద్ జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో పై నుంచి నీళ్లను క్రిందకు వదలడంతో మూసీ ఉప్పొంగింది. మూసీ నీళ్లు ప్రవహిస్తున్న మార్గాల్లో ప్రజలు వరదతాకిడికి గురవుతున్నారు. నిజాం కాలం నాటి ముసరాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వరదనీరు ప్రవహించడంతో ఈ బ్రిడ్జిని పూర్తిగా మూసేసారు. చాదర్ ఘాట్ నుంచి మలక్ పేట రోడ్డు వెళ్లే మార్గంలో ఉన్న ఈ బ్రిడ్జి హైదరాబాద్ లో అత్యంత పురాతన బ్రిడ్జిలలో ఒకటి. నిన్నటి నుంచి హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ముసరాంబాగ్ బ్రిడ్జి ప్రమాదపుటంచులకు చేరుకుంది. ఈ బ్రిడ్జిపై నుంచి ఒక్క వాహనం కూడా వెళ్లే పరిస్థితి లేదు. బ్రిడ్జిపై నుంచే వరదనీరు ప్రవహించడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు.
కొత్తేం కాదు
ప్రతీయేడు వర్షాకాలంలో భారీ వర్షాలు కురవగానే ఈ బ్రిడ్జిపై నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహించినప్పుడు బ్రిడ్జి పూర్తిగా మునిగిపోతుంది. దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యను నివారించడానికి రూ 52 కోట్ల అంచనా వ్యయంతో 6 లేన్ల బ్రిడ్జికి 2023లో శంకు స్థాపన చేశారు. 220 మీటర్ల పొడవు, 29. 5 మీటర్ల వెడల్పు వంతెనకు ఇరువైపులా 3.5 మీటర్ల కాలి బాటతో ముసరాంబాగ్ నూతన బ్రిడ్జి నిర్మాణానికి బిఆర్ఎస్ ప్రభుత్వం శంకు స్థాపన చేసింది. 2024లో నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఏడాదిలోపు బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని జీహెచ్ఎసీ అధికారులు చెప్పినప్పటికీ ఇప్పటివరకు మోక్షం లభించలేదు.
మూసా రామ్ బాగ్
18 వ శతాబ్దంలో నిజాం నవాబుల వద్ద ఫ్రెంచ్ మిలటరీ కమాండర్ ఖాన్కు మోన్సియార్ రేమండ్ ఉండేవారు. ఆయన మరో పేరు ముసారామ్. రెండవ అసఫ్ జా, నిజాం అలీకి ఖాన్కు మోన్సియూర్ రేమండ్ సన్నిహిత మిత్రుడయ్యాడు. 2వ నిజాంకు అత్యంత సన్నిహితు మిత్రుల జాబితాలోచేరిపోయారు. స్థానిక ప్రజల ప్రేమను, నమ్మకాన్ని కూడా రేమండ్ సంపాదించుకున్నారు. ముస్లింలకు, మూసా రహీమ్ గా, హిందువులకు మూసా రామ్గా ఖ్యాతి పొందారు. ఆయన నివాసం పెద్దతోటలో విస్తరించి ఉండేది. ఉర్దూలో తోటను బాగ్ అని పిలుస్తారు. కాబట్టి మూసారామ్ బాగ్ గా ఈ ప్రాంతం ప్రసిద్దిగాంచింది.