100 ఏళ్ల అద్భుతం. మెదక్ క్యాథడ్రల్ చర్చి
x

100 ఏళ్ల అద్భుతం. మెదక్ క్యాథడ్రల్ చర్చి

క్రిస్మ‌స్ వేడుక‌లు


ఆసియా ఖండంలో రెండో అతి పెద్దదైన మెద‌క్ చ‌ర్చి(Medak Church)లో గురువారంనాడు క్రిస్మ‌స్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ‘బెత్లెహెంలో దావీదు వంశంలో ఏసు జన్మించాడు. ఏసును కలిగిన బిడ్డలు నిస్వార్థంగా ఆలోచించాలి. స్వార్థ లోకంలో ప్రతిది నాది అనే ఆలోచనతో ఉంటున్నారు. ప్రతి ఒక్కరు నిస్వార్థమైన ప్రార్థనలు చేయాలి. స్వార్థం మరియ‌మ్మ‌లో లేదు. ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా ఏసుక్రీస్తు మార్గాన్ని అనుసరిస్తూ బతకాలి.’ అని ఇంచార్జి బిషప్‌ రైట్‌ రెవరెండ్‌ రూబెన్‌ మార్క్ అన్నారు.

దేశం మొత్తం కరవు పరిస్థితులతో అల్లాడుతున్న రోజులు అవి. క్రైస్తవ మత ప్రచారకుడిగా ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన రెవరెండ్ చార్లెస్ వాకర్ ఫాస్నెట్1897లో మెదక్​ పట్టణంలోని చాపెల్​ చర్చి బిషప్ గా నియమితులయ్యారు. ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చ‌ర్చి నిర్మించాల‌ని అనుకున్నాడు. వెంట‌నే అప్ప‌ట్టి నిజాంను క‌లిశారు. "ఆరో నిజాం మీర్ మ‌హ‌బూబ్ అలీ ఖాన్ ఈ చ‌ర్చి నిర్మాణానికి వెయ్యి ఎకరాల భూమిని కేటాయించారు. 1914లో ప్రారంభమైన చర్చి నిర్మాణం, 1924 డిసెంబర్ 25న పూర్తైంది. నిర్మాణంలో రాతి, డంగు సున్నం తప్ప మరో పదార్థం ఉపయోగించలేదు. శిఖరం, గోడలు, అంతర్గత నిర్మాణం వందేళ్లు గడిచినా ఎలాంటి నష్టం లేకుండా నిలిచాయి. పదేళ్ల పాటు సుమారు 12 వేల మంది కూలీలు పని చేసి జీవనాధారం పొందారు. ఒకే సారి 5 నుంచి 6 వేల మంది కూర్చునే సౌకర్యం ఉంది. 1924 డిసెంబర్ 25న ఈ క్యాథడ్రల్ పూర్తి అయింది. అప్పట్లో రూ.14 లక్షల ఖ‌ర్చు అయిందని," చారిత్రక, వారసత్వ కట్టడాల పరిరక్షణ సంస్థ ఇంటాక్ పాలకమండలి సభ్యురాలు పి.అనురాధారెడ్డి ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు.

టెక్నాలజీ, భారీ యంత్రాలు అందుబాటులో లేని ఆ రోజుల్లోనే "ఊహకందని రీతిలో అత్యద్భుతంగా ఈ చర్చిని నిర్మించారు. పూర్తిగా రాళ్లు, డంగు సున్నంతోనే నిర్మాణం పూర్తి చేశారు. విడి భాగాలన్నిటినీ ముందుగానే తయారు చేసుకుని తరువాత వాటిని క్రమంగా కలపడం అనే నూతన ప్రక్రియకు ఆనాడే పునాది వేశారు. మన దేశంలో ఈ తరహా నిర్మాణం ఇదే మొదటిదని," చ‌రిత్ర‌కారుడు మ‌హ్మ‌ద్ ఘ‌యాసుద్దీన్ అక్బ‌ర్ చెప్పారు.

"గోతిక్​ శైలిలో రూపుదిద్దుకున్న మెదక్​ చర్చి మెయిన్​ టవర్​ ఎత్తు 173 అడుగులు. పొడవు 200 అడుగులు. వెడల్పు100 అడుగులు ఉంది. మెయిన్​ ఎంట్రెన్స్​కు ఎదురుగా, కుడి, ఎడమ వైపుల ఉండే అద్దాల కిటికీలు ఈ చర్చిలో స్పెషల్​ ఎట్రాక్షన్​. తూర్పు దిక్కున ఉన్న కిటికీ అద్దం మీద ఏసు క్రీస్తు పుట్టుక, పడమర వైపు ఏసు శిలువ, ఉత్తర దిశలో క్రీస్తు సజీవుడై లేచిన దృశ్యాలు కనిపిస్తాయి. చిన్న చిన్న రంగుల అద్దాలతో ఈ మూడు కిటికీల్లో ఏసుక్రీస్తు జన్మవృత్తంతాన్ని ఇంగ్లాండ్​కు చెందిన కళాకారుడు సాలిస్​ బరీ పొందుపర్చారు. వెలుపలి వైపు నుంచి సూర్యకాంతి పడ్డప్పుడు మాత్రమే లోపలి వాళ్లకి కిటికీల్లో నిక్షిప్తమైన దృశ్యాలు కనిపించడం వాటి ప్రత్యేకత," అని ద‌క్క‌న్ హెరిటేజ్ మేనేజింగ్ ట్ర‌సీ డాక్ట‌ర్ మ‌హ్మ‌ద్ స‌ఫీవుల్లా ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు.

ఈ గాజు ముక్కలపై చిత్రణ అంతా ఇంగ్లాండ్‌లో జరిగింది. అక్కడి నుంచి విడివిడిగా తీసుకొచ్చి ఇక్కడ అమర్చారు. సూర్య కిరణాలు పడినప్పుడే ఈ చిత్రాలు దర్శనమిస్తాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్యలో మాత్రమే ఈ అద్భుతం కనిపిస్తుంది. ఉత్తర దిశలో ఉన్న మూడో కిటికీపై నేరుగా సూర్యకాంతి పడదు. అయినా అది కాశిస్తుంది. రాళ్లపై పడిన కాంతి వక్రీభవనం చెంది అక్కడికి చేరడం దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

చర్చి లోపల భక్తులు ప్రార్థన చేసేందుకు కట్టిన "విశాలమైన హాల్​లో ఫ్లోరింగ్ కోసం తెలుపు, ఎరుపు, నలుపు రంగుల ఇటాలియన్​ టైల్స్​ ఉపయోగించడం విశేషం. దేవదారు కలపతో ఈగల్​ రూపంలో తయారు చేసిన బైబిల్​ పఠన వేదిక, రంగూన్​ టేకుతో రూపొందించిన ప్రభు భోజనపు బల్ల, రోజ్​ వుడ్​తో తయారు చేసిన టేబుళ్లు, కుర్చీలు, దర్వాజాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. థామస్​ ఎడ్వర్డ్​ చర్చికి వాస్తు నిపుణులుగా పనిచేశారు," అని స‌ఫీవుల్లా చెప్పారు.

బ్రిటన్ నుండి మొజాయిక్ టైల్స్‌, ఫ్లోరింగ్‌ కోసం ఇటాలియన్ మెషన్లు తీసుకొచ్చారు. అలాగే యాష్ కలర్‌లో చెక్కిన భారీ స్తంభాలు గ్యాలరీతో పాటు మొత్తం భవనానికి పిల్లర్లుగా ఉన్నాయి. చర్చిపై కప్పును బోలు స్పాంజ్ మెటీరియల్‌తో తీర్చిదిద్దారు. దీంతో అది సౌండ్ ప్రూఫ్‌గా ఉంటుంది. ఇక 175 అడుగుల ఎత్తులో ఉండే బెల్-టవర్ కూడా చాలా దూరం నుంచే కనపడుతుంది. చర్చి నిర్మాణంలో వాడిన మార్బుల్స్‌ను ఇంగ్లండ్, ఇటలీ నుంచి తీసుకొచ్చారు. చర్చి లోపల రీసౌండ్ రాని విధంగా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు.

అప్పట్లో దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రముఖ మేస్త్రీలు, శిల్పులు, కళాకారులు, వడ్రంగులతో పాటు ఇటలీ దేశ నిర్మాణ నిపుణులు సైతం మెదక్​ చర్చి నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్నారు. చర్చి వెనక భాగంలో ఉన్న వెస్లీ గోల్​ బంగ్లా ప్యాలెస్​ను తలపిస్తుంది. చర్చి నిర్మాణం పూర్తయిన రెండేళ్లకు 1926లో క్రైస్తవ మత ప్రచారకులకు శిక్షణ ఇచ్చేందుకు దీనిని కట్టారు. ఇంగ్లాండ్​లోని ట్రినిటీ ప్యాలెస్​ తరహాలో ఉండే ఈ బంగ్లా టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ సినిమా షూటింగ్​లు కూడా జరుగుతుంటాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే ఈ చర్చిలో ఎక్కడ లేని విధంగా కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోవడం క‌నిపిస్తోంది.

Read More
Next Story