
మోస్ట్ వాంటెడ్ రౌడి షీటర్ సూరి అరెస్ట్
రౌడీ షీటర్ పైన 45 కేసులకు పైగా ఉన్నాయి
మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ సూరి అలియాస్ దాసరి సురేందర్ ను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. సురేందర్‌తో పాటు ఏడుగురితో కూడిన గ్యాంగ్ ను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు రివాల్వర్లు, మూడు మ్యాగజైన్స్, ఒక బుల్లెట్, ఒక కత్తి వంటి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ లారీ డ్రైవర్‌ను సూరి గ్యాంగ్ గన్‌తో బెదిరించిన విషయం తెలిసిందే. రౌడీ షీటర్ సూరిపై 45కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. రాచకొండ కమిషనరేట్ నుంచి సూరిపై సిటీ బహిష్కరణ వేటు పడింది. దీంతో గత కొద్ది నెలలుగా వరంగల్ అడ్డాగా ఈ గ్యాంగ్ నేరాలకు పాల్పడుతోంది.
తెలంగాణలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా పేరొందిన రౌడీ షీటర్ సురేందర్ వరంగల్ పోలీసులకు చిక్కడం సంచలనమైంది. అరెస్టయి జైలుకు వెళ్లిన ప్రతిసారి జైళ్లలో నేరస్తులతో దోస్తీ కట్టే వాడు. బెయిల్ పై విడుదలైన సూరి జైలులో పరిచయమైన నేరస్తులతో కొత్త నేరాలకు పాల్పడేవాడు. కొత్త తరహా నేరాలకు పాల్పటానికి సూరి నాటు తుపాకుల సమకూర్చుకొనే వాడు. బీహార్, యూపీ రాష్ట్రాల నుండి నాటు తుపాకులను కొనుక్కుని తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు. అమాయకులను బెదిరించి దోపిడీలకు పాల్పడేవాడు.
సూరి గ్యాంగ్ భూపాలపల్లిలో ఒక హత్యకు సుపారి తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మూడుసార్లు పీడీ యాక్ట్ ఎదుర్కొన్న ఏకైక నేరస్తుడిగా రికార్డులకెక్కాడు. చిక్కడపల్లి, ఎస్ ఆర్ నగర్, ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ లలో సూరిపై పీడియాక్ట్ నమోదు అయ్యాయి. గంజాయికి బానిసగా మారిన సూరి కొంతమంది యువకులను చేర్చుకుని గ్యాంగ్ గా తయారై అనేక నేరాలకు పాల్పడ్డాడు.

