
రేబిస్ అనుమానంతో కూతురును చంపి తల్లి ఆత్మహత్య
మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం
అనుమానం పెనుభూతమై రెండు నిండు ప్రాణాలు బలి తీసుకుంది. తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యశోద అనే మహిళ తనకు తన కూతురుకు రేబిస్ వ్యాధి సోకిందని అనుమానించింది. ఈ అనుమానం రోజు రోజుకు ఎక్కువకావడంతో యశోద విచక్షణ కోల్పోయింది. డిప్రెషన్ లో కఠిన నిర్ణయం తీసుకుంది. కూతురును చంపేసి తానూ ఆత్మహత్య చేసుకుంది. బాధితులకు రేబిస్ వ్యాధి సోకలేదని జిల్లా వైద్యాధికారులు తేల్చినప్పటికీ యశోదకు అనుమానం వీడలేదు.
నెల రోజుల క్రితం తన ఇంటి ముందు ఆరబెట్టిన పల్లీల మీద కుక్క మూతి పెట్టడమే యశోద అనుమానానికి పునాది పడింది. నెల రోజుల వ్యవధిలో ఆమె డిప్రెషన్ బారిన పడి చివరకు ఈ ఘాతుకానికి పాల్పడింది.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యశోద అనే మహిళ నెల రోజుల క్రితం తన ఇంటి ముందు పల్లీలను ఆరబెట్టి ఇంట్లోకి వెళ్లింది. తిరిగి వచ్చి చూసే సరికి వీధి కుక్క ఆ పల్లీలను తినడం చూసిన యశోద ఆ కుక్కను తరిమి కొట్టి పల్లీలను ఇంట్లోకి తీసుకెళ్లి శుభ్రంగా కడిగి తిరిగి వినియోగించింది. ఆ వీధి కుక్కకు రేబిస్ వ్యాధి ఉందన్న అనుమానంతో పల్లీలకు కూడా రేబిస్ వైరస్ సోకినట్లు యశోద బలంగా నమ్మింది.తాను పల్లీలను శుభ్రంగా కడిగినప్పటికీ రేబిస్ వైరస్ మాత్రం పల్లీలకు అంటుకుని ఉండిపోయింది అనేది ఆమె అనుమానం.కుక్క మూతి పెట్టిన పల్లీలను తిన్న కుటుంబసభ్యులందరికి రేబిస్ ఉందని తొలుత అనుమానించింది. భర్త, కొడుకు యాక్టివ్ గా ఉండటంతో తనకు, కూతురుకు మాత్రమే రేబిస్ ఉందని డిసైడ్ అయ్యింది. కూతురు అనారోగ్యంతో ఉండటంతో యశోద మానసికంగా డిప్రెషన్ కు గురైంది. అనుమానంతో జిల్లా ఆస్పత్రిలో మూడుసార్లు రేబిస్ నివారణ టీకాలు తీసుకుంది. కూతురుకు కూడా ఈ టీకాలు ఇప్పించింది. ‘‘ నెల రోజుల వ్యవధిలో ఆమెకు రేబిస్ లక్షణాలు లేనప్పటికీ డిప్రెషన్ కు గురయ్యింది’’ అని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. ఇదే విషయాన్ని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.
ఓ వైపు రేబిస్ వ్యాధి చికిత్స తీసుకుంటున్నప్పటికీ యశోద మానసికంగా మరింత కృంగిపోయింది. తను చనిపోతే మూడేళ్ల కూతురు భవిష్యత్తు ఏమిటి అని ఆందోళన చెందింది.
నవమాసాలు మోసి పెంచిన కూతురును హత్య చేసింది. తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాలో సంచలనమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లీ, కూతురు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
అనుమానంతోనే చనిపోయింది: యశోద భర్త
‘‘రేబిస్ సోకిందన్నఅనుమానంతోనే తన భార్య కూతురును హత్య చేసింది.కొడుకుకు రేబిస్ వ్యాక్సిన్ ఇప్పించాలని ఇంటి గోడలపై రాసుకుంది. నేను చనిపోతే పిల్లల్ని బాగా చూసుకో’’ అని తనకు లేఖ రాసిందని యశోద భర్త చెప్పారు. ‘‘కుటుంబ సభ్యులందరూ ఎంత చెప్పినా నమ్మలేదు. చివరకు యశోద తల్లిదండ్రులు చెప్పినా వినలేదు’’ అని భర్త తెలిపారు.
జిల్లాలో ప్రతీ రోజు కుక్క కాటు కేసులు
మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతీరోజు ఏదో ఒక చోట ప్రజలు కుక్కకాటుకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే బాధితుల సంఖ్య ఎక్కువవుతోంది. జిల్లాలో రోజుకు సగటున 16 కుక్కకాటు కేసులు నమోదు అవుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు జిల్లా వ్యాప్తంగా 3 వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి.
జనవరిలో అత్యధిక కేసులు
ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా 575 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి నుంచి జులై వరకు ప్రతినెలలోనూ 400 మందికి పైగా కుక్కకాటుకు గురయ్యారు. మొత్తం 11 మండలాల్లో గడిచిన ఏడు నెలల్లో 3,396 మంది కుక్కకాటు బాధితులున్నారని జిల్లా అధికారులు తెలిపారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి జయచంద్రమోహన్ మాట్లాడారు. ‘‘కుక్కకాటు బాధితులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా రేబిస్ వ్యాధి సోకవచ్చు’’ అని చెప్పారు.వెంటనే వైద్య సేవలు పొందాలని ఆయన సూచించారు.
తెలంగాణలో కుక్కల బెడద తీవ్రంగా నెలకొంది. శునకాలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయకపోవడంతో తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాటి సంఖ్య పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత సంవత్సరం సగటున గంటకు 14 మంది కుక్క కాటుకు గురయ్యారు. మొత్తం 13 మంది రేబిస్ బారినపడి ప్రాణాలు చనిపోయారు. కుక్క కాట్లకు ఎక్కువగా చిన్న పిల్లలు గురి అవుతున్నారు. ఎందుకంటే వాళ్లు స్కూల్ కు వెళుతున్నప్పుడు లేదా ఆరు బయట ఆడుకుంటున్నప్పుడు కుక్కకాటుకు గురవుతున్నారు.
రోడ్లపై కుక్కలు కనిపించొద్దని, వాటన్నించినీ సంరక్షణ కేంద్రాలకు తరలించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సమస్యపై విచారణకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కుక్కలకు వీధుల్లో ఆహారం పెట్టొద్దని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో డాగ్ లవర్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరికొందరు ఆందోళనలు చేపట్టారు.
రాష్ట్రంలో కుక్కల పరిస్థితి, హైదరాబాద్లో మున్సిపల్ శాఖ తీసుకుంటున్న చర్యలు, దేశంలోని చట్టాల గురించి రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు అనేక విషయాలతో అఫిడవిట్ సమర్పించింది.
‘‘సమస్యను పరిష్కరించాలంటే కుక్కలన్నింటికీ సంతాన నిరోధక ఆపరేషన్లు చేయాలి. కేంద్ర సర్కారు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ అనుమతి ఇవ్వట్లేదు. ఆయా అంశాలపై విస్తృత చర్చ జరగాలి." అని యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు డాక్టర్ కర్నాటి శ్రీనివాసులు చెప్పారు