అందాల భామల కోసం రామప్పలో కోతుల తరలింపు
x
రామప్ప ఆలయ ప్రాంతంలోని కోతులను బోనులో బంధించారు...

అందాల భామల కోసం రామప్పలో కోతుల తరలింపు

అందాల భామల కోసం రామప్ప పరిసరాల్లోని కోతులను అటవీ ప్రాంతానికి తరలించారు. సుందరీమణుల రానున్న నేపథ్యంలో కోతులు, పాముల పట్టివేతకు క్యాచర్స్‌ను రంగంలోకి దించింది.


చుట్టూ అడవులు, గుట్టల మధ్య ఉన్న ములుగు జిల్లా రామప్ప ఆలయానికి ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది.అత్యంత పురాతన పర్యాటక ఆలయంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించేందుకు ఈ నెల 14వతేదీన ప్రపంచ సుందరాంగులు రానున్నారు. మరో వైపు హన్మకొండలోని వెయ్యి స్తంభాల రుద్రేశ్వర ఆలయం, చారిత్రాత్మక వరంగల్ కోటను ప్రపంచ అందాల భామలు సందర్శించనున్నారు.




రామప్పకు రానున్న అందాల భామలు

ములుగు జిల్లాలోని పర్యాటక ఆకర్షణగా నిలిచిన పురాతన రామప్ప ఆలయం, రామప్ప సరస్సు ఈ నెల 14వతేదీన ప్రపంచ సుందరీమణులతో తళుక్కుమననుంది. 13వ శతాబ్దంలో గణపతి దేవ కాలంలో నిర్మించిన రామప్ప సరస్సు కాకతీయుల సంక్లిష్టమైన నీటిపారుదల వ్యవస్థకు తార్కాణంగా నిలుస్తుంది. వరంగల్ జిల్లా రామప్ప దేవాలయాన్ని ప్రపంచ అందాల భామలు సందర్శించనున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు పాములు, కోతులను పట్టుకునే క్యాచర్స్ ను రంగంలోకి దించారు.



రామప్ప ఆలయ పరిసరాల్లో కోతుల బెడద

ములుగు జిల్లాలోని అతి పురాతన ప్రాభవం ఉన్న రామప్ప ఆలయం పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద పెరిగింది. చుట్టూ అడవులు, గుట్టలతో కూడిన ప్రాంతం కావడంతో వానర మూకల సంచారం పెరిగింది. రామప్ప ఆలయానికి వచ్చే భక్తుల వద్ద నుంచి చేతుల్లో సంచులు, పండ్లను, ఆహారాన్ని కోతులు లాక్కొంటున్నాయి. భక్తులపై తరచూ కోతులు దాడి కూడా చేస్తున్నాయి.కోతుల దాడుల్లో పలువురు భక్తులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రామప్పలోని కోతులను పట్టుకొని అటవీ ప్రాంతానికి తరలించారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి మంకీ క్యాచర్స్
ప్రపంచ అందాల భామలు రామప్ప ఆలయ సందర్శనకు రానున్న నేపథ్యంలో ములుగు జిల్లా అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రామప్ప ప్రాంతంలో కోతుల బెడద వల్ల సుందరీమణులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా మంకీ క్యాచర్స్ ను రప్పించామని ములుగు డీఎఫ్ఓ కిషన్ జాదవ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. దీని కోసం ప్రత్యేకంగా బోనులను కూడా తెప్పించామని ఆయన తెలిపారు.

అటవీప్రాంతానికి 150 కోతుల తరలింపు
మిస్ వరల్డ్ భామల సందర్శన సమయంలో రామప్ప ఆలయ ప్రాంతంలో ఒక్క కోతి కూడా కనిపించకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఎఫ్ఓ కిషన్ జాదవ్ చెప్పారు.రామప్ప ఆలయ ప్రాంతాన్ని కోతులు లేని జోన్ గా మార్చామని ఆయన తెలిపారు. ఇప్పటికే 150కి పైగా కోతులను రామప్ప ఆలయ ప్రాంతంలో క్యాచర్లు పట్టుకున్నారని, వాటిని బోన్లలో బంధించి సమీపంలోని వెంకటాపూర్ అడవుల్లో వదిలివేసినట్లు కిషన్ జాదవ్ చెప్పారు.



పాములు పట్టేందుకు స్నేక్ క్యాచర్స్

రామప్ప ఆలయ పరిసర ప్రాంతాల్లో పాములు సంచరిస్తున్నందున అందాల భామల సందర్శన సమయంలో పాములను పట్టుకునేందుకు స్నేక్ క్చాచర్స్ ను రంగంలోకి దించామని ములుగు డీఎఫ్ఓ కిషన్ జాదవ్ చెప్పారు. ప్రపంచ సుందరాంగుల పర్యటనకు కోతులు, పాముల నుంచి ఎలాంటి విఘాతం కలగకుండా అన్నీ చర్యలు చేపట్టామని ఆయన వివరించారు.

అందాలభామల రాక కోసం విస్తృత ఏర్పాట్లు
వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రపంచ సుందరాంగుల పర్యటన సందర్భంగా తాము విస్తృత ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పారు.ఈ నెల 14వతేదీన రామప్ప , వెయ్యి స్తంభాల ఆలయాలను సాధారణ ప్రజల దర్శనాలను నిలిపివేస్తామని అధికారులు చెప్పారు. ప్రపంచ సుందరాంగుల పర్యటన సందర్భంగా ఆలయాల నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు ఎగురవేయకుండా నిషేధాన్ని విధించారు.
అందాలభామల పర్యటన సందర్భంగా మీడియా సిబ్బంది నేరుగా ఫుటేజ్ తీయడానికి అనుమతించమని అధికారులు చెప్పారు. ప్రత్యేక మీడియా సెంటర్ ఏర్పాటు చేశామని, జర్నలిస్టులను ఆ ప్రాంతానికి పరిమితం చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్లు పి. ప్రవీణ్య (హన్మకొండ), డాక్టర్ సత్య శారద (వరంగల్) టి.ఎస్. దివాకర్ (ములుగు), వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్,ములుగు ఎస్పీ శబరీష్‌లతో కలిసి భద్రత, సాంస్కృతిక ప్రోటోకాల్‌ ఏర్పాట్ల కోసం వరుస సమన్వయ సమావేశాలు నిర్వహించారు.


Read More
Next Story