ఎంపీ అరుణను కూడా లెక్కచేయని పోలీసులు
x
BJP MP DK Aruna

ఎంపీ అరుణను కూడా లెక్కచేయని పోలీసులు

మహబూబ్ నగర్ ఎంపీగా తన జిల్లాలో ఎక్కడికైనా పర్యటించే అధికారం, స్వేచ్చ తనకుందని ఎంపీ ఎంత చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు.


పోలీసులతో పెట్టుకుంటే ఇట్లే ఉంటుంది. పై నుండి ఆదేశాలు రావటమే ఆలస్యం తమ ముందున్నది ఎవరో కూడా పట్టించుకోరు. పట్టించుకోరు అనేకన్నా లెక్క కూడా చేయరంటే బాగుంటుందేమో. ఇంతకీ విషయం ఏమిటంటే రెండు రోజులుగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) నియోజకవర్గం కొడంగల్ అట్టుడుకిపోతున్న విషయం తెలిసిందే. కొడంగల్(Kodangal) లోని లగచర్ల గ్రామంలో సోమవారం గ్రామసభ జరిగినపుడు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్(Vikarabad Collector Pratik Jain) పై గ్రామస్తులు ఒక్కసారిగా దాడిచేశారు. కలెక్టర్ పై గ్రామస్తుల దాడి ఘటన పెద్ద సంచలనమైపోయింది. దాడి దెబ్బకు లగచర్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసుల హడావుడి బాగా పెరిగిపోయింది. లగచర్లలో సుమారు 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత కొందరిని విడిచిపెడితే మరికొందరిని అరెస్టు చేసి రిమాండుకు పంపేశారు.

దాడిలో పాల్గొన్నారనే అనుమానంతో ఇంకా కొందరిని పోలీసులు వెతుకుతున్నారు. ఈ నేపధ్యంలోనే లగచర్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్(BRS) అగ్రనేతలు ఇంకా గ్రామానికి వెళ్ళలేదు కాని బీజేపీ ఎంపీ డీకే అరుణ(BJP MP DK Aruna) లగచర్ల గ్రామానికి(Lagacharla Village) వెళ్ళేందుకు బుధవారం ప్రయత్నించారు. అయితే ఎంపీని పోలీసులు గ్రామంలోకి అడుగుపెట్టనియ్యలేదు. మహబూబ్ నగర్ ఎంపీగా తన జిల్లాలో ఎక్కడికైనా పర్యటించే అధికారం, స్వేచ్చ తనకుందని ఎంపీ ఎంత చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. తమపై అధికారులు ఇచ్చిన ఆదేశాలను మాత్రమే పాటించే అలవాటున్న పోలీసులు ఎంపీ మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో మండిపోయిన ఎంపీ కారులో నుండి దిగి రోడ్డుపైనే బైఠాయించారు.

ఎంపీ ఎంత గోలచేసినా, రోడ్డుపైన బైఠాయించినా సరే పోలీసులు(Police) కూడదంటే కూడదన్నారు. బాధితులను పరామర్శించేందుకు తాను వెళ్ళాలని ఎంపీ చెప్పినా పోలీసులు వినలేదు. నియోజకవర్గంలో చావులు, పెళ్ళిళ్ళతో పాటు ఇతర కార్యక్రమాలకు కూడా తనను వెళ్ళనీయరా అంటు డీకే నానా రచ్చచేసింది. ఎంపీ ఎంత గోలచేసినా, అరచిగీపెట్టినా పంపేదిలేదంతే అని పోలీసులు గట్టిగా బదులిచ్చారు. దాంతో చేసేదిలేక ఎంపీ డీకే అరుణ వెనక్కు తిరిగివెళ్ళిపోయారు.

Read More
Next Story